
- సీజేఐ గవాయ్ పై దాడికి నిరసన…
- మతోన్మాది రాకేష్ కిశోర్ చిత్రపటాన్ని దగ్దం చేసిన న్యాయవాదులు…
Lawyers protest against attack on CJI : దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై దాడికి యత్నించిన మతోన్మాద ఉన్మాది రాకేష్ కిశోర్ పై హనుమకొండ కోర్టు న్యాయవాదులు మండిపడ్డారు. సీజేఐ పై జరిగిన దాడి రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. గురువారం హనుమకొండ అదాలత్ కోర్టు ఎదుట ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ న్యాయవాదుల ఆధ్వర్యంలో మతోన్మాది రాకేష్ కిషోర్ చిత్ర పటానికి చెప్పుదెబ్బల కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ న్యాయవాది బైరపాక జయాకర్, గంధం శివ, చిల్లా రాజేంద్రప్రసాద్, జీవన్, కృష్ణస్వామి, జిలుకర శ్రీనివాస్, సునీల్, జన్ను పద్మ, ప్రభంజన్, రంజిత్, ఉద్యమ నాయకులు కన్నం సునీల్, కాడపాక రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవ్యవస్థ గౌరవమే ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని పేర్కొన్నారు. దేశ ప్రజలు న్యాయవ్యవస్థను గౌరవించి కాపాడుకోవాలని సూచించారు. ప్రస్తుతం న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. న్యాయమూర్తుల రక్షణ కూడా ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే దాడికి పాల్పడిన సదరు న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థపై, రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను ఖండించాలని పిలుపునిచ్చారు.