- పల్లె ప్రగతికి కొత్త సర్పంచ్లకు పరీక్షా కాలం..!
- ఒకవైపు ప్రజల ఆశలు, మరోవైపు నిధుల కొరత…
- కనీసం కోతుల బెడదనైనా తీర్చగలరా అనే సందేహాలు…
Many challenges for charioteers తెలంగాణ పల్లెల్లో ఎన్నికల సందడి ముగిసింది. ఊరు ఊరంతా ఏకమై తమ గ్రామ రథసారధులను (సర్పంచ్లను) ఎన్నుకుంది. డిసెంబర్ 22న రాష్ట్రవ్యాప్తంగా నూతన పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేసి అధికార పగ్గాలు చేపట్టాయి. అయితే పూల బాటలు అనుకున్న పంచాయతీ పదవులు ఇప్పుడు సర్పంచ్లకు ముళ్ల బాటలుగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రజల ఆశలు, మరోవైపు నిధుల కొరత, ఈ రెండింటి మధ్య నూతన సర్పంచ్ల పాలన సవాళ్లతో కూడుకున్న యజ్ఞంలా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Many challenges for charioteers
నిధుల లేమి ప్రధాన ఆటంకం…
కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు స్వాగతం పలికిన మొదటి సమస్య ఆర్థిక ఇబ్బందులే. చాలా గ్రామ పంచాయతీల్లో పాత బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. గత పాలకవర్గాల కాలం నాటి వీధి దీపాల బిల్లులు, మోటార్ల కరెంట్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని గణంకాలు తెలుపునతనాయని పలువురు విశ్లేషిస్తున్నారు. మరోవైపు 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం వేచి చూడాల్సి రావడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అభివృద్ధి నిధులు సకాలంలో అందకపోవడం సర్పంచ్లకు తలనొప్పిగా మారింది.
Many challenges for charioteers
అయితే, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రతి పంచాయతీకి రూ. 10 లక్షల ప్రత్యేక నిధిని ప్రకటించడం కొంత ఊరటనిచ్చే అంశంగా మారినప్పటికీ ఆచరణపై అనుమానాలు ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు.
ఇక ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎమ్మెల్యేల స్థాయి హామీలు ఇచ్చారు. ఈ స్థానిక హామీలను నిలబెట్టుకోవడం కూడా సవాలుగానే ఉంటుందనేది గమనార్హం. ప్రతి ఇంటికి బీమా, ఆడపిల్ల పుడితే నగదు బహుమతి, సొంత ఖర్చులతో వీధి కెమెరాలు, వైకుంఠ రథాల ఏర్పాటు వంటి భారీ వాగ్దానాలు చేశారు. ఇప్పుడు పదవిలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్నది పెద్ద ప్రశ్న. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను తట్టుకోవడం వారికి మొదటి సవాలుగా పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ పల్లెల్లో ప్రధాన సమస్య కోతుల బెడద. దీని నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. ఇంకోవైపు వార్డు మెంబర్ల నుంచి పాత ప్రత్యర్థుల వరకు ప్రతి అడుగులో సర్పంచ్లకు రాజకీయ సవాళ్లు ఎదురవుతాయి. పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకుంటూ, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పారదర్శకంగా అందించడం ఒక పరీక్ష వంటిదే. ఈ దశలో గ్రామ స్వరాజ్యం రావాలంటే కేవలం పదవులు ఉంటే సరిపోదు, అధికారాలు, ఆపై నిధులు ఉండాలి. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు కేవలం ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా, గ్రామంలోని ఆదాయ వనరులను పెంచుకోవాలి. అప్పుడే వారు తమ గ్రామాన్ని ‘ఆదర్శ గ్రామం’గా తీర్చిదిద్దగలరు అనేది పరిశీలకులు భావిస్తున్నారు.
