- అక్షరమే ఆయుధంగా.. సామాజిక చైతన్యమే రాగంగా…
- పత్తిపాక నుంచి విస్తరిస్తున్న అక్షర విత్తనం
- కమర్షియల్ గీతాలు సైతం “మొగ్గం సుమన్” సొంతం
‘జన నిర్ణయం’ స్పెషల్ ఇంటర్వ్యూ…
Social Songs Aksharayuddham ‘Moggam Suman’ : తూరుపు తెల్లవారకముందే పల్లె గుండెల్లో మేలుకొలుపు పాడే చైతన్య గీతం ఆయన.. అన్యాయం జరిగిన చోట గొంతెత్తి నిలదీసే అక్షర సాయుధుడు ఆయన. ఆయనే పాటల రచయిత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వాద గళం మొగ్గం సుమన్. సాదాసీదా పదాలతోనే సామాన్యుడి గుండెను తట్టి లేపడం ఆయన శైలి. విలాసాల కోసం కాకుండా, విముక్తి కోసం ఆయన కలం కదులుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఊపిరిగా మలచుకుని, అణచివేతకు గురైన వర్గాల ఆత్మగౌరవ పతాకాన్ని తన పాటల ద్వారా ఆవిష్కరిస్తున్నారు. దీంతో పాటు కమర్షియల్ పాటలు కూడా రాయడం వీడియోలు చేయడం జరుగుతూనే ఉంది. కేవలం రచయితగానే కాకుండా, ఒక సామాజిక ఉద్యమకారుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేస్తున్న సుమన్ తన ప్రస్థానం మరియు నేటి సామాజిక పరిస్థితులపై ‘జన నిర్ణయం’ ప్రత్యేక ఇంటర్వ్యూ…
Social Songs Aksharayuddham ‘Moggam Suman’
జన నిర్ణయం : మీ కుటుంబ నేపధ్యం గురించి చెప్పండి..?
మొగ్గం సుమన్ : మాది చాలా పేదరికమైన కుటుంబం. ప్రస్తుతం హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామం మాది. చిన్న వయస్సులోనే మా నాన్న మొగ్గం సారయ్య చనిపోయారు. తదనంతరం మా తల్లి మొగ్గం సమ్మక నన్ను అన్ని విధాలుగా ప్రోత్సాహం ఇచ్చింది. నా సతిమణి “జీవిత’ ఒక రకంగా నాకు అర్థవంతమైన జీవిత భాగస్వామిగా నిలుస్తూనే ఉంది. అనేక సమస్యలు, ఒడిదుడుకులు, వివక్షల మధ్య నా కలం పదును కదులాడుతూనే ఉంది. అందరి సహాకారం, సఫోర్ట్ తో నా ప్రయాణం కొనసాగుతున్నది.
జన నిర్ణయం : మీ రచనా ప్రస్థానం ఎలా మొదలైంది..?
మొగ్గం సుమన్ : నా చిన్నతనం నుండే చుట్టూ ఉన్న అసమానతలు, అన్యాయాలు నన్ను కలిచివేసేవి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలు చదివిన తర్వాత, సమాజంలో మార్పు రావాలంటే మాట కంటే పాట శక్తివంతమైనదని నమ్మాను. అలా నా ఆవేదనను అక్షరాలుగా మార్చి పాటలు రాయడం మొదలుపెట్టాను.
జన నిర్ణయం : మీ పాటల్లో అంబేద్కర్ వాదం ప్రధానంగా వినిపిస్తుంది, దీనిపై మీ అభిప్రాయం..?
మొగ్గం సుమన్ : అంబేద్కర్ గారు కేవలం ఒక వర్గానికి చెందిన వారు కాదు, ఆయన ఈ దేశపు వెలుగు. “బోధించు, సమీకరించు, పోరాడు” అనే ఆయన నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. నా ప్రతి పాటలో ఆత్మగౌరవం, విద్య మరియు సమానత్వం గురించి ఖచ్చితంగా ప్రస్తావిస్తూ వస్తున్న.
జన నిర్ణయం : ప్రస్తుత సమాజంలో పాటల పాత్ర ఎలా ఉందని మీరు భావిస్తున్నారు..?
మొగ్గం సుమన్ : నేటి కాలంలో వినోదం కోసం వచ్చే పాటలు ఎక్కువయ్యాయి. కానీ, ప్రజల కష్టాలను, ఆకలిని, అణిచివేతను ప్రతిబింబించే పాటలే చరిత్రలో నిలిచిపోతాయి. ఒక పాట వేయి తుపాకులతో సమానం. చైతన్యం నింపే పాట ఎప్పుడూ సమాజానికి దిక్సూచిగా ఉంటుంది.
జన నిర్ణయం : మీకు బాగా పేరు తెచ్చిన పాటలు ఏవి..?
మొగ్గం సుమన్ : అంబేద్కరిజంపై నేను రాసిన పాటలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. వారు నా పాటను పాడుతుంటే నా కష్టమంతా మర్చిపోతాను. ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాత, మరపురాని మహాత్ముడా జ్యోతిరావు పూలే, ఓటు, మరువలేమయ్యా నీ సిద్ధాంతం, సమాజమా స్పందించుమా, ఎందుకు ప్రేమ, నీతో ఉండిపోనా, వచ్చిందో సద్దుల బతుకమ్మ, తీరొక్క పూల సద్దుల బతుకమ్మ, ఎత్తర చెయ్యి ఎత్తరా ఓరి సోదర తదితర పాటలు నాకు గుర్తింపునిచ్చాయి. సంతృప్తినిచ్చాయి.
జన నిర్ణయం : భవిష్యత్తులో మీ లక్ష్యాలేమిటి..?
మొగ్గం సుమన్ : అక్షరం ముక్క రాని వ్యక్తికి కూడా నా పాట అర్థం కావాలి. అట్టడుగు వర్గాల గొంతుకగా నిలబడాలి. మరిన్ని విప్లవాత్మకమైన, సామాజిక బాధ్యత గల గీతాలను రాసి, అంబేద్కర్ ఆశయ సాధనలో నా వంతు కృషి చేస్తాను.”కులం లేని, అణచివేత లేని సమాజం కోసమే నా కలం నిరంతరం శ్రమిస్తుంది”.
జన నిర్ణయం : ఓకే ఆల్ ది బెస్ట్ సుమన్. భవిష్యత్తలో మరింత సామాజిక అభివృద్ధి దిశగా మీ అడుగులు పడాలని కోరుతున్న.
మొగ్గం సుమన్ : థాంక్స్ అన్నా…
