
గవరాజు బహుజన వారియర్స్ రచయిత
అంటరాని కులాలలో పుట్టి, రాజ్యాంగం ఇచ్చిన అవకాశాలు అందుకుని, అక్షరాలు నేర్చుకుని అటెండర్లుగా నాలుగో తరగతి ఉద్యోగులుగా గుమస్తాలుగా ఎలిమెంటరీ స్కూల్ టీచర్లుగా ఎదిగిన తరం ఒకటి ఉండేది.
తదుపరి, హై స్కూల్ టీచర్లుగా, రెవిన్యూ మరియు పంచాయతీరాజ్ శాఖలలో సీనియర్ అసిస్టెంట్లుగా, హెల్త్ డిపార్ట్మెంట్లో హెల్త్ వర్కర్లు గా ఎదిగిన తరం ఒకటి ఉండేది. ఆ తర్వాత కాలంలో డాక్టర్లు ఇంజనీర్లు పంచాయితీ రాజకీయాల్లో నాయకులుగా ఎదిగిన తరం మరొకటి వచ్చింది.
వీరంతా కులరక్కసి కోరల్లో నలిగి అస్పృశ్యత బాధలు అనుభవించి పీడనలను తట్టుకొని నిలబడి పెత్తందారులతో పెద్ద కులాలతో అణిగి మణిగి ఉంటూ తమ బతుకు తాము చూచుకున్నారు.
కానీ, కులరక్కసి దుష్కృత్యాలను పసితనం నుండీ అనుభవిస్తూ, అవకాశం చూసి ఎదుర్కొంటూ, తాను నిలబడి తన కుటుంబాన్ని నిలబెట్టి, తన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా ఎదిగించి నిలబెట్టే వాళ్లు మన సమాజంలో అత్యంత అరుదుగా ఉంటారు. అందుకు బొజ్జ బిక్షమయ్య గారు ప్రత్యక్ష ఉదాహరణ.
అస్పృశ్యతను గ్రామంలో అనుభవించి, హాస్టల్లో ఎదిరించి కళాశాలలో ఎదిరించే క్రమంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా చివరకు చిట్టచివరి దాకా నిలబడ్డాడు.
విద్యార్థిగా, కార్మిక నాయకుడిగా, పార్టీ సైద్ధాంతిక చోదకుడిగా ఆయన ఎదిగాడు.
తాను అనుభవించి జీవించి నిలిచిన క్రమాన్ని తర్వాత తరాలకు అందించటం కోసం బొజ్జా బిక్షమయ్య గారు తన జీవిత కథ ను “అస్పృశ్య యోధుడు” పేరిట ప్రచురించారు.
ఒక వ్యక్తి జీవితాన్ని కాచి వడపోసి వాస్తవానికి దగ్గరగా అక్షరబద్ధం చేయటం అత్యంత సాహసోపేతమైన చర్య.
వాస్తవానికి దగ్గరగా, అతిశయోక్తులకు తావు లేకుండా మరియు నాయకుడి వ్యక్తిత్వాన్ని పలచబారకుండా నవలీకరించటంలో రచయిత డాక్టర్ కాలవ మల్లయ్య గారి కృషి అత్యంత అభినందనీయం.
బొజ్జా బిక్షమయ్య గారి నిజజీవితంలో జరిగిన ప్రతి సంఘటనను అక్షరీకరించే క్రమంలో నవలా నాయకుడి భావాలను ప్రకటించటం, వాస్తవ సంఘటనలను జోడించడం, సహచరుల అభిప్రాయాలను, ఆలోచనలను వర్ణించటం ఎంతో సహజంగా ఉంది.
కార్మికుల సమస్యలపై బిక్షమయ్య జరిపిన పోరాటాలు, ఎదురుదెబ్బలు, కంపెనీ యాజమాన్యం నుండి, ప్రత్యర్థి యూనియన్ నాయకుల నుండి దాడులను ఎదుర్కోవటంలోనూ, హక్కుల సాధనలో కార్మికులకు విజయం దక్కటానికి వేసిన ఎత్తుగడలు, ప్రజా పాఠశాల స్థాపన కోసం చేసిన తక్షణ ఆవశ్యక అస్మిక చర్యలు చదువుతున్న పాఠకులలో ఉత్కంఠను రేపుతాయి.
తాను పనిచేస్తున్న పార్టీ తో సైద్ధాంతిక విభేదాలు, సిపిఎం పార్టీలో చేరిన తర్వాత అంబేద్కర్ భావజాలాన్ని, లాల్ నీల్ సిద్ధాంతాన్ని పార్టీలోను, ప్రజల్లోనూ వ్యాపింప చేయడానికి సహచరులు జి. రాములు మొదలైన వారి సహకారం తో చేసిన కృషి, వ్యక్తిగతంగా తాను చేసిన, చేస్తున్న సాంఘిక సేవా కార్యక్రమాలు మొదలైన అంశాలను అక్షరబద్ధం చేయటంలో అతిశయోక్తులకు తావు లేకుండా రచయిత కథనాల్ని నిర్మాణం చేసిన తీరు అత్యంత ఆసక్తికరంగా, పఠనీయంగా ఉంది.
బొజ్జ బిక్షమయ్య గారి బహుముఖీన పోరాటాలని వివరించిన ఈ గ్రంథం “అస్పృశ్య యోధుడు” వామపక్ష పార్టీల కార్యకర్తలకు, బహుజన ఉద్యమకారులకు స్ఫూర్తి మంతమైన ఆవశ్యక పఠనీయమైన గ్రంథం.
అస్పృశ్య యోధుడు నవలా నాయకుడు బొజ్జ బిక్షమయ్య గారికి, రచయిత డాక్టర్ కాలువ మల్లయ్య గారికి అభినందనలు, జై భీమ్ లు