- అభివృద్ధి పేరిట విధ్వంసకాండ..!!
- సహజ వనరుల విధ్వంసం – ఒక హెచ్చరిక
Silently weeping rocks : ప్రకృతి ప్రసాదించిన వనరులు మానవ మనుగడకు ఆధారం. కానీ, నేడు అభివృద్ధి పేరుతో సాగుతున్న “వనరుల వేట” పర్యావరణ సమతుల్యతను దారుణంగా దెబ్బతీస్తోంది. కొండలు, గుట్టలు కేవలం రాళ్ల ప్రోగులు కావు. అవి స్థానిక శీతోష్ణస్థితిని నియంత్రించే శక్తి కేంద్రాలు. వరంగల్ జిల్లా చుట్టుపక్కల ఉన్న గుట్టల విధ్వంసంతో పాటు రాష్ట్రం, దేశవ్యాప్తంగా అభివృద్ధి పేరుతో జరుగుతున్న సహజ వనరుల విధ్వంసం వల్ల భవిష్యత్తు తరాల భవిష్యత్తు ప్రశ్నార్థకం కాక తప్పదని ఇప్పటికే అనేక అధ్యయనాలు రుజువు చేస్తూనే ఉన్నాయి. అయితే గుట్టలను మనం కేవలం గుట్టలే కదా అనుకుంటాం. కానీ గుట్టలు వర్షపు నీటిని పట్టి ఉంచి, భూమిలోకి ఇంకేలా చేస్తాయి. గుట్టలను పిండి చేయడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గి, బోర్లన్నీ ఎండిపోతున్న పరిస్థితి అనేక చోట్ల ప్రస్తుతం ఉంది. అంతే కాదు జీవవైవిధ్యం కూడా దెబ్బ తింటున్నది. నెమళ్లు, కుందేళ్లు, అరుదైన వనమూలికలకు ఈ గుట్టలే నివాసాలు. నేడు క్రషర్ల ధాటికి ఇవి అంతరించిపోతున్నాయి.
Silently weeping rocks..!?
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శాయంపేట, హన్మకొండ, దామెర, ఆత్మకూర్, కాజీపేట శివార్లు, ధర్మసాగర్, స్టేషన్ ఘన్పూర్, కురవి, కేసముద్రం,, నల్లబెల్లి తదితర మండలాల పరిసరాల్లో స్టోన్ క్రషర్ల జోరు పెరిగింది. కొన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా డాంబర్ ప్లాంట్లు వెలిశాయి. ఇంకొన్ని చోట్ల గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. అనుమతులకు మించి తవ్వకాలు యధేచ్ఛగా జరుగటం సర్వసాధరణంగా మారింది. పదుల సంఖ్యలోని ఎకరాలకు అనుమతి తీసుకుని, వందల ఎకరాల్లో గుట్టలను నామరూపాలు లేకుండా చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ శూన్యంగా మారడంతో క్రషర్ల నుండి వచ్చే దుమ్ము చుట్టుపక్కల పంటలు పండకుండానష్టాన్ని చేకూరుస్తుండటంతో పాటు, ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడే పరిస్థితకి బలవంతంగా నెట్టివేస్తున్న పరిస్థితి బహిరంగ రహస్యగా మారింది. ఇక నిబంధనల ప్రకారం వాడాల్సిన దానికంటే ఎక్కువ శక్తివంతమైన పేలుడు పదార్థాలను వాడుతుండటంతో, సమీపంలోని ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి. దద్దరిల్లిపోయే పెలుడుపదార్థాల శబ్థాలు పలు గ్రామాల్లోని జనానికి నిత్యకృత్య అలవాటుగా మారింది. ఇంతజరుగుతున్నా ప్రశ్నించే వారులేక, ఒకవేల ప్రశ్నించినా, ఫిర్యాదులు చేసినా చర్యలు చేపట్టే అధికారులు లేకపోవడంతో నిస్సహయంతప్ప చేసేది ఏం లేకుండా పోతుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
Silently weeping rocks..!?
ఇంకోవైపు ఒకప్పుడు నగరాల చుట్టూ గ్రామాల చుట్టూ రక్షణ కవచాల్లా ఉన్న గుట్టలు నేడు వెంచర్ల పేరుతో, కంకర క్వారీల పేరుతో మైదానాలుగా మారుతున్నాయి.
ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాల్లో సైతం మైనింగ్ మాఫియా కన్నేయడం ఆందోళనకరం. అభివృద్ధి పేరుతో వేల ఎకరాల్లోనూ అడవుతను సైతం లేకుండా చేసే చర్యలను ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం. మనం ప్రకృతిపై చేస్తున్న ఈ దాడి తిరిగి ఎదొ ఒకరోజు మన మీదకే వస్తుంది. ఇప్పటికే ప్రకృతి పర్యవరమ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అడవుల నరికివేత, కొండల పిండి కొట్టడం వల్ల అకాల వర్షాలు లేదా తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. గాలిలో ధూళి కణాలు పెరిగి ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలుతాయి.
సహజ సిద్ధమైన గాలి మళ్లింపు లేక నగరాల్లో ఉక్కపోత పెరుగుతుంది. ఈ పర్యవసనాల ఫలితం ఇప్పటికే చూస్తున్నాం. అభివృద్ధి అవసరమే, కానీ అది పర్యావరణాన్ని బలిపెట్టి చేసేది కాకూడదు. అధికారులు నిబంధనలు ఉల్లంఘించే క్రషర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. “ఈరోజు మనం కొండలను మింగేస్తే.. రేపు పర్యావరణం మనల్ని మింగేస్తుంది” అన్న సత్యాన్ని గ్రహించి, మన గుట్టలను మనం కాపాడుకోవాలి.
- రాజేందర్ దామెర (దారా) సీనియర్ జర్నలిస్ట్ – వరంగల్ సహజ వనరుల పరిరక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు
-
