
ఎంవీఐ అసిస్టెంట్ కనుసన్నల్లోనే వ్యవహారం..!
బెంబేలెత్తుతున్న వాహనదారులు..!
ములుగు జిల్లా “ఆర్టీఏ”కార్యాలయంలో పైసా వసూల్ యధేచ్ఛగా జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్, లైసెన్స్ రిన్యూవల్స్, వాహనాల రిజిస్ట్రేషన్లు, వాహన ఫిట్ నెస్ ల కోసం ఆన్ లైన్ లో స్లాటు బుక్ చేసి
పేమెంటు చెల్లించి కార్యాలయానికి వస్తే కార్యాలయంలో జేబులు చిల్లులు పడందే పనులు జరుగడం లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. వివిధ రకాల పనుల కోసం ఆర్టీఏ కార్యాలయానికి వచ్చే వాహనదారుల నుంచి ప్రతి పనికో రేటు ఫిక్స్ చేసి ఏజెంట్ లు వసూళ్లు చేసి రవాణాశాఖ అధికారి ముడుపులు ముట్టజెప్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మామూళ్లు ఇవ్వని వాహనదారులు ఇదేంటని ప్రశ్నిస్తే స్లాట్ మళ్లీ బుక్ చేసుకో అంటూ ఇబ్బందులకు గురి చేయడం ఆ కార్యాలయం లో సర్వసాధారణంగా మారిందనే ఆరోపణలు లేకపోలేదు. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్స్ ,వాహనాల ఫిట్ నెస్ తదితర పనులకు నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదంతా ఎంవీఐ అసిస్టెంట్ కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ములుగు ఆర్టీఏ కార్యాలయం పై దృష్టి సారించి అక్రమ వసూళ్లకు అడ్డుకట్టవేయాలని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.