
Uttar Pradesh
- మరో ఇద్దరిపై హింసాత్మక దాడి
- పత్రికా స్వేచ్ఛను కాపాడండి : మీడియా సంస్థలు, ప్రతినిధుల డిమాండ్
జన నిర్ణయం / వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh )ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయి. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. దీంతో యుపిలో పత్రికా స్వేచ్ఛపై మీడియా సంస్థలు, జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్టోబరు 30వ తేదీ అర్ధరాత్రి ఫతేపూర్ జిల్లాలో ఒక జర్నలిస్టు హత్యకు గురయ్యాడు. అక్టోబరు 27న హమీర్పూర్ జిల్లాకు చెందిన ఇద్దరు జర్నలిస్టులను అక్కడి పంచాయితీ చైర్మన్, ఆయన అనుచరగణం బట్టలూడదీసి, బాదారు. జర్నలిస్టు దిలీప్ సైని హత్యకు ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు కేసును తప్పుదారి పట్టించే యత్నం చేశారు. సరిళా నగర్ పంచాయితీ చైర్మన్ పవన్ అనురాగి, ఆయన అనుచరులు తమపై హింసాత్మక దాడులకు పాల్పడ్డారని హమీర్పూర్కి చెందిన ఇద్దరు జర్నలిస్టులు అమిత్ ద్వివేది, శైలేంద్ర కుమార్ మిశ్రా పేర్కొన్నారు. అనురాగి మనుషులు లైట్టు ఆర్పేసి చీకట్లో తమను చావబాదారని, తుపాకీతో బెదిరించి బట్టలూడదీయించారని వారు వాపోయారు.. అవమానకరమైన ఆ సంఘటనలను వీడియో తీశారని, పైగా మూత్రం తాగాలంటూ తమపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. తమ ఫోన్లను లాక్కున్నారని, తమను బందీలుగా వుంచారని జరియా పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యతీసుకోవాల్సిన పోలీసులు బాధితులనే దోషులుగా చిత్రీకరించేందుకు యత్నించారు. ఆ ఇద్దరు జర్నలిస్టులపై తప్పుడు కేసులు బనాయించారు.ఈ దాడులను యుపి అక్రిడిటేటెడ్ కరస్పాండెంట్స్ కమిటీ (యుపిఎసిసి) ఖండించింది. ఇందుకు బాధ్యులైనవారిపై తక్షణమే చర్య తీసుకోవాలని కమిటీ అధ్యక్షుడు హేమంత్ తివారీ విజ్ఞప్తి చేశారు.