Hills disappearing due to illegal mining : ప్రకృతి ప్రసాదించిన సంపద గుట్టలు. ఇవి కేవలం రాళ్ల కుప్పలు మాత్రమే కాదు, పర్యావరణ సమతుల్యతను కాపాడే రక్షణ కవచాలు. కానీ నేడు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న మైనింగ్ మాఫియా చేతుల్లో ఈ గుట్టలు కరిగిపోతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ముఖ్యంగా హనుమకొండ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న స్టోన్ క్రషర్లు, గ్రానైట్ తవ్వకాలు పర్యావరణానికి శాపంగా మారాయి.
Hills disappearing due to illegal mining.!?
మైనింగ్ రంగంలో పాటించాల్సిన కనీస జాగ్రత్తలు ఇక్కడ మచ్చుకైనా కనిపించడం లేదు. స్టోన్ క్రషర్లు ఏర్పాటు చేయాలంటే నివాస ప్రాంతాలకు, సాగు భూములకు నిర్ణీత దూరం ఉండాలనే నిబంధన ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఎయిర్ పొల్యూషన్ నియంత్రణకు వాటర్ స్ప్రింక్లర్లు వాడాలి, ధూళి బయటకు రాకుండా రక్షణ గోడలు నిర్మించాలి. కానీ, ఇవేవీ పట్టించుకోకుండా విచ్చలవిడిగా క్రషర్లు నడుపుతుండటంతో గాలిలో దుమ్ము ధూళి చేరి ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారని ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా శాయంపేట మండలం పత్తిపాక గ్రామ శివారులోని క్రషర్ నిర్వహణ పట్ల ఆ గ్రామ యువత నిరసన వ్యక్తం చేయడమే ఇందుకు సాక్ష్యం.
Hills disappearing due to illegal mining.!?
ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున బోర్ బ్లాస్టింగ్స్ (పేలుళ్లు) జరుపుతున్నారని, ఈ పేలుళ్ల ధాటికి ఇండ్లు పగుళ్లు తేలుతున్నాయని, గ్రామ ప్రజలు భయం గుప్పిట్లో బతుకాల్సి వస్తుందని పలువురు ఆవేదన చెందటం గమనార్హమే. ఇక పేలుళ్ల వల్ల వచ్చే రాళ్లు, క్రషర్ల నుండి వెలువడే దుమ్ము పొలాల్లో పేరుకుపోయి పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతున్న పరిస్థితి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా జరుగుతున్న పేలుళ్లు, భారీ యంత్రాల శబ్దాలతో ప్రజలు ప్రశాంతత కోల్పోతున్నారు. ముఖ్యంగా ఈ హనుమకొండ జిల్లాలోని పలు మండలాల్లో గుట్టలు ఉనికిని కోల్పోతున్నాయి. శాయంపేట మండలంం పత్తిపాకలో ఒక గుట్ట ఇప్పటికే పూర్తిగా కనుమరుగైంది. మాందారిపేట, ప్రగతి సింగారం గుట్టలు కూడా అదే బాటలో ఉన్నాయి. పరకాల మండలం అలియాబాద్లోని గుట్టల తవ్వకాలతో నామరూపాలు లేకుండా పోయింది. దామెర, ఆత్మకూర్ మండలాల్లోని పెద్దాపూర్, పసరగొండ, దామెర, నీరుకుళ్ల కేశవాపూర్, కొత్తగట్టు సింగారం తదితర ప్రాంతాల్లోని గుట్టలు అక్రమార్కుల జేబులు నింపుతూ కరిగిపోతున్నాయి.
Hills disappearing due to illegal mining.!?
ఇక మైనింగ్, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కనీస తనిఖీలు చేపట్టకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అక్రమాలను అడ్డుకోవాల్సిన వారే మైనింగ్ యజమానులకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు చేసినా మొక్కుబడి చర్యలతో సరిపెడుతున్నారే తప్ప, శాశ్వత పరిష్కారం చూపడం లేదు. అక్రమ మైనింగ్ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో వర్షపాతం తగ్గడంతో పాటు తీవ్రమైన పర్యావరణ ముప్పు పొంచి ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి, ప్రత్యేక బృందాలతో విచారణ జరిపించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న క్రషర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అంతరిస్తున్న గుట్టలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
దారా – సీనియర్ జర్నలిస్ట్
