- న్యాయం కోసం సుదీర్ఘ నిరీక్షిస్తున్న విచారణ ఖైదీలు..
- చట్టం ముందు అందరూ సమానులేనా..?
- కటకటాల వెనుక కరిగిపోతున్న కాలం
- శిక్ష పడకముందే ‘బందీ’ అవుతున్న బతుకులు..!
- అండర్ ట్రాయల్ ఖైదీల దీనగాథపై ప్రత్యేక కథనం
Searching for prisoners under investigation within prison walls : “నేరం రుజువు కాలేదు… శిక్ష ఖరారు కాలేదు… కానీ దశాబ్ద కాలంగా చీకటి గదులే వారి ప్రపంచం. ‘చట్టం ముందు అందరూ సమానులే’ అన్న రాజ్యాంగ సూత్రం, ‘నేరం రుజువయ్యే వరకు నిందితుడు నిర్దోషే’ అన్న న్యాయ నిబంధన ఇనుప ఊచల వెనుక నలిగిపోతున్నది. దేశవ్యాప్తంగా జైళ్లలో మగ్గుతున్న ప్రతి నలుగురిలో ముగ్గురు ‘విచారణ ఖైదీలే’అంటూ విశ్లేషణలు తెలుపుతున్నాయి. భారత న్యాయ వ్యవస్థలోని లోపాలకు ఈ స్థితి నిలువుటద్దమనేది గమనార్హం. ఒకరకంగా ఈ స్థితి వల్ల న్యాయం ఆలస్యమవ్వడమే కాదు, ఇక్కడ న్యాయమే బందీ అయ్యింది.”
Searching for prisoners under investigation within prison walls..!?
ఇక మనదేశంలో నేర విచారణ వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య పెరిగిపోవడం. వీరంతా నేరం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే తప్ప, నేరం రుజువైన వారు కాదు. అయినప్పటికీ, దేశంలోని జైళ్లు వీరితోనే కిక్కిరిసిపోతున్న పరిస్థితి ఉంది. జాతీయ స్థాయిలో తాజా గణాంకాల ప్రకారం (NCRB మరియు ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025-26 అంచనాల ప్రకారం) అండర్ ట్రయల్స్ శాతం భారత జైళ్లలో ఉన్న మొత్తం ఖైదీలలో సుమారు 74% నుండి 76% మంది విచారణ ఖైదీలే అంటూ తెలుపుతున్న స్థితి ఉంది. దీనికనుగుణంగా జైళ్ల సామర్ధ్యం కూడా పెరుగటం లేదనేది గమనార్హం. ఏండ్ల తరబడి అండర్ ట్రయల్ ఖైదీలు సుమారు 5 ఏళ్లకు పైగానే జైళ్లలోనే మగ్గుతున్నారని, ఇలాంటి వారు వేల సంఖ్యలో ఉన్నట్లు, చాలా ఎక్కువ సంఖ్యలో రాబోయే గరిష్ట శిక్ష కంటే ఎక్కువ కాలం విచారణ పేరుతో జైల్లోనే గడపడం గమనార్హం. ఇక ముఖ్యంగా జైళ్లలో ఉన్న వారిలో 65% కంటే ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన పేదలే. సొంత పూచీకత్తు కూడా సమర్పించలేక, న్యాయవాదిని పెట్టుకోలేక వీరు ఏళ్ల తరబడి జైళ్లలోనే మగ్గిపోతున్న దుస్థితి నెలకొంది.
Searching for prisoners under investigation within prison walls..!?
ఇక తెలంగాణ రాష్ట్రంలో జైళ్ల వ్యవస్థ జాతీయ సగటుతో పోలిస్తే కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో ఖైదీల సంఖ్య వేగంగా పెరుగుతున్నట్లు పరిస్థితి చూస్తే అర్థం అవుతున్నది. గణంకాలు కూడా తెలుపుతున్నాయి. తాజా లెక్కల (2025) ప్రకారం తెలంగాణ జైళ్లలో ఖైదీల సంఖ్య 2024లో ఉన్న సంఖ్యకంటే 2025 నాటికి అది 5 వేలకు పైగానే పెరుగటం గమనార్హం. ఈ మొత్తం ఖైదీలలో సుమారు 65 శాతం నుంచి 75 శాతం మంది అండర్ ట్రయల్ ఖైదీలే కావడం గమనార్హం. అంటే రాష్ట్రంలోని ఖైదీలలో అత్యధికులు విచారణ ఎదుర్కొంటున్న వారే అనేది గమనించాల్సిన అంశం.
Searching for prisoners under investigation within prison walls..!?
చర్లపల్లి, చంచల్గూడ వంటి ప్రధాన జైళ్లు వాటి సామర్థ్యం కంటే 60-70% అదనపు ఖైదీలతో నిండిపోయినట్లు ఎవరికైనా అర్థం కాలేదంటే చేసేదేమీ ఉండదు. వరంగల్ సెంట్రల్ జైలును మూసివేసి ఆస్పత్రిగా మార్చే ప్రక్రియ సాగుతుండటం వల్ల, అక్కడి ఖైదీలను ఇతర జిల్లాలకు తరలించడం రద్దీని మరింత పెంచినట్లైంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే జైళ్లు అంటే సంస్కరణా నిలయాలు కావాలి, కానీ ప్రస్తుత పరిస్థితులు నరకప్రాయంగా మారుతున్న పరిస్థితి ఉంది. సామర్థ్యం కంటే ఎక్కువ మంది ఉండటం వల్ల ఖైదీలకు కనీస గాలి, వెలుతురు, నిద్రించే స్థలం కూడా కష్టంగా మారింది. ఇక దురదృష్టం ఏంటంటే దీర్ఘకాలిక బందీఖానా వల్ల ఖైదీలలో డిప్రెషన్, ఆత్మహత్య ధోరణులు పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు జైలు, వైద్య సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. ఇంకోవైపు లీగల్ ఎయిడ్ అథారిటీలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో చాలా మంది ఖైదీలకు తమ కేసు ఏ దశలో ఉందో, బెయిల్ ఎలా పొందాలో కూడా తెలియని పరిస్థితి ఉందంటే అంటర్ ట్రాయల్ ఖైదీల స్థితి ఎలా ఉందో, జైళ్ల పరిస్థితి, న్యాయవ్యవస్థ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. ఈ స్థితి విచారణ ఖైదీల సమస్య కేవలం జైళ్ల శాఖది మాత్రమే కాదు, ఇది మొత్తం న్యాయ వ్యవస్థ లోపంగా భావించక తప్పదేమో..? ఇలాంటి స్థితిలో జనాభా నిష్పత్తికి అనుగుణంగా న్యాయమూర్తుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. నిందితుడు తనకు పడే గరిష్ట శిక్షలో సగం కాలం జైల్లో ఉంటే, వెంటనే విడుదల చేయాలనే నిబంధనను కఠినంగా అమలు చేయాలి. ముఖ్యగా అనవసర అరెస్టులు తగ్గించి, ఛార్జీషీట్లను నిర్ణీత కాలంలో దాఖలు చేయాలి. ముఖ్యంగా ”జైలు గోడలు సంస్కరణలకు వేదిక కావాలి కానీ, నిర్దోషుల జీవితాలను బలిపీఠాలుగా మార్చకూడదు.” శిక్ష పడకముందే ఏళ్ల తరబడి జైల్లో ఉంచడం అంటే రాజ్యాంగం కల్పించిన ‘జీవించే హక్కు’ను కాలరాయడమే. విచారణ ఖైదీల సమస్య కేవలం జైళ్ల శాఖది మాత్రమే కాదు, ఇది దేశ ప్రజాస్వామ్యానికే ఒక పరీక్ష. చట్టం తన పని తాను వేగంగా చేసుకుంటూ వెళ్లినప్పుడే సామాన్యుడికి న్యాయంపై నమ్మకం కలుగుతుంది. “ఆలస్యమైన న్యాయం.. న్యాయాన్ని నిరాకరించడమే” అనే నినాదం కాగితాల మీద కాకుండా క్షేత్రస్థాయిలో అమలు కావాల్సిన అవసరం ఉంది.
రాజేందర్ దామెర (దారా) సీనియర్ జర్నలిస్ట్ rajenderdamera@mail.com
