
చారిత్రాత్మక వరంగల్ నగరంలో సీపీఐ (యమ్.యల్) లిబరేషన్ తొలిసారిగా జన సభను డిసెంబర్ 6న నిర్వహిస్తోంది. వరంగల్ నగరం విప్లవోద్యమాలకు పురిటి గడ్డగా విలసిల్లి ప్రత్యేకత కలిగి ఉంది. దేశంలో ఎమర్జెన్సీ అమలవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫాసిస్టు శక్తుల ప్రమాదం రోజురోజుకి పెరుగుతుంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నేటికీ నెరవేరలేదు. ఈ నేపథ్యంలో వరంగల్ నగర కేంద్రంగా జరుగుతున్న జనసభ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సభను అన్ని తరగతుల ప్రజలు జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది.
ఫాసిజాన్ని తిరస్కరించండి..
మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తన ఫాసిస్ట్ చర్యలను తీవ్రతరం చేస్తుంది. ప్రజా తీర్పును గౌరవించకుండా రాజ్యాంగాన్ని అపహస్య పాలు చేస్తుంది. ప్రజల హక్కులను, ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు నిరాకరిస్తుంది. ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛలో పతన స్థాయిలో ఉంది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారు. ఒకే దేశం – ఒకే ఎన్నిక అంటూ “జమిలి” పేరుతో విద్వేష రాజకీయాలను కొనసాగిస్తున్నారు. హిందూ దేశం ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ హిందూత్వ ఎజెండాను అమలు చేస్తున్నారు. పెరుగుతున్న ధరలను, నిరుద్యోగాన్ని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు. సంక్షేమ పథకాల పేరుతో మభ్యపెడుతున్నారు. సహజ వనరులను, దేశ సంపదను ఆదాని అంబానీ లాంటి పెట్టుబడిదారులకు అభివృద్ధి పేరుతో దోచి పెడుతున్నారు. ఆదివాసీలు, దళితులు, మహిళలు, మైనారిటీ ప్రజానీకంపై దాడుల పరంపర కొనసాగుతోంది. మూక దాడులు, బుల్డోజర్ రాజ్ సంస్కృతిని ప్రజలపై రుద్దుతున్నారు. మోడీ – షా నాయకత్వంలో న్యాయం వికృత రూపం దాల్చింది. న్యాయవ్యవస్థను ప్రభావితం చేసే హంతకులను విడుదల చేస్తున్నారు. నేరస్తులకి సన్మానాలు, సత్కారాలు, సంబరాలు చేసుకుంటూ మరోవైపు హక్కుల కార్యకర్తలను, ఉద్యమకారులను క్రూర చట్టాల కింద జైల్లో పెడుతున్నారు. ఫాసిస్ట్ చర్యలతో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేశారు.
నెరవేరని ఉద్యమ ఆకాంక్షలు..
వందలాదిమంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన స్వరాష్ట్రంలో ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరలేదు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో సాగిన ఉద్యమ ఫలితాలు ప్రజలు పొందలేకపోయారు. బంగారు తెలంగాణ, ప్రజాస్వామ్య తెలంగాణ, సామాజిక తెలంగాణ అని నినాదాలు ఎన్నికల అస్త్రాలుగా మాత్రమే మిగిలిపోయాయి. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ కేసీఆర్ అనుసరించిన తప్పుడు విధానాల వల్ల లక్షల కోట్ల అప్పుల్లోకి కూరుకుపోయింది. అవినీతి, బంధుప్రీతి, పచ్చి అవకాశవాదం పెరగడంతో ప్రజలు నియంతృత్వ పరిపాలనను ఎదుర్కోవాల్సి వచ్చింది. బీఆర్ఎస్ ను ప్రజలు గత ఎన్నికల్లో తిరస్కరించారు. కేసీఆర్ ప్రభుత్వం బీజేపీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా చెలిమి చేసి సహజ వనరులను సంపదను దోచుకున్నారు. వేలకోట్లు వెనకేసుకున్నారు. వారు అనుసరించిన దివాలా కోరు విధానాల మూలంగా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు అవకాశం ఏర్పడింది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు బీజేపీకి వెళ్ళింది. ఫలితంగా రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని ఆసరాగా చేసుకుని ప్రజల్లో చీలిక తీసుకువస్తూ మతతత్వ శక్తులు బలపడుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమౌతుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. రైతుల ఆత్మహత్యలు పెరిగి పోతున్నాయి. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి మూలంగా సన్న చిన్న కారు రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కార్మికులకు కనీస వేతనాలు అందడం లేదు. మహిళలకు రక్షణ ప్రశ్నార్ధకంగా మారింది. హత్యలు, హత్యాచారాలు పెరిగిపోయాయి. కుల దురహంకార హత్యలకు తెలంగాణ కేంద్రంగా మారింది. పోడు భూముల సమస్య పరిష్కరించలేదు. ఆదివాసీలు, గిరిజనులు అభద్రతభావంతో బతుకులు వెళ్లదీస్తున్నారు. విద్యార్థులు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యారంగం నిర్వీర్యం చేయబడుతుంది. ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగా మారుతుంది. వైద్య రంగాన్ని ప్రక్షాళన చేయాల్సి ఉంది. అసంఘటిత రంగంలో కార్మికులు కష్టాల సుడిగుండంలో కన్నీరు పెడుతున్నారు. రోజు రోజుకి పేదలకి ఇండ్ల స్థలాల సమస్య పెరిగిపోతుంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానన్న ప్రభుత్వం ఇవ్వడం లేదు. హైదరాబాదు లాంటి పట్టణంలో హైడ్రాను అమలు చేస్తూ పేదలను రోడ్లపై పడేస్తున్నారు. వారికి ముందుగానే ప్రత్యామ్నాయం చూపించాల్సిన అవసరం ఉంది. చెరువులను, కుంటలను, సహజ వనరులను ప్రభుత్వంలోని పెద్దలు కబ్జాలు చేసి దోచేస్తున్నారు. వాటి రక్షణకు పూనుకోవాలి. ఇలా ప్రతి రంగం నిర్లక్ష్యం చేయబడి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వైపు కాకుండా తిరోగమనం వైపు వెళుతుంది. గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తుంది. ప్రజలకు మెరుగైన పాలనను అందించడం లేదు. ఆరు గ్యారెంటీలతోపాటు ఏడవ గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని వాగ్దానం చేసింది కానీ రాష్ట్రంలో నియంతృత్వ ఛాయలు బహిర్గతమవుతున్నాయి. లగచర్ల లాంటి ఘటనలు ఉదాహరణలు నిలుస్తున్నాయి. “మాటలు కోటలు దాటాయి ఆచరణ గడప దాటలో లేదు” అన్న చందంగా ఉంది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చైతన్యవంతమైన తెలంగాణ సమాజం మళ్లీ పోరుబాటనే ఎంచుకోవాలి.
ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడాలి
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం, సామాజిక న్యాయం కోసం.. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడం కోసం.. అమరవీరులు కలలుగన్న సమాజం కోసం పోరాటాలను సాగించాలి. ప్రజాస్వామిక తెలంగాణ కోసం కమ్యూనిస్టులు, వామపక్ష శక్తులు, లౌకిక ప్రజాతంత్ర, సామాజిక శక్తులు కలిసి పనిచేయాల్సిన చారిత్రక అవసరం ఉంది. రాజకీయంగా వామపక్షాలు ప్రత్యామ్నాయంగా ఎదగాలి. అందుకోసం సీపీఐ (యమ్.యల్) లిబరేషన్ తెలంగాణ రాష్ట్రంలో తన కృషిని ప్రారంభించి కొనసాగిస్తూ ఉంది. దేశంలో రాష్ట్రంలో మతతత్వ శక్తులను నిలువరించేందుకు నిరంతరం తన శక్తి మేరకు పోరాడుతూనే ఉంది. ప్రజల పక్షాన పోరాడుతున్న సీపీఐ (యమ్.యల్) లిబరేషన్ పార్టీని బలోపేతం చేయాలని, పార్టీ విస్తరణ, అభివృద్ధి కోసం, పార్టీ నిర్వహిస్తున్న పోరాటాలను ఆదరించాలని కోరుతుంది.
– మామిండ్ల రమేష్ రాజా
తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
సీపీఐ (యమ్.యల్) లిబరేషన్