
జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ సంగని మల్లేశ్వర్
ప్రజాస్వామ్యంలో పత్రికలు ప్రజల పక్షాన నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని కాకతీయ విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం అధిపతి డాక్టర్ సంగని మల్లేశ్వర్ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని జర్నలిజం విభాగంలో జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్ట్ ఎప్పుడు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలపై దృష్టి పెట్టి సమాజం ముందు వాటిని పెడుతాడని అన్నారు. ఇది ఒక విలేకరిగా వారి బాధ్యత అని, సమాజంలో జరిగే అవినీతి, అక్రమాలపై రాస్తున్న కథనాలు జీర్ణించుకోలేని పాలకులు భౌతిక దాడికి దిగడం ముమ్మాటికి అది సమాజంపై దాడే అని అన్నారు. 1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్సు మేరకు 1966 నవంబర్ 16వ తేదీన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీన జాతీయ పత్రిక దినోత్సవాన్ని నిర్వహించు కుంటున్నామన్నారు. పత్రికలు నిజాన్ని నిర్భయంగా, స్వేచ్ఛగా, రాజకీయాలకు అతీతంగా రాయాలని అన్నారు. ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడుతున్న జర్నలిస్టులపై దాడులు, భద్రత వ్యవస్థ పనితీరుకు అద్దం పడుతున్నాయన్నారు. ఇలా అనేక మంది జర్నలిస్టులపై రోజు రోజుకు ఏదో ఒక చోట దాడులు జరుగుతునే వున్నాయన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రజలు కోరుకుంటున్నారని, ఎన్నో కష్టాలకోర్చి అనేక వాస్తవిక స్థితిగతుల సమాచారాన్ని ప్రజలకు చేరవేసే జర్నలిస్టులకు సమాజంలో ఎంతో గౌరవం ఉంటుందన్నారు. కానీ అదేస్థాయిలో వారు విధి నిర్వహణలో భాగంగా ఎన్నో ఒత్తిళ్లను తట్టుకోవాల్సి ఉంటుందన్నారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిజానిజాలను నిగ్గు తేల్చి ప్రజల ముందుంచుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిజం విభాగం అధ్యాపకులు డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, కంజర్ల నర్సింహా రాములు, డాక్టర్ వంగాల సుధాకర్, డాక్టర్ మోటె చిరంజీవి, ఈర్ల సురేందర్, జర్నలిజం విద్యార్థులు పాల్గొన్నారు.