Social justice for Dalit Christians an inevitable struggle : భారతీయ సమాజంలో దళితులు శతాబ్దాలుగా అంటరానితనం, వివక్షకు గురయ్యారు. ఈ సామాజిక పీడన నుండి విముక్తి పొందేందుకు, ఆత్మగౌరవం కోసం అనేకమంది దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. అయితే, మతం మారినంత మాత్రాన వారి సామాజిక స్థితిగతులు లేదా వారిపై జరిగే వివక్ష మారలేదు. ఈ నేపథ్యంలో, దళిత క్రైస్తవులను కూడా ఎస్సీ (SC)లుగా గుర్తించాలనే డిమాండ్ కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమే కాదు, అది ఒక ప్రాథమిక మానవ హక్కుల పోరాటం.
భారత రాజ్యాంగంలోని 1950 ఆగస్టు 10న నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కేవలం హిందూ మతంలోని దళితులకే ఎస్సీ హోదాను పరిమితం చేసింది (తరువాత సిక్కులు, బౌద్ధులను చేర్చారు). 1950లో వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం, కేవలం హిందూ మతంలోని దళితులకు మాత్రమే ఎస్సీ (SC) హోదా కల్పించబడింది. ఆ తర్వాత దళిత సిక్కు లు పోరాటం చేసి (1956), బౌద్ధ (1990) మతాల్లోని దళితులకు ఈ హోదాను విస్తరించారు. అయితే, క్రైస్తవ మతాల్లోని దళితులకు మాత్రం నేటికీ ఈ హక్కు నిరాకరించబడుతోంది. ఇది రాజ్యాంగం ప్రసాదించిన ‘సమానత్వ హక్కు’ (Article 14) , ఏ పౌరునికి కేవలం మతం, జాతి, కులం, లింగం , జన్మస్థలం ఆధారంగా రాష్ట్రం వివక్ష చేయకూడదు (ఆర్టికల్ 15) మరియు ‘మత స్వేచ్ఛ’ (Article 25) కు విరుద్ధమని రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు.
Social justice for Dalit Christians an inevitable struggle
కానీ వాస్తవం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి మతం మారినప్పటికీ, సమాజం అతన్ని దళితుడిగానే చూస్తుంది. కుల వివక్ష అనేది మతాతీతమైన సామాజిక రుగ్మతగా కొనసాగుతూనే ఉంది. మరోవైపు మతం మారిన దళితుల ఆర్థిక స్థితిగతుల్లో పెద్దగా మార్పు రాలేదు. వారు నేటికీ అట్టడుగు వర్గాలుగానే జీవిస్తున్నారనేది నగ్నసత్యం. ప్రభుత్వ రిజర్వేషన్లు అందక దళిత క్రైస్తవులు నిర్లక్ష్యం చేయబడుతూనే ఉన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రకారం అందరికీ సమానత్వం, ఆర్టికల్ 25 ప్రకారం మతపరమైన వివక్ష ఉండకూడదని చెబుతోంది. కేవలం మతం ప్రాతిపదికన ఎస్సీ హోదాను నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని మేధావుల వాదనలో సత్యం ఉందనేది గుర్తించాలి. జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ దళిత క్రైస్తవులను, దళిత ముస్లింలను 2004 నుండి 2005 వరకు అధ్యయనం చేసి ఎస్సీ జాబితాలో చేర్చాలని స్పష్టంగా సిఫార్సు చేసింది. కులం అనేది పుట్టుకతో వచ్చేదని, అది మత మార్పిడితో పోదని ఈ కమిషన్ పేర్కొంది. ఈలెక్కన దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించకుంటే తీరని అన్యాయం చేయడమే అవుతుందని ప్రభుత్వాధినేతలు గుర్తించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడం అంటే అది ఎవరికో ఇచ్చే దానం కాదు, అది దశాబ్దాలుగా జరుగుతున్న చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దడం. కులం అనేది భారతీయ సమాజంలో ఒక చేదు నిజం. మతం మారినంత మాత్రాన కుల వ్యవస్థలో పేరుకుపోయిన వివక్ష తొలగిపోదు కాబట్టి, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించడం ద్వారానే వారికి నిజమైన సామాజిక న్యాయం జరుగుతుంది. “మతం వ్యక్తిగతం – కులం సామాజికం. సామాజిక వివక్ష ఉన్నంత కాలం ఎస్సీ హోదా దళిత క్రైస్తవుల హక్కు.” “మత స్వేచ్ఛ రాజ్యాంగం హక్కు” కాబట్టి దళిత క్రైస్తవుల ఐక్యత పోరాటం అనివార్యం అవుతున్నది. ఈ సుదీర్ఘ పోరాటంలో విజయం సాధించాలంటే దళిత క్రైస్తవ సమాజం ఐక్యంగా ఉండటం ఎంతో అవసరం.
Social justice for Dalit Christians – an inevitable struggle
మన మూలాలు దళితత్వంలో ఉన్నాయని గుర్తించి, ఇతర దళిత సోదరులతో కలిసి పోరాడాలి. తమ హక్కుల గురించి గొంతెత్తాలి. నాయకత్వాన్ని నిర్మించుకోవాలి. క్రైస్తవ సంస్థలు కూడా తమలోని దళిత క్రైస్తవుల సమస్యలను గుర్తించి బాసటగా నిలువాలి. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చి గుర్తింపు ఇచ్చేలా ఐక్యంగా ముందుకు సాగాలి. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని “దళిత క్రైస్తవ ఐక్యవేదిక ” గొంతెత్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక సభలు, సమావేశాలు నిర్వహించి దళిత క్రైస్తవులను కదిలిస్తూ వస్తున్నది. ఈ వెలుగులోనే జనవరి 26న రిపబ్లిక్ డే ను పురస్కరించుకొని వరంగల్ క్రిస్టియన్ కాలనీ ప్రతాప్ నగర్ లో సభను నిర్వహిస్తోంది. ఈ సభకు దళిత క్రైస్తవులు, ప్రముఖులు అధిక సఖ్యలో హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి.
- ఈర్ల కుమార్ మాదిగ దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్
