
జైళ్లలో నేరస్తులుండని రోజుకోసం ఆసుపత్రులలో రోగులుండని రోజుకోసం రోడ్లపై ప్రమాదాలు జరగని రోజు కోసం నేను ప్రార్థిస్తున్నాను ఆయుధాగారాల్లో తుపాకులు కనిపించని రోజు కోసం అడవుల్లో వేటగాళ్లు కనిపించని రోజు కోసం చివరికి…. వార్తా పత్రికలలో వార్తలే కనిపించని రోజుకోసం నేను ప్రార్థిస్తున్నాను.
****
2025 సంవత్సరానికి స్వాగతం. జన నిర్ణయం పాఠకులకు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
పత్రికా రంగమే కొంతపంతలు తొక్కుతోంది. ఒకరకంగా కార్పొరేట్ దిశగా చాలా స్పీడ్ గా అనేక రేట్లు ముందుకు సాగుతోంది. ఈ స్థితిలో ముందుకు వచ్చింది “జన నిర్ణయం తెలుగు దినపత్రిక”. వ్యక్తిగత లాభాపేక్ష లేని “జన నిర్ణయం తెలుగు దిన పత్రిక” ప్రజా జాగృతే పరమావధిగా ముందుకు సాగుతున్నది. ఇది ఒక సాహసమే అయినప్పటికీ ప్రజలే పోషకులన్న ధీమాతో చేపట్టిన మా అక్షర యజ్ఞం అప్రతిహతంగా కొనసాగుతోంది. 2024లోనూ జన నిర్ణయం దిన పత్రికను ఇది మా పత్రిక మన పత్రిక అనేలా ఆదరించిన పాఠకులకు, ప్రజలకు, శ్రేయోభిలాషులకు జన నిర్ణయం కృతజ్ఞతలు తెలుపుతోంది.
పత్రికారంగంలో భీష్మ పితామహులైన ఎం. చలపతిరావు లాంటి వారు పత్రికలను కొలుసుకట్టు వ్యాపార సంస్థల కబంధ హస్తాల నుంచి విముక్తి చేయాలని సూచించారు. అలా చేయకపోతే పత్రికా స్వేచ్ఛ బతికి బట్ట కట్టజాలదని ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. వారి మాటలు అక్షర సత్యాలు. కానీ వారి ఆశయాలకు విరుద్దమైన పరిణామాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జన నిర్ణయం తెలుగు దినపత్రిక ముందుకొచ్చింది. సమాజం పట్ల కసీ, కోపం, అభిమానం, జాలి, దయ…. అన్నీ కలగలిసిపోయిన కథనాలను అందించే ప్రయ్నతం మాది. చెప్పదలచినదీ వాడిగా, వేడిగా, సూటిగా ఒడుపుగా చెప్పే ప్రయత్నం మాది. కన్నీళ్ళూ, వేదనలూ నిండిన ఘటనలు, బయటి ప్రపంచానికి తెలియకుండా మరుగున పడ్డ వాస్తవికతను వార్తకథలుగా అందించడానికి “జన నిర్ణయం” ప్రయత్నిస్తోందని సగర్వంగా ప్రకటిస్తున్నాం…
జన నిర్ణయం పత్రిక ఎవరి పక్షం నిలవాలో…ఎవరి పక్షం రాయాలో… స్పృహ కలిగి తనదైన పాత్రను పోషించడానికి అక్షర సమరానికి సిద్దమవడం, అందుకనుగుణంగా ముందుకు సాగుతున్న నేపధ్యంలో భయపడుతూనే.. భయపెడుతూనే వెన్నుతట్టి భరోసానిస్తున్న సమాజ హితులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
మేము ఏదో తిరుగేస్తున్నామని చెప్పడం లేదు. కానీ మా ప్రయత్నం నిక్కచ్చిగా చేస్తున్నామని జన నిర్ణయం పత్రిక తరుపున ప్రారంభంలోనే ప్రకటించడం జరిగింది. అందుకనుగుణంగానే ముందుకు సాగుతున్నది. 2024లో జన నిర్ణయం అనేక బెదిరింపులు చవిచూసింది. ప్రశంసలు అందుకుంది. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయినప్పటికీ జనమే జన నిర్ణయం బలమని నమ్మి ముందుకు సాగుతోంది.
అయితే ఇక్కడో విషయం చెప్పాలి. పెట్టుబడికి పేదరికమే గాని, పెన్నుకు పేదరికం ఉండదు. అటువంటి పెన్ను నుండి జాలువారి విభిన్న రంగాలను కదిలించిన కథనాలను ఈ ఏడాది మీ ముందు ఉంచాము. విమర్శలను ఎదుర్కొన్నాం. చీదరింపులనూ చవి చూశాం. ఇదేం పత్రిక అని ఎగతాళి చేసిన వారినీ చూశాం. అన్నీ భరించాలి. ప్రసంశలు కూడా మాకు మొండుగానే ఉన్నాయి. ” జన నిర్ణయం” కథనాలు బేష్ అంటూ ప్రశంసలే కాదు, రాష్ట్ర అధికారులనూ కదిలించాయని సగర్వంగా చెప్తున్నాం. విభిన్న రంగాల్లోని, సామాజిక సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక అంశాలను తడుతూ మంచిని మంచిగా, చెడును చేదుగా చెప్పే ప్రయత్నం “జన నిర్ణయం దినపత్రిక” చేసిందని భావిస్తున్నాము. అలాగే మేము ఎవరికి పోటీకాదు. మాకూ ఎవరితోనూ పోటీ లేదు. ఉన్నదల్లా సమస్యను పరిశీలనాత్మక దృష్టితో చూసి, దానిపై స్పందించి, అట్టి కథనాన్ని పాఠకుల ముందు ఉంచి పరిష్కార మార్గాన్ని వెతికేందుకు కృషి చేసిందని, చేస్తూ ఉంటుందని తెలపడానికి ఎటువంటి సందేహం లేదు. పత్రిక ఎలా నడపాలో, పాఠకులకు ఏమి అందించాలో అనే ఎరుక ” సిన్సియారీటీ, మాకు ఉంది. ఆశీర్వదించే మనసు మీకు ఉండాలని, గతంలాగే ఈ 2025లో అడుగిడుతున్న జన నిర్ణయం పత్రికను ప్రజలు నిలబెడుతారని, అన్ని విధాలుగా అండగా నిలుస్తారని ఆశీస్తూ…..
మీ
రాజేందర్ దామెర (దారా)
ఎడిటర్ ఇన్ చీఫ్
జన నిర్ణయం