“Medaram” – the festival of brave women : కాకతీయుల సైన్యాన్ని గడగడలాడించిన వీరోచిత పోరాట వనితలు మేడారం “సమ్మక్క సారలమ్మ”లు. అసలు సమ్మక్క సారలమ్మ జాతర ఎందుకు జరుపుకుంటారు వీరెవరు..? సమ్మక్క సారలమ్మ జాతర అనేది ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి కోటిన్నర మందికి పైగా హాజరు అవుతారని అంచనా. ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న అడవి ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు కొండకోనల మధ్య ఈ చరిత్రాత్మక జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల ఆరాధ్య దేవతలుగా కష్టాలు కడ తీర్చే కలియుగ దైవాలుగా ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపద్బాంధవులుగా కేవలం తెలంగాణలో గాక అఖిల భారత దేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్న సమ్మక్క సారక్క దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఘనతకెక్కిన గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం నుండే గాక పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిశా చతిస్గడ్ జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతర తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1996లో రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది.
“Medaram” – the festival brave women
నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండల ప్రాంతంలోని పోలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్లినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు గొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు. ఆమె చేతితో ఆకు పసరు ఇస్తే ఎలాంటి రోగమైన నయమైపోయేదని నమ్మకం. కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు. ఆమెను అతని మేనల్లుడైన మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. ఈ దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగినారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలావసనుపై దండెత్తాడు ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేక పోతాడు. కప్పం కట్టలేక పోవడం మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరు పోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడని కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహంతో రెచ్చిపోయి ప్రతాపరుద్రుడు అతడిని అణిచి వేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడుతో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు సమ్మక్క సారక్క నాగులమ్మ జంపన్న గోవిందరాజులు వేరువేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కానీ సుశిక్షితమైన అపార కాకతీయుల సేనాల దాటికి తట్టుకోలేక మేడరాజు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. పరజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పటినుండి సంపెంగ వాగుకి జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది.
“Medaram” – the festival of brave women
ఇక సమ్మక్క యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతూ వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలుకల గుట్ట వైపు వెళ్తూ మార్గమధ్యలోనే అదృశ్యమైపోతుంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమ గల భరణి లభించింది. దానిని సమ్మక్కగా భావించి అప్పటినుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాగ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.
“Medaram” – the festival of brave women
జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సార్లమ్మను గద్దెకు తీసుకు వస్తారు. రెండో రోజున చిలుకల గుట్టలో బరిని రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. మూడవ రోజున అమ్మ వార్లు ఇద్దరు గద్దలపై కొలువు తీరుతారు. నాలుగో రోజున సాయంత్రం దేవతలను ఇద్దరినీ తిరిగి యుద్దస్థానానికి తరలిస్తారు.
వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజన వాళ్లే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. సుమారు కోటికి పైగా జనం పాల్గొని మహా గొప్ప జాతర. ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతర. సమ్మక్క సారక్కలను ఒక దేవతలుగానే కాకుండా కోయ గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం కాకతీయుల పైన వీరోచిత పోరాటం చేసిన విప్లవ వీర వనితలుగా ప్రజలందరూ గుర్తు చేసుకోవాలి.
- పసుల వినయ్ కుమార్ ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా – వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు
