Modi’s threats to BRICS aspirations and India’s reputation Opposition criticizes : అంతర్జాతీయ సంబంధాల చరిత్రలో ఒక దేశం తన ప్రాధాన్యతలను, విలువలను, నైతిక బాధ్యతలను పక్కనపెట్టి మరొక దేశానికి లోబడి ప్రవర్తించడాన్ని ‘రాజీ విదేశాంగ విధానం’ అంటారు. నేడు భారతదేశం ఆ దిగజారుడు స్థితికి చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా, అత్యంత ప్రాచీన నాగరికతగా, అలీన ఉద్యమానికి మూలస్తంభంగా నిలిచిన భారత్, నరేంద్ర మోదీ నాయకత్వంలో దౌత్యపరమైన బలహీనతకు, నైతిక దివాళాకు ప్రతీకగా మారింది. బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న భారత్ పశ్చిమాసియా సంక్షోభంలో మౌనం వహించడం ఈ విదేశాంగ విఫలోద్యమానికి నిదర్శనం అని పార్లమెంటులో కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాల సమూహం. ఇది పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ, బహుళ ధ్రువ ప్రపంచాన్ని నిర్మించే లక్ష్యంతో ఏర్పడిన వేదిక. ఈ కూటమికి అధ్యక్షత వహించడమంటే ప్రపంచ దక్షిణార్థ దేశాల తరఫున మాట్లాడే బాధ్యత, శాంతి, సుస్థిరత్వం కోసం కృషి చేసే నైతిక బాధ్యత స్వయంచాలకంగా వస్తుంది. కానీ ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన వైమానిక దాడులపై భారత్ మౌనంగా ఉండిపోవడం బ్రిక్స్ అధ్యక్ష పదవి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న అవమానకరమైన వైఖరిని తెలియజేస్తోంది.
Modi’s threats to BRICS aspirations and India’s reputation Opposition criticizes
కేవలం ఇరాన్ దాడులు మాత్రమే కాదు. హిందూ మహాసముద్రంలో అమెరికా నేవీ ఇరాన్ నేవీకి చెందిన యుద్ధనౌకపై దాడి చేసింది,ఆ నావ భారత దేశ ఆహ్వానం మేరకు ఇక్కడకు అతిధి గా వచ్చింది. అలాగే గల్ఫ్ దేశాలలోని సైనికేతర లక్ష్యాలపై ఇరాన్ చేస్తున్న దాడులు- ఇవన్నీ భారత్ కు ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధించిన అంశాలే. ఇంతటి సున్నితమైన సమయంలో సమష్టి ప్రకటన విడుదల చేయడానికి కూడా భారత ప్రభుత్వం ధైర్యం చేయలేదు. ఎందుకు? కారణం స్పష్టం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ప్రసన్నం చేసుకోవడం, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం. ఈ రాజీ వైఖరి కొత్తదేమీ కాదు. గత వారం ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యపై మోదీ మౌనంగా ఉండిపోయారు. ఇరాన్ తో భారత్ చారిత్రక సంబంధాలను కలిగి ఉంది. ‘చాబహార్’ ఓడరేవు అభివృద్ధి ద్వారా ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాకు ప్రవేశ ద్వారంగా ఇరాన్ వ్యవహరిస్తోంది. కానీ అమెరికా ఒత్తిడికి లొంగిపోయి, ఇజ్రాయెల్ అనుగ్రహం కోసం ఈ సంబంధాలను బలి ఇవ్వడానికి మోదీ సిద్ధపడ్డారు.
Modi’s threats to BRICS aspirations and India’s reputation Opposition criticizes
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పార్లమెంటులో చేసిన ప్రకటన పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉంది. “చర్చలు, దౌత్యపరంగా సమస్య పరిష్కారమవుతుందని భారత్ నమ్ముతుంది” అని ఆయన అన్నారు. కానీ ఇరాన్ పై దాడులు జరుగుతున్నప్పుడు, అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉల్లంఘించ బడుతున్నప్పుడు, మరణాలు సంభవిస్తున్నప్పుడు కేవలం నమ్మకాలతో దౌత్యం సాగదు. దౌత్యమంటే స్పందించడం, ఖండించడం, అభ్యంతరం తెలియజేయడం. అది జరగనప్పుడు ఆ దేశం విదేశాంగ విధానం బలహీనమైనదిగానే పరిగణించబడుతుంది. అని అంటూ రాహుల్ గాంధీ పార్లమెంటులో నూ,బయట విమర్శలు చేస్తూనే ఉన్నారు.
పశ్చిమాసియా సంక్షోభంపై పార్లమెంటులో చర్చ జరపాలని కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేసినప్పుడు ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. రాజ్యసభ నుంచి కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది, లోక్ సభలో నిరసనలు, ప్లకార్డుల ప్రదర్శన- ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం తమ విధి నిర్వహణలో భాగంగా చేయడమే. కానీ ప్రభుత్వం మాత్రం చర్చకు భయపడుతోంది. ఎందుకంటే చర్చ జరిగితే ప్రభుత్వ విదేశాంగ విధానం యొక్క బేషరతు స్వరూపం బయట పడుతుందనే భయం.
అంతర్జాతీయ వేదికలపై ఈ మౌనం, ఈ రాజీ వైఖరి భారత ప్రతిష్టకు తీవ్రమైన దెబ్బ. బ్రిక్స్ దేశాల్లో భారత్ నాయకత్వ పాత్ర పోషించగలదా అనే ప్రశ్న తలెత్తుతోంది. పశ్చిమాసియా దేశాలు, ముఖ్యంగా అరబ్ దేశాలు, భారత్ తమ తరఫున నిలబడుతుందా అని సందేహిస్తున్నాయి. ఇరాన్ వంటి చారిత్రక మిత్రదేశం భారత్ పై నమ్మకం కోల్పోతోంది. అమెరికా, ఇజ్రాయెల్ అనుగ్రహం కోసం భారత్ తన విదేశాంగ విధానాన్ని అమ్ముకుంటోందనే భావన ప్రపంచవ్యాప్తంగా బలపడుతోంది.
మరోవైపు అదే సమయంలో, అమెరికా-ఇజ్రాయెల్ చర్యలను ఖండించే ధైర్యం లేని భారత్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను మాత్రం ఖండించింది. ఇది పక్షపాత విదేశాంగానికి, ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. ఒక వైపు మాత్రమే ఖండించడం, మరో వైపు మౌనంగా ఉండిపోవడం నైతికంగా సమర్థనీయం కాదు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ కాలంలో భారత్ అంతర్జాతీయ వేదికలపై గళం విప్పి, అలీన దేశాల నాయకత్వం వహించింది. విజయలక్ష్మీ పండిట్ ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రసంగాలు, కాశ్మీర్ సమస్యపై భారత్ వాదన నేడు చరిత్ర పుటల్లో మిగిలిపోయాయి. నేడు మాత్రం అంతర్జాతీయ వేదికపై భారత్ స్వరం వినిపించడం లేదు. ప్రపంచంలో అత్యాచారాలు, అణచివేత, యుద్ధాలు జరుగుతున్నా భారత్ మౌనంగా ఉండిపోతోంది.
Modi’s threats to BRICS aspirations and India’s reputation Opposition criticizes
ప్రధాని మోదీ తన అమెరికా, ఇజ్రాయెల్ స్నేహితుల కోసం బ్రిక్స్ అధ్యక్ష పదవి గౌరవాన్ని, బాధ్యతను,వాటి ఆదర్శాలు, లక్ష్యాలను త్యాగం చేస్తున్నారు. ఇది దేశ ద్రోహమే కాక, అంతర్జాతీయ సంబంధాల పట్ల అపరిపక్వ వైఖరి. ప్రపంచంలోని ప్రతి దేశంతో సమాన దూరం, సమాన సాన్నిహిత్యం అనే పంచశీల, అలీన విధాన సిద్ధాంతాన్ని విస్మరించి, కేవలం రెండు దేశాల అనుగ్రహం కోసం మిగిలిన ప్రపంచాన్ని దూరం పెట్టడం దేశ హితానికి విరుద్ధం.
పశ్చిమాసియా సంక్షోభంపై పార్లమెంటులో చర్చ జరిగి తీరాలి. భారత విదేశాంగ విధానం ఎటువైపు పయనిస్తోందో ప్రజలకు, ప్రతిపక్షానికి తెలియాలి. ప్రధాని మోదీ పార్లమెంటులో నిలబడి, తన విదేశాంగ విధానాన్ని వివరించాలి. ఇరాన్ పై దాడులపై మౌనంగా ఉండడానికి గల కారణాలను వివరించాలి. బ్రిక్స్ అధ్యక్ష పదవి కేవలం ముసుగు మాత్రమేనా, లేక నిజమైన బాధ్యతా అనేది స్పష్టం చేయాలి. లేనిపక్షంలో, అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్ట మరింత దిగజారుతూనే ఉంటుంది. ప్రపంచ దేశాలు భారత్ ను విశ్వసించడం మానేస్తాయి. ఇది కేవలం ఒక ప్రభుత్వం యొక్క వైఫల్యం మాత్రమే కాదు, 140 కోట్ల భారతీయులకు అవమానం.
డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్
సెల్ : 9849328496
