‘Pembi’ is teaching a lesson to the tribals నిర్మల్ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతం పెంబి మండలం. దశాబ్దాలుగా ఇక్కడి గిరిజన గూడాలు అభివృద్ధికి ఆమడ దూరంలో, పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. ప్రాథమిక హక్కుల కోసం కూడా పోరాడాల్సిన దుస్థితి నెలకొన్న తరుణంలో గతనెలలో సిపిఎం చేపట్టిన 75 కిలోమీటర్ల పాదయాత్ర ఈ ప్రాంతానికి ఊరటనిస్తోందని చెప్పక తప్పదు. “పోరాడితేనే పరిష్కారం” అన్న నినాదంతో సాగిన ఈ యాత్ర, నేడు అధికారయంత్రాంగాన్ని కదిలించేలా చేసింది. ఆదివాసీ గూడాల్లో అభివృద్ధి వెలుగులను ప్రసరింపజేసేందుకు అడుగులు పడేలా చేసింది.
సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు ఉడుత రవీందర్, నిర్మల్ జిల్లా కార్యదర్శి గౌతమ్ కృష్ణ నాయకత్వంలో ఆ ప్రాంతం ఆదివాసీలు యాపాగూడెం నుండి నిర్మల్ వరకు సాగిన ఈ పాదయాత్ర కేవలం ఒక నిరసన కాదు, అది ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక. ఈ పాదయాత్రలో నాయకులు ప్రతి గూడెం తిరుగుతూ ప్రజా సమస్యలను తలకెత్తుకున్నారు. తాగునీరు, వైద్యం, విద్యుత్ వంటి కనీస సౌకర్యాల కోసం అధికారులు చూపుతున్న ఉదాసీనతను జిల్లా కేంద్రం సాక్షిగా ఎండగట్టారు. ఈ పోరాట సెగ తాజాగా ప్రభుత్వ యంత్రాంగంలో చలనం తెచ్చి, వరుస విజయాలకు దారితీసింది. విజయం చిన్నదే అయినప్పటికీ పెద్ద సందేశం ఇస్తోందని గుర్తించక తప్పదు.
‘Pembi’ is teaching a lesson to the tribals..!
ఈ పాదయాత్ర ఫలితంగా తాజాగా మూడు ప్రధాన సమస్యలు పరిష్కార మార్గానికి రావడం ప్రజా పోరాటానికి దక్కిన గౌరవంగా భావించవచ్చు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రెగ్యులర్ డాక్టర్ లేక గిరిజనులు గాలిలో దీపాల్లా బతుకుతున్న దుస్థితిని పాదయాత్ర బృందం బలంగా వినిపించింది. దీంతో స్పందించిన ప్రభుత్వం, తాజాగా ఆసుపత్రికి రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్‌ను నియమించింది. ఇప్పుడు అత్యవసర సమయంలో పేదలకు వైద్యం అందే మార్గం సుగమమైంది. రావిగూడ గ్రామంలో మూలన పడ్డ మిషన్ భగీరథ ట్యాంకును సిపిఎం పాదయాత్ర తర్వాతే అధికారులు పట్టించుకున్నారు. నీటి సరఫరాను పునరుద్ధరించారు. గిరిజన మహిళల నీటి కష్టాలు తీరడంతో ఆ గూడాల్లో కాస్త ఉపశమనం కలిగింది దాహంతో అలమటిస్తున్న రాముగూడ ప్రజల కోసం సిపిఎం నిలదీసిన వెంటనే అధికారులు స్పందించారు. నూతనంగా బోర్వెల్ ఏర్పాటు చేయించి నీటి సౌకర్యం కల్పించడంతో ఆ ప్రాంత ప్రజలు తమ దశాబ్దాల కష్టాల నుండి విముక్తి పొందినట్లుగా భావిస్తున్నారు.
‘Pembi’ is teaching a lesson to the tribals..!
ప్రస్తుత విజయాలు సంతోషాన్నిస్తున్నా, ఇవి కేవలం ఆరంభం మాత్రమే. అడవి బిడ్డల సంపూర్ణ అభివృద్ధికి ఇంకా అనేక అడ్డంకులు ఉన్నాయి. ప్రధానంగా దోత్తి వాగు, కడం వాగులపై వంతెనలు లేక వర్షాకాలంలో పెంబి మండలం బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతుంది. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా, అటవీ శాఖ అనుమతుల పేరుతో గృహ నిర్మాణాలను అడ్డుకోవడం గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. పట్టాలు పొందిన భూములకు రైతుబంధు వంటి పథకాలు, సత్తుగూడ గ్రామ పునరావాసం వంటి అంశాలు ఇంకా పరిష్కారానికి నోచుకోవాల్సి ఉంది.
‘Pembi’ is teaching a lesson to the tribals..!
పెంబి మండల ఆదివాసీల పోరాటం నేటి తరానికి ఒక గొప్ప సందేశం ఇస్తోంది. సమస్యలున్నప్పుడు మౌనంగా భరించడం కంటే, వ్యవస్థను నిలదీసే చైతన్యం ముఖ్యమని ఇది నిరూపించింది. ఎర్రజెండా వెనుక ఐక్యమైన గిరిజనం సాధించిన ఈ విజయం, ప్రజా గళం నినదిస్తే ఫలితం రాకుండా ఉండదని చాటిచెప్పింది.
అధికారులు కేవలం తాత్కాలికంగా బోర్వేల్లు వేసి, డాక్టర్లను నియమించి చేతులు దులుపుకోకుండా, పెంబి మండల సమగ్ర అభివృద్ధి కోసం శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించాలి. సీపీఎం పార్టీ కూడా ఇదేదో పాదయాత్ర కార్యక్రమంలాగా కాకుండా ఆదివాసీలకు పూర్తిస్థాయిలో అండగా నిలువాలి. దీర్ఘకాలిక ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. అడవి బిడ్డలు రగిల్చిన ఈ చైతన్య జ్వాల మండలం మొత్తానికి వెలుగులు నింపే వరకు విశ్రమించదని స్పష్టమవుతోంది. ఈ విజయం..ఆదివాసీల ఐక్యతకు, ప్రజా పోరాటాల ఆవశ్యకతకు ఒక నిలువుటద్దాం.
– దారా
