
- వెంచర్ ఓ చోట తహశీల్దార్ కన్వర్షన్ చేసిన భూమి మరోచోట..!
- రియల్టర్ లకు సహకరించడంలో సారు తర్వాతే ఎవరైనా అని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రచారం…
- గతంలో విధులు నిర్వహించిన మండలాల్లోనూ అనేక అక్రమాలు చేసిన ఘనుడు…
- “ధరణి”పోర్టల్ ను ఆదాయవనరుగా మార్చుకున్నట్లు ఆరోపణలు…
- రెవెన్యూ శాఖపై ఏసీబీ అధికారులు దృష్టి సారిస్తే ఫస్ట్ వికెట్ ఆ అధికారేనంటూ గుసగుసలు…
Realtors’ noose around the neck of the Tahsildar : “సరిలేరు నీకెవ్వరు” అనే మహేష్ బాబు సినిమా టైటిల్ ఆ తహశీల్దార్ కు బాగా సరిపోతుందట. ధరణి పోర్టల్ ను ఆదాయ వనరుగా మార్చుకోవడంలో ఏ తహశీల్దార్ కూడా ఆయనతో పోటీ పడలేరని, “ధరణి” ని వాడుకోవడంలో ఆ తహశీల్దార్ కు ఆయనే సాటి అని ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ మండలాల్లో విధులు నిర్వహించిన ఆ తహశీల్దార్ “ధరణి” ని ఆసరాగా చేసుకొని అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు బదిలీల్లో భాగంగా హనుమకొండ జిల్లా నుండి వరంగల్ జిల్లా కు బదిలీ పై వచ్చిన సదరు తహశీల్దార్ “కోట”పై కూర్చొని గతంలో లాగానే ధరణిలోని లోపాలను ఎత్తిచూపుతూ గట్టిగానే దండుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేయడం గమనార్హం. అయితే ఈ తహశీల్దార్ ఏసీబీ అధికారుల హిట్ లిస్ట్ లో ఉన్నడంటూ గతంలోనే హనుమకొండ జిల్లాలో ప్రచారం జరగడం కొసమెరుపు.
- తహశీల్దార్ మెడకు నాలా కన్వర్షన్ ల ఉచ్చు..?
వరంగల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆ తహశీల్దార్ మెడకు నాలా కన్వర్షన్ ల ఉచ్చు బిగిస్తున్నట్లు జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గత నెలలో తన పరిధిలోని ఓ గ్రామ శివారులోని ఓ అనుమతి లేని వెంచర్ లోని ప్లాట్లను ఈ తహశీల్దార్ కన్వర్షన్ చేయడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారినట్లు సమాచారం. అసలు విషయం ఏమిటంటే రియల్టర్ లు చేసిన నాన్ లేఅవుట్ వెంచర్ (భూమికి)కు తహశీల్దార్ చేసిన నాలా కన్వర్షన్ లు(వెంచర్)లోని సర్వే నెంబర్ కు పూర్తిగా పొజిషన్ కి వచ్చేసరికి వ్యత్యాసం ఉందని సమాచారం. తాను కన్వర్షన్ చేస్తున్న భూమి యొక్క సర్వే నెంబర్, అక్కడ రియల్టర్ లు చేసిన భూమి యొక్క సర్వే నెంబర్ లో వ్యత్యాసం ఉందని తెలిసినప్పటికీ ఆ అక్రమ వెంచర్ లలోని ప్లాట్లు సదరు తహశీల్దార్ నాలా కన్వర్షన్ చేయడం గమనార్హం. అయితే ఈ వ్యవహారం వెనుక భారీ స్థాయిలో రాజకీయ పలుకుబడితోపాటు ,పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది.
- గతంలో అనేక ఆరోపణలు…?
వరంగల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆ తహశీల్దార్ గతంలో విధులు నిర్వహించిన మండలాల్లో కూడా అనేక అక్రమాలకు అండగా నిలిచినట్లు సమాచారం. అసైన్డ్ భూములకు, గుట్టలకు పాస్ బుక్ లు జారిచేయడంలో ఈ తహశీల్దార్ ఆరితేరిపోయినట్లు ప్రచారం ఉంది. హనుమకొండ జిల్లాలోని ఓ మండలంలో ఉన్న గ్రామంలో అంగడి భూమికి సైతం ధరణిలోని చిన్న చిన్న లోపాలను ఆసరగా చేసుకొని పాస్ బుక్ జారీ చేయగా ఇప్పటికి ఆ పాస్ బుక్ విషయంలో గ్రామస్తులు ధర్నాలు, రాస్తారోకోలు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు సైతం ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. సదరు తహశీల్దార్ తన వద్దకు వచ్చే సామాన్యులను టార్గెట్ చేసి వారి యొక్క వివాదాస్పద భూములను తనకు తెలిసిన వారి ద్వారానే కొనిపించి రియల్టర్ గా కూడా రాణించినట్లు ఆరోపణలు ఉన్నాయి.అసలు విషయం ఏమిటంటే అసలు అనుమతి లేని వెంచర్ లలోని ప్లాట్లను గజాల వారీగా నాలా కన్వర్షన్ చేయడానికి శ్రీకారం చుట్టిందే ఈ తహశీల్దార్ అంటే అతిశయోక్తి కాదని చెప్పవచ్చు. అవినీతి నిరోధక శాఖ అధికారులు కనుక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెవెన్యూ శాఖపై దృష్టి సారిస్తే ఫస్ట్ వికెట్ సార్ దే అని ప్రచారం జరుగుతుండటం గమనార్హం