Hyderabad Union Territory Status..!? A path to progress..? Has autonomy been given the axe..? ప్రస్తుతం హైదరాబాద్ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు వస్తున్న ఊహాగానాలు అటు ఆశలను, ఇటు ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. దీనిని రాష్ట్ర ప్రభుత్వం కూడా కనిపించని సఫోర్ట్ చేయడం జరుగుందంనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఒక నగరాన్ని రాష్ట్రం నుండి వేరు చేయడం అనేది కేవలం పరిపాలనాపరమైన నిర్ణయం మాత్రమే కాదు, అది ఆ ప్రాంత ప్రజల ఆత్మగౌరవంతో పాటు ఆర్థిక మూలాలతో ముడిపడి ఉన్న అంశం. అయితే హైదరాబాద్ ఒక చారిత్రక నగరం మాత్రమే కాదు, అది తెలంగాణ అస్తిత్వం. కేవలం అభివృద్ధి పేరుతో నగరాన్ని రాష్ట్రం నుండి వేరు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఒక వర్గం వాదిస్తోంది. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో నగరాన్ని పోటీకి నిలపాలంటే కేంద్రం ప్రత్యక్ష జోక్యం అవసరమని మరో వర్గం అభిప్రాయపడుతోంది.
Hyderabad Union Territory Status..!? A path to progress..? Has autonomy been given the axe..?
హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా మారితే ఢిల్లీ లేదా చండీగఢ్ తరహాలో కేంద్రం నుండి నేరుగా భారీ బడ్జెట్ కేటాయింపులు జరిగే అవకాశం ఉందని, ఇది మౌలిక సదుపాయాల కల్పనలో వేగాన్ని పెంచుతుందని, శాంతి భద్రతలు కేంద్రం చేతిలోకి వెళ్లడం వల్ల మతపరమైన ఘర్షణలు లేదా రాజకీయ అస్థిరత తలెత్తకుండా కఠిన చర్యలు తీసుకునే వీలుంటుందని ఇది అంతర్జాతీయ పెట్టుబడిదారులలో మరింత నమ్మకాన్ని కలిగిస్తుందని, నగరం ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాకుండా, దేశం మొత్తానికి చెందిన మినీ ఇండియాగా గుర్తింపు పొందుతుందని, దీనివల్ల వలసలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల రాక మరింత పెరుగుతుందని ఓ వర్గం విశ్లేషిస్తున్న వాదనలు వినిస్తున్నాయి.
అయితే నాణేనికి రెండో వైపు చూస్తే, ఈ నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్రానికి కోలుకోలేని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే వాదనలు లేకపోలేదు. తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో సుమారు 50% కంటే ఎక్కువ హైదరాబాద్ నుండే వస్తుంది. హైదరాబాద్‌ను విడదీస్తే తెలంగాణ రాష్ట్రం తీవ్ర ఆర్థిక లోటులో కూరుకుపోయే ప్రమాదం ఉంది. స్థానిక ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బతీయడం వల్ల తీవ్రమైన ఉద్యమాలు, అశాంతి నెలకొనే అవకాశం ఉంది. “తెలంగాణ మాది – హైదరాబాద్ మాది” అనే నినాదం మళ్ళీ ఉధృతమవుతుందని, నీటి సరఫరా, విద్యుత్, రవాణా వంటి అంశాల్లో పొరుగున ఉన్న తెలంగాణ జిల్లాలతో సమన్వయం చేసుకోవడం సంక్లిష్టంగా మారుతుందనేది ఒక వాస్తవమైన విశ్లేషణగా వినిపిస్తుంది.
Hyderabad – Union Territory Status..!? A path to progress..? Has autonomy been given the axe..?
ఇక్కడ గమనించాల్సిన ప్రధానమైన అంశమేంటంటే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా (UT) మార్చడం అనే అంశం కేవలం భౌగోళిక మార్పు కాదు, అది ఒక భారీ “ఆర్థిక, సామాజిక శస్త్రచికిత్స” వంటిది. దీనివల్ల కలిగే ప్రభావాలను తట్టుకోవడం చాలా కష్టసాధ్యంగానే ఉంటుందనడంలో హందేహం లేదు. ముందే చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాద్ వాటా సింహభాగం. ఒకవేళ హైదరాబాద్ UTగా మారితే తెలంగాణకు వచ్చే మొత్తం GST ఆదాయంలో సుమారు 60% నుండి 70% వరకు ఒక్క హైదరాబాద్ నుంచే వస్తుంది. ఇది కోల్పోతే రాష్ట్రం తన సంక్షేమ పథకాలకు అమలుకు నిధులు సమకూర్చుకోవడం అసాధ్యంగా మారుతుంది. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల భూముల విలువలు ఒక్కసారిగా పడిపోయే లేదా అనిశ్చితికి లోనయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆ జిల్లాల అభివృద్ధి హైదరాబాద్‌తో ముడిపడి ఉంది కాబట్టి.
కేంద్రపాలిత ప్రాంతంగా మారితే, కేంద్రం ఇచ్చే కార్పొరేట్ పన్ను రాయితీలు వల్ల అంతర్జాతీయ సంస్థలు మరింతగా ఆకర్షించబడవచ్చు. ఉదాహరణకు చండీగఢ్ నగరాన్ని గమనిస్తే, అక్కడ కేంద్రం నేరుగా పర్యవేక్షించడం వల్ల మౌలిక సదుపాయాలు అత్యుత్తమంగా ఉంటాయి. కానీ, స్థానిక జనాభాకు ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే “స్థానిక ప్రాధాన్యత” అక్కడ ఉండదు అనేది గమనించాల్సిన అంశం. మరోవైపు ఢిల్లీ తరహా సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. ఢిల్లీలో ముఖ్యమంత్రికి, లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య జరిగే అధికార పోరాటం మనం చూస్తూనే ఉన్నాం. దీని ప్రకారం చూస్తే హైదరాబాద్‌లో కూడా మున్సిపల్ కార్పొరేషన్ కి, కేంద్రం నియమించే అడ్మినిస్ట్రేటర్‌కు మధ్య నిరంతరం ఘర్షణ వాతావరణం నెలకొనవచ్చు. ఇక శాంతి భద్రతలు కేంద్రం చేతిలోకి వెళ్తే, స్థానిక రాజకీయ నాయకుల జోక్యం తగ్గుతుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్థానిక సమస్యలపై పోలీసులకు ఉండే అవగాహన స్పందన తగ్గే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందే “నీళ్లు, నిధులు, నియామకాలు” అనే నినాదంతో. ఇప్పుడు “నిధులు” ఇచ్చే హైదరాబాద్‌ను వేరు చేస్తే, అది మరో తీవ్రమైన ప్రజా ఉద్యమానికి దారితీయకుండా ఉంటుందా..? శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ఉంటుందా..? హైదరాబాద్‌కు వచ్చే కృష్ణా, గోదావరి జలాలు తెలంగాణ జిల్లాల గుండా ప్రవహిస్తాయి. నగరం UTగా మారితే, నీటి పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య జల వివాదాలు తలెత్తకుండా ఉంటాయా..? అనే ప్రశ్నలు సహజంగానే ఉత్న్నమవుతున్న పరిస్థితి.
Hyderabad – Union Territory Status..!? A path to progress..? Has autonomy been given the axe..?
ఏదేమైనా నగరం అభివృద్ధి చెందాలంటే కావాల్సింది కేవలం హోదా మార్పు కాదు, పారదర్శకమైన పాలన, స్థిరమైన విధానాలు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం వల్ల వచ్చే తాత్కాలిక లాభాల కంటే, దాని వల్ల కలిగే సామాజిక, రాజకీయ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనేది అర్థం చేసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేయడమే శ్రేయస్కరం తప్ప, విభజన రేఖలు గీయడం కాదు. హైదరాబాద్ లేని తెలంగాణను ఊహించడం కూడా కష్టమే. ఒకరకంగా ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. ఒకవేల హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ప్రతిపాదన బలంగా ముందుకొస్తే తెలంగాణ ఆత్మగౌరవం, అస్థితంగా అనుకునే ప్రతిఒక్కరూ ఆ ప్రతిపాధన నిర్ణయాన్ని తిరష్కరించాల్సిన అవసరం ఉంది.
రాజేందర్ దామెర (దారా)
సీనియర్ జర్నలిస్ట్
