
- వరంగల్ వాయిస్ ఎడిటర్ గడ్డం కేశవమూర్తి డిమాండ్
- హనుమకొండ ఇన్ స్పెక్టర్ సతీష్ కు వినతి
- సీఎం, సీపీలకు ఉత్తరం పోస్ట్
మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ నిర్మించిన పుష్పా- 2 చిత్రం పూర్తిగా నేర ప్రవృత్తిని పెంచి పోషించే విధంగా ఉన్నదని వరంగల్ వాయిస్ ఎడిటర్, రాష్ట్ర విశిష్ఠ అవార్డు గ్రహీత గడ్డం కేశవమూర్తి ఆరోపించారు. ఈ మేరకు సినీ దర్శకుడు, నిర్మాతలు, హీరోపై తక్షణం కేసులు నమోదు చేయాలని కోరుతూ హనుమకొండ ఇన్ స్పెక్టర్ సతీష్ కు గురువారం వరంగల్ వాయిస్ జర్నలిస్ట్ సిద్ధోజు రాకేష్ తో కలిసి వినతి పత్రం అందజేశారు. దీని కాపీని ముఖ్యమంత్రి, వరంగల్ సీపీలకు పోస్ట్ ద్వారా పంపించారు.
లేఖ పూర్తి సారాంశం ఈ విధంగా ఉంది.
మైత్రి మూవీ మేకర్స్ సారథ్యంలో దర్శకుడు సుకుమార్ నిర్మించిన పుష్పా 2 చిత్రం పూర్తిగా నేర ప్రవృత్తిని పెంచి పోషించే విధంగా ఉన్నది. సమాజహితం కోరుతూ సామాజిక అంశాలను తీసుకుని ఈ సినిమా నిర్మించలేదు. అంతా మోసపు పన్నివేశాలే ఇందులో ఉన్నాయి. ఒక స్నగర్ వ్యవస్థను శాసించినట్లుగా ఉన్నది. ఈ సినిమాలో ఆ కలప స్మగ్లర్ ను హీరోగా చూపారు. నేరాలు, ఘోరాలను నియంత్రిస్తూ శాంతి భద్రతలను పరిరక్షిస్తున్న పోలీస్ వ్యవస్థను ఇందులో విలన్ గా చూపించారు. అలాగే ముఖ్యమంత్రి పదవిని డబ్బులతో కొనవచ్చునని,
ఎమ్మెల్యేలందరినీ లంచావతారులుగా చిత్రీకరించారు. ఒక స్మగ్లర్ తలుచుకుంటే ప్రజాప్రతినిధులంతా అతని కాళ్ల వద్ద మోకరిల్లుతారనే చందంగా ప్రజాస్వామ్య వ్యవస్థను ఇందులో కించపరిచారు.
బాధ్యతాయుత స్థాయిలో నిక్కచ్చితంగా ఉండే ఓ పోలీస్ అధికారిని అవహేళన చేయడం బాధించిందని ఆ లేఖలో పేర్కొన్నారు. మన సంప్రాదాయాలు, ఆచారాలు మంటకలిపే విధంగా కథానాయికతోపాటు, ఐటెం సాంగ్ డ్యాన్స్ చేసిన నటిని పూర్తి సెక్సీగా తెరపై చూపారు. అర్హత, కళాత్మకత కలగలిపిన దృశ్యకావ్యాలు ఇందులో లేవు. ఆద్యంతం ఫైటింగ్ లు.. అశ్లీలత తప్ప సామాజిక విషయాలేవీ తెరపైన చూపలేదు. సందేశాత్మకంగా, సమాజాన్ని సన్మార్గంలో నడిపించేలా లేదు. సామాజిక సృహ గురించి పేర్కొనలేదు. ఒక పోలీస్ అధికారి బట్టలు ఇప్పి నిలబెట్టడం.. వాహనాన్ని ఢీ కొట్టి అతను నీటిలో పడిపోగానే అందులో సినిమా హీరో అర్జున్ మూత్రం పోయడం పోలీసు వ్యవస్థను కించపరిచేదిగా ఉందన్నారు. స్వగర్ సుహీరో చేసి పోలీసులను విలన్ గా చూపారు. ఇది సమాజాన్ని పెడద్రోవ పట్టించేదిగా ఉంది. 2024 డిసెంబర్ 4న హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంధ్య థియేటర్ లో నిర్వహించిన ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళా చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్న ఘటనపై రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చక్కగా స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 18 మంది పై కేసులు నమోదు చేసి హీరో అల్లు అర్జున్ ను 11వ నిందితుడిగా చేర్చడం సంతోషదాయకమే! ఈ విషయంలో రాష్ట్ర పోలీస్ శాఖ చర్యలు బేష్ గా ఉన్నాయి.
మొత్తానికి సినిమాలు సమాజాన్ని సన్మార్గంలో నడిపించేలా ఉండాలి. మంచి సందేశంతో చిత్రాలు నిర్మించాలి. కానీ, మొత్తం నేరాలు, ఘోరాలతోపాటు, నేరప్రవృత్తిని ప్రోత్సహించే విధంగా పుష్పా 2 సినిమా తీసిన దర్శకుడు సుకుమార్, నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు యెలమంచిలి రవిశంకర్, యేర్నేని నవీన్, ఎగ్జిక్యూటీవ్ నిర్మాత బండ్రెడ్డి అశోక్, సినిమా హీరో అల్లు అర్జున్ పై తక్షణమే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.