
- జి. రాములు సెల్ : 9490098006 గౌరవ అధ్యక్షులు – తెలంగాణ ప్రజాసాంస్కృతిక కేంద్రం
Let’s invite Maoists to peace talks : :మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటి ప్రతినిధి అభయ్ పేరిట తాము కాల్పుల విరమణకు, శాంతి చర్చలకు సిద్ధమనే ప్రకటనను స్వాగతించనివారు ఉండరు. అభివృద్ధి కాముకులు, ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా ఈ ప్రకటనను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. మావోయిస్టులతో సానుకూలంగా, గౌరవప్రదమైన చర్చలు జరిపి, ప్రశాంత వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత ఇక కేంద్ర ప్రభుత్వంపై ఉంది.
రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రకటించి, అందుకు దీర్ఘకాలిక సాయుధ పోరాటమే ఏకైక మార్గమని ప్రకటించిన మావోయిస్టులు, కారణాలు ఏమైనా కావచ్చు, కాల్పులు విరమించి ప్రభుత్వాలతో చర్చలకు సిద్ధం కావడం అసాధారణ విషయమే. రెండు మూడు రోజులకొసారి ఇరవై, ముప్పై మంది మావోయిస్టులు పోలీస్ ఎన్ కౌంటర్లలో చనిపోయినట్లు వార్తలు ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయింది. దానికి ప్రతిగా మందుపాతరలు పెట్టి పోలీసులను, ఇన్ఫర్మేషన్ ఇచ్చారనే పేరిట గిరిజనులను, దళితులను మావోయిస్టులు చంపడం కూడా చూస్తూనే ఉన్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్చి 2026 నాటికి మావోయిస్టులందరినీ ఏరిపారేస్తానని తరచుగా ప్రకటనలు చేస్తూనే ఉన్నాడు. రాబోయే సంవత్సర కాలంలో మరెన్ని భయానక పరిణామాలు చూడాల్సి వస్తుందోనని ఆందోళన పడుతున్న సమయాన శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టుల ప్రకటన అందరికీ ఊరట కలిగించింది. ఇప్పుడు ప్రభుత్వ స్పందన కొరకు అందరూ ఎదురుచూస్తున్నారు. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది కానీ ఇది ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని విశాల దృక్పథంతో వ్యవహరించి శాంతి చర్చలను సఫలీకృతం చేయాల్సిన అవసరముంది. ప్రభుత్వానికి, మావోయిస్టులకు చర్చలు జరిగి ప్రశాంత వాతావరణం ఏర్పడాలని సమాజంలోని అన్ని వర్గాల వారు కోరుకుంటున్నారు.
Let’s invite Maoists to peace talks
దశాబ్దాలుగా జరుగుతున్న ఈ నక్సలైట్ల ఉద్యమ ఫలితంగా వేలాదిగా నక్సలైట్లు చనిపోయారు. వందలాది మందిగా పోలీసులు చనిపోయారు. ఈ ఉద్యమంలో అత్యధికంగా నష్టపోతున్నది అడవి బిడ్డలైన గిరిజనులే. నక్సలైట్లకు సహకరిస్తున్నారని పోలీసులు చంపుతుంటే, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని నక్సలైట్లు గిరిజనులను చంపడం ఆనవాయితీగా మారింది. అత్యంత పేదరికాన్ని అనుభవిస్తూ, పనులు లేక ఇబ్బందులు పడుతున్న గిరిజనులు నిత్యం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణంలో దినదిన గండంగా బతకాల్సి వస్తుంది. అడవులకు వెళ్ళి, అడవి సంపద సేకరించుకొని తమ జీవితాలు వెళ్ళదీసుకునే స్థితి లేకుండా పోతుంది. ఎప్పుడెక్కడ కౌంటర్లు, ఎన్ కౌంటర్లు జరుగుతాయో, ఎక్కడ మందుపాతరలున్నాయోనని భయంభయంగా జీవిస్తున్న పరిస్థితి. అసలే విద్యా, వైద్య వసతి లేదు. రహదారులు లేవు. ఆ మౌళిక వసతుల కల్పన కొరకు అడిగినా నిర్బంధాలతో అణచివేసే పరిస్థితే ఉంటుంది. ఈ పరిస్థితుల నుండి బయటపడాలని సగటు గిరిజనులు కోరుకుంటున్నారు. ఆ ప్రాంతాలలో అభివృద్ధి కుంటుపడుతున్నది. మరోపక్క అర్బన్ నక్సలైట్లు అనే పేరిట పౌరహక్కుల సంఘాల నాయకులను, అభ్యుదయ వాదులను, మేధావులను ప్రభుత్వాలు వేధిస్తున్నాయి. శాంతి చర్చలు సాఫీగా జరిగి మావోయిస్టులు కాల్పుల విరమణ చేసి, అజ్ఞాతాన్ని వదిలి, తమ కేంద్రాలను అడవులకు బదులు అశేష ప్రజా సమూహాలుగా చేసుకోవాలని పౌర సమాజం కోరుకుటుంది.
కేంద్ర హోంమంత్రి గారి ప్రకటనలు సరైనవి కావు. మావోయిస్టుల మరియు మావోయిస్టులకు మద్దతిస్తున్న గిరిజనులంతా ప్రభుత్వాలు నిర్మూలించాల్సిన శతృవులన్నట్లుగా వుంటున్నవి. మావోయిస్టులను అణచటం కొరకు వేలాది భద్రతా దళాలను సంవత్సరాల తరబడి దండకారణ్యంలో వుంచాల్సి రావడం, మావోయిస్టుల ఎన్ కౌంటర్ల పేరిట అమాయక గిరిజనులను చంపడం ప్రభుత్వం ప్రతిష్టను దిగజార్చేవి తప్ప పెంచేవి కావు. మావోయిస్టులు శాంతి చర్చలకు రావడాన్ని అందిపుచ్చుకొని, చిత్తశుద్ధితో ఆహ్వానించి సక్రమంగా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మావోయిస్టులు కాల్పుల విరమణ చేసి, ప్రభుత్వంతో చర్చలు చేసి, ఎన్నికల రంగంలోకి కూడా రాగలిగితే ప్రజాతంత్ర ఉద్యమానికెంతో ఊపునిస్తుంది. సాయుధ పోరాటమైనా, ఎన్నికలైనా లక్ష్య సాధనకు ఎత్తుగడలే. నేపాల్, లాటిన్ అమెరికా, శ్రీలంక తదితర దేశాలలో ఎంతో పెద్ద ఎత్తున చేసిన సాయుధ పోరాటాలను విరమించి, ప్రభుత్వాలతో చర్చలు జరిపి ఎన్నికల్లో పాల్గని విజయాలు సైతం సాధించిన తాజా ఉదాహరణలు మన ముందే ఉన్నాయి.
Let’s invite Maoists to peace talks
మావోయిస్టు పార్టీ నాయకత్వాన వందలాది మంది కార్యకర్తలు చదువులను, ఉద్యోగాలను, ఆస్తులను, కుటుంబాలను వదిలి ప్రాణ త్యాగాలకు సిద్దపడి అనేక త్యాగాలు చేశారు. వారి త్యాగాలు, కృషి ప్రజలేమీ మరవరు, తెలంగాణా సాయుధ పోరాట విరమణ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఫలితాల్లాంటివి పునరావృతమవుతాయనడానికి అవకాశాలు లేకపోలేదు. బీహార్లో వామపక్షాలన్నీ మంచి ఫలితాలను సాధించాయి. అక్కడ లిబరేషన్ పార్టీ పాత్రను తక్కువ అంచనా వేయలేం కదా! పోరాట వారసత్వమున్న తెలంగాణలో ప్రత్యామ్నాయం వామపక్షాలే కాగలిగే అవకాశం వుండొచ్చు.
మావోయిస్టు కేంద్ర నాయకుడు అభయ్ ఇచ్చిన కాల్పుల విరమణ ప్రకటనపై తెలంగాణలోని జస్టిస్ చంద్రకుమార్ నాయకత్వాన వున్న “శాంతి సంఘం” (పీస్ కమిటి) అభినందనీయమైన కృషి చేస్తుంది. కానీ ఇది సరిపోదు. మావోయిస్టుల సమస్య కేవలం తెలంగాణకో. ఛత్తీస్ ఘడ్ సంబంధించినది కాదు. ఈ దేశానికంతా సంబంధించినది. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరగాలి. ఇందుకు తగిన విధంగా కార్యాచరణ వుండాలి.
శాంతి సంఘం సమావేశాల్లో కానీ, సోషల్ మీడియాలో గానీ, ప్రధాన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో గానీ అనేక రకాల చర్చలు జరుగుతున్నవి. మావోయిస్టులు గత్యంతరం లేక కాళ్ళబేరానికి వస్తున్నారని కొందరు, బూర్జువా ప్రభుత్వంతో చర్చలేమిటని మరి కొందరు, దీర్ఘకాలిక సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారమని కాల్పుల విరమణేంటని ఇంకొందరు రాస్తున్నారు. మరో పక్క వందలాది మంది జవాన్లను చంపి, తాత్కాలిక విరమణతో మళ్ళీ తిరిగి పుంజుకోవడానికే మావోయిస్టుల ఎత్తుగడని, మావోయిస్టుల సమస్యను అంతం చేయడానికి ఇదే సమయమని ఆలోచించేవారి సంఖ్య కూడా తక్కువ లేదు. వీరందరూ చర్చలు జరగొద్దని కోరుకునేవారే.
Let’s invite Maoists to peace talks
చర్చలు జరగాలని కోరుకుంటూనే చర్చలకు ఆటంకమయ్యే వాదనలు కొందరు చేస్తుంటారు. మావోయిస్టులు బేషరతుగా చర్చలకు రారు. వారు సాయుధ పోరాటాన్ని విరమించరు. విరమించినా అది తాత్కాలికమే. మావోయిస్టుల కండిషన్లన్నీ ఒప్పుకుంటూనే చర్చలు అనే వాదనలను చేస్తున్నారు. ఇలాంటి చర్చలు కూడా చర్చలు జరుగకున్నా ఫరవా లేదనే అవగాహన నుంచి వచ్చేవే. ఇలాంటి చర్చలు సమస్యను జఠిలం చేస్తాయే తప్ప శాంతి చర్చలు ఫలితాలివ్వడానికి తోడ్పడేవి కావు.
ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రతినిధులు సమావేశం కావాలి. దానికి కావాల్సిన ముందస్తు ఎక్సర్సైజ్ జరగాలి. హడావుడిగా చర్చలు జరిగి, ఫెయిల్ అయితే చాలా నష్టం. జస్టీస్ చంద్రకుమార్ గారి చొరవతో ఏర్పడిన శాంతి సంఘం ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని సమస్యను పరిష్కరిస్తారని ఆశిద్దాం.