High Court verdict violates fundamental right to education : తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ విషయమై విద్యాసంస్థల యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ. 8514 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని కోరుతూ వారు కోర్టును ఆశ్రయించినప్పటికీ, హైకోర్టు మాత్రం ఆ మొత్తాన్ని విద్యార్థుల నుంచే వసూలు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు భారత రాజ్యాంగం కల్పించిన విద్యా ప్రాథమిక హక్కుకు విరుద్ధంగా ఉందని భావించాల్సి వస్తోంది. దేశంలో ప్రతి పౌరునికి విద్య అందించడం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అయితే విద్యార్థుల సంఖ్యకు సరిపోయే విధంగా విద్యాసంస్థలను ఏర్పాటు చేయకుండా, “స్కాలర్షిప్లు, రీయింబర్స్మెంట్లు ఇస్తాము, మీకు నచ్చిన కాలేజీలో చదువుకోండి” అనే విధానాన్ని అమలు చేస్తూ, ఫీజులు వేలల్లో పేరుకుపోయిన తర్వాత చెల్లింపులు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు న్యాయం కోరితే వారిపై అక్రమ కేసులు పెట్టడం జరుగుతోంది. విద్యాసంస్థల యాజమాన్యాన్ని కూడా ఒత్తిడులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం అన్యాయం చేస్తోందని కోర్టును ఆశ్రయించినప్పుడు, ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించి, సరైన మార్గనిర్దేశం చేయాల్సిన కోర్టు, విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలని చెప్పడం పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే చర్యగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి సంబంధించిన అనేక బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలకు సంబంధించిన నిధులు విడుదల కాలేదు. గత తొమ్మిది నెలలుగా మెస్ సరఫరాలు చేస్తున్న కాంట్రాక్టర్లకు కూడా బకాయిలు చెల్లించలేదు. ఈ పరిస్థితిలో వారు కోర్టును ఆశ్రయిస్తే, “విద్యార్థులకే మీరు భోజనం పెట్టారు కాబట్టి వారి నుంచే వసూలు చేసుకోండి” అనే పరిస్థితి వస్తే అది ఎంత అన్యాయమో స్పష్టమవుతుంది.
High Court verdict violates fundamental right to education
ఈ అంశంపై దేశవ్యాప్తంగా గతంలో వచ్చిన పలు తీర్పులు విద్య హక్కును బలపరిచాయి. “మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక” కేసులో విద్య హక్కు ప్రాథమిక హక్కులతో అనుసంధానమై ఉందని పేర్కొన్నారు. “ఉన్ని కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్” కేసులో విద్య హక్కు రాజ్యాంగ పరిరక్షణలో భాగమని స్పష్టం చేశారు. “మోడ్రన్ డెంటల్ కాలేజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్” కేసులో విద్య వాణిజ్య వస్తువుగా మారకూడదని, విద్యార్థులపై అధిక ఆర్థిక భారం మోపడం అనుచితమని అభిప్రాయపడ్డారు.
High Court verdict violates fundamental right to education
ఈ తీర్పుల నేపథ్యంలో పేద విద్యార్థులపై ఆర్థిక భారం మోపడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అందువల్ల హైకోర్టు తీర్పును తక్షణమే పునఃసమీక్షించి, పెండింగ్లో ఉన్న రూ. 8514 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. అలాగే ప్రైవేట్ కళాశాలలు సర్టిఫికేట్లు ఇవ్వకుండా చేస్తున్న బలవంతపు వసూళ్లను అరికట్టాలి. విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడులు లేకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని వారి భవిష్యత్తును రక్షించాలి.
దామెర కిరణ్ SFI రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ రాష్ట్రం
