
కోరిన సమాచారం ఇవ్వని అధికారులపై చర్యలు తీసుకోవాలి
తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగర సాంబయ్య డిమాండ్
సమాచారం ఇవ్వడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ప్రభుత్వ పాలనలో పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టాన్ని కొందరు అధికారులు తుంగలో తొక్కి సమాచారం ఇవ్వడంలో దరఖాసుదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగర సాంబయ్య ఆరోపించారు.
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో శుక్రవారం సాంబయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మండల ఎంఈఓ కార్యాలయంలో జూలై 27న ఒక సమాచారం కోసం దరఖాస్తు చేసినట్టు తెలిపారు. సంబంధిత అధికారి 60 రోజులు పూర్తయిన సమాచారం ఇవ్వకపోవడంతో హనుమకొండ డీఈవో కార్యాలయానికి అప్లై చేశానని 30 రోజుల తర్వాత అధికారి తిరిగి అదే దరఖాస్తును కార్యాలయానికి బదిలీ చేస్తూ లెటర్ పంపించారని తెలిపారు. అలాగే ఎంఈఓ ఆఫీసులోని అధికారులు నెలలు గడిచిన కానీ అధికారుల మధ్య సమన్వయ లోపంతో సమాచారం ఇవ్వకుండా జాప్యం చేస్తూ దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. సమాచార హక్కు చట్టం అమల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కోరిన సమాచారాన్ని దరఖాసుదారులకు ఇవ్వకుండా అలసత్వం వహిస్తున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై రాష్ట్ర సమాచార కమిషన్ ఆశ్రయిస్తున్నట్టు ఆయన తెలిపారు.