పత్తిపాకలో కొత్త క్రషర్ ఏర్పాటు సన్నాహాలను తక్షణమే విరమించుకోవాలి
నిబంధనలకు విరుద్ధంగా పాత క్రషర్ నిర్వహణ..
కొత్త క్రషర్లను అడ్డుకోకుంటే ముదిరాజ్ అస్తిత్వానికే ముప్పు..!
ఉమ్మడి వరంగల్ జిల్లా ముదిరాజుల సమన్వయకర్త పల్లెబోయిన సుధాకర్
Let’s protect the heritage of the Mudirajs, the hill forts : తరతరాలుగా ముదిరాజ్ సామాజిక వర్గానికి జీవనాధారంగా, వారి వారసత్వ సంపదగా విరాజిల్లుతున్న గుట్టలు నేడు మైనింగ్ మాఫియా చేతుల్లో చిక్కి విలవిలలాడుతున్నాయి. పత్తిపాక ప్రాంతంలోని ప్రకృతి సిద్ధమైన గుట్టలను క్రషర్ల పేరుతో నాశనం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ముదిరాజ్ ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. ఈ అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాల్సిన చారిత్రక అవసరం ముదిరాజ్ బిడ్డలపై ఉంది. పత్తిపాక గ్రామ శివారులో ఇప్పటికే ఒక గుట్టను క్రషర్ మింగేయగా మరో గుట్టకు కొత్తగా క్రషర్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ముదిరాజుల సమన్వయకర్త పల్లెబోయిన సుధాకర్ గుట్టలను రక్షించుకోవాలని ముదిరాజులకు పిలుపునిచ్చారు.
Let’s protect the heritage of the Mudirajs, the hill forts
ముదిరాజ్ లు ప్రకృతి ఆరాధకులు. కొండలు, గుట్టలు, చెరువులే వారి జీవన రేఖలు. అటువంటి గుట్టలను పిండి చేసి, పర్యావరణాన్ని నాశనం చేయడం అంటే ఒక సామాజిక వర్గ సంస్కృతిని, అస్తిత్వాన్ని అంతం చేయడమే. ఇప్పటికే ఉన్న పాత క్రషర్ నిబంధనలను తుంగలో తొక్కి విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని పల్లెబోయిన సుధాకర్ ప్రశ్నించారు. పత్తిపాకలో కొత్తగా మరో క్రషర్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. పర్యావరణానికి ముప్పు కలిగించేలా ఉన్న ఈ క్రషర్లకు అనుమతులు ఇవ్వడం చట్టవిరుద్ధమని అన్నారు. గతంలో అనుమతి పొందినట్లు చెప్పుకునే పాత క్రషర్ పరిమితికి మించి మైనింగ్ చేస్తూ, భారీ శబ్దాలు, ధూళిని వెదజల్లుతూ స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న పరిస్థితి. గ్రామంలోని ఇండ్లు ఆ పేళుళ్లకు కంభించిపోతున్నాయని, పంటపొలాలకు నష్టం వాటిల్లుతుందని, వీటిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పత్తిపాకలో కొత్త క్రషర్ల ఏర్పాటు సన్నాహాలను ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తూ తవ్వకాలు జరుపుతున్న పాత క్రషర్ల లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్ ల వారసత్వ సంపదైన గుట్టలను రక్షించేందుకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.
Let’s protect the heritage of the Mudirajs, the hill forts
ముదిరాజ్ సోదరులారా.. మేల్కొనండి..!
”గుట్ట మనది.. హక్కు మనది” అనే నినాదంతో ముదిరాజ్ సామాజిక వర్గం ఏకం కావాలని సుధాకర్ పిలుపునిచ్చారు. పండుగ సాయన్న వారసులుగా గుట్టల రక్షణకు గళం విప్పాలని కోరారు. మన పూర్వీకులు మనకు అందించిన ఈ సహజ సంపదను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం చేసిన వాళ్లమవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తిపాక గుట్టల రక్షణ కోసం ప్రతి ముదిరాజ్ బిడ్డ ఒక సైనికుడిలా నిలబడాలని ఆయన కోరారు.
