Silence is your declaration of freedom ఇప్పుడు మనం నిశ్శబ్దం గురించి కాస్త మాట్లాడుకుందాం. నిశ్శబ్దం అనేది శూన్యం కాదు, అది ఒక నిండుతనం. ఈ సమాజం మనల్ని మాటలతో, నిర్వచనాలతో బంధించాలని చూస్తున్నప్పుడు, “నేను మీకు అందను” అని చెప్పే నిశ్శబ్దమే మన స్వేచ్ఛా పతాకం. అది మనల్ని మనకే పరిచయం చేస్తుంది. ”నిశ్శబ్దం అనేది ఒక రకంగా స్వేచ్ఛకు పునాది. “నిశ్శబ్దమే నీ స్వేచ్ఛా ప్రకటన” ఈ మాట వినడానికి సాదాసీదాగా అనిపించినా, దీని వెనుక అనంతమైన తాత్వికత, మానసిక లోతు ఉంది. ఆధునిక ప్రపంచంలో “మాట్లాడటమే” ఉనికి అని భావిస్తుంటారు. “నిశ్శబ్దం”గా ఉండటాన్ని నిస్సయతగా అనుకుంటుంటారు. “నిశ్శబ్దం”గా ఉన్నవారిని శక్తిలేనివారిగా ఒంటరైనవారిగా భావిస్తుంటారు. కానీ “నిశ్శబ్దం”అనేది ఒక తిరుగుబాటుగా, అత్యున్నత స్వేచ్ఛా ప్రకటనగా చూడాలి. అంతే కాదు చాలామంది నిశ్శబ్దాన్ని నిస్సహాయత అనుకుంటారు. కానీ నిజానికి, అనవసరమైన చోట మౌనంగా ఉండగలగడం అత్యున్నతమైన శక్తి. ఈ ప్రపంచం మనల్ని రకరకాల అభిప్రాయాలతో ప్రభావితం చేయాలని చూస్తున్నప్పుడు, వాటన్నింటినీ కాదని మనలో మనం స్థిరంగా ఉండటమే నిజమైన స్వేచ్ఛ. నేటి సోషల్ మీడియా కాలంలో ప్రతి చిన్న విషయానికి స్పందించడం ఒక అలవాటుగా మారింది. అందరూ ట్రెండింగ్ విషయాల మీద పోస్టులు పెడుతున్నప్పుడు, మీరు ఏమీ స్పందించకుండా ఉండటం కూడా ఒక గొప్ప స్వేచ్ఛే. అది “నేను ఈ డిజిటల్ గొర్రెల మందలో భాగం కాదు” అని మీరు మీకు ఇచ్చుకునే స్వేచ్ఛా ప్రకటన. మనం చూస్తుంటాం. మనం ఎప్పుడూ ఇతరులకు సమాధానం చెప్పాలనే తాపత్రయంలో ఉంటాం. ఎవరైనా విమర్శిస్తే వెంటనే కౌంటర్ ఇవ్వాలి అనుకుంటాం. ఎవరైనా ఆరోపణలు చేస్తే కంగారు పడటంమో, ఉలిక్కిపడటమో చేస్తుంటాం. కానీ “నేను ఎవరికీ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు” అని మీరు అనుకున్న క్షణం, మీరు స్వేచ్ఛా జీవి అవుతారు. సమాజంలో మన గురించి రకరకాల పుకార్లు లేదా విమర్శలు వస్తుంటాయి. ప్రతిదానికీ వివరణ ఇచ్చుకుంటూ పోతే మన శక్తి వృధా అవుతుందని గ్రహించాలి. మౌనంగా ఉండి తమ పని ద్వారా సమాధానం చెప్పడం అంటే ఆ మౌనం “నా విలువ నాకు తెలుసు, మీ సర్టిఫికెట్లు నాకు అక్కర్లేదు” అనే స్వేచ్ఛను ప్రకటిస్తుందని అందరికి అర్థం కానీ నిశ్శబ్ద స్వేచ్ఛా ప్రకటన. శబ్దం ఉన్న చోట గందరగోళం ఉంటుంది. నిశ్శబ్దం ఉన్న చోట స్పష్టత ఉంటుంది. గొప్ప ఆవిష్కరణలు, లోతైన ఆలోచనలు అన్నీ ప్రశాంతమైన మౌనంలోనే పుడతాయి. మనల్ని మనం తెలుసుకోవడానికి ఒక అత్యున్నతమైన ఆయుధంగా ఉంటుంది. కొన్నిసార్లు నిశ్శబ్దం అత్యంత శక్తివంతమైన నిరసనగా కూడా ఉంటుంది. అనవసరమైన తర్కాలకు తావు ఇవ్వకుండా, మౌనంగా తన పని తాను చేసుకుపోవడం అనేది ఎదుటివారి అహంకారాన్ని దెబ్బతీసే ఒక పదునైన యుద్ధ ప్రకటన కూడా అనేది ఆ మౌన తాత్వాకత కలిగిన మనుషులకు ఉంటుంది.
ఇక్కడ మనం ఎంతోకొంత అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే ”నిశ్శబ్దమే నీ స్వేచ్ఛా ప్రకటన” అంటే అర్థం నీ మనసుపై నీకు పూర్తి నియంత్రణ ఉందని ప్రపంచానికి చాటి చెప్పడం. మాటల ప్రవాహంలో కొట్టుకుపోకుండా, నీ నిశ్శబ్దంలో నువ్వు గంభీరంగా నిలబడగలిగితే, అదే నీ అసలైన గెలుపు. నీవు ఎంత తక్కువగా మాట్లాడితే, ప్రపంచం నీ మాటల కోసం అంత ఎక్కువగా వేచి చూస్తుంది. నీ మౌనం నీ బలం కావాలి కానీ బలహీనత కాకూడదు. అందుకే ఎదుటి వ్యక్తి నిశ్శబ్దంగా ఉంటే అదేదో బలహీనతగానో, నిస్సయతగానో చూడటం అజ్ఞానమే అవుతుంది. నిశ్శబ్దంగా ఉన్న వ్యక్తిలో తాత్విక కోణంలో స్వేచ్ఛా ప్రకటన, ధిక్కారం, ఈ సమాజం విధించే అనవసరమైన నిబంధనలు తోసిపుచ్చుతూ నిశ్శబ్ద స్వేచ్ఛా ప్రకటన చేస్తున్నాడా అనేదే ప్రమాణికంగా ఉంటుంది.
- రాజేందర్ దామెర (దారా) సీనియర్ జర్నలిస్ట్
