- నోబెల్ గౌరవం అందుకున్న మన దేశంలో ఇంకా మూఢనమ్మకాల చీకట్లు ఎందుకు..?
Has the light of C.V. Raman entered our lives : సర్ సి.వి. రామన్ 1928, ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ (Raman Effect) ను కనుగొన్నారు. రామన్ ఎఫెక్ట్ అనేది కాంతి ఒక పారదర్శక పదార్థం (ఘన, ద్రవ లేదా వాయువు) గుండా ప్రయాణిస్తున్నప్పుడు, వాటిలోని అణువుల వల్ల పరిక్షేపం (Scattering) చెంది తన తరంగదైర్ఘ్యం మరియు పౌనఃపున్యంలో మార్పులకు లోనయ్యే దృగ్విషయాన్ని కనుగొన్నారు. ఈ పరిశోధన ద్వారా కాంతి తన స్వభావం మారుతుందని శాస్త్రీయంగా నిరూపించారు. దీనినే రామన్ ఎఫెక్ట్ అంటారు. ఈ ఆవిష్కరణకు గాను 1930లో ఆయనకు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఈ ప్రయోగ ఫలితంగా రసాయనాల అణు నిర్మానాన్ని (Molecular Structure) అర్థం చేసుకోవడానికి రామన్ స్పెక్ట్రోస్కోపీ (Raman Spectroscopy) లో దీనిని విస్తృతంగా వివిధ రూపాల్లో వినియోగించడం జరుగుతుంది.రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్న ఫిబ్రవరి 28న ప్రతి ఏటా భారతదేశంలో ‘జాతీయ సైన్స్ దినోత్సవం’ (NATIONAL SCIENCE DAY) జరుపుకుంటున్నాం. రామన్ ఎఫెక్ట్ ని ఇంకాస్త సరళంగా చెప్పాలంటే, కాంతి అణువులను ఢీకొన్నప్పుడు, కొన్ని కాంతి కణాలు (ఫోటాన్లు) శక్తిని కోల్పోవడం లేదా పొందడం వల్ల వాటి రంగు (పౌనఃపున్యం) మారుతుంది. దీనినే రామన్ ప్రభావం (RAMAN EFFECT) అంటారు. ఈ ప్రయోగ ఫలితంమే నేటి రసాయన శాస్త్రం, ఔషధ పరిశ్రమ, ఫోరెన్సిక్ సైన్స్, మెడికల్ డయాగ్నోస్టిక్స్, నానో టెక్నాలజీ వంటి అనేక రంగాలకు పునాది అయింది.ఆ కాలంలో భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది.అయినా ఒక భారతీయ మేధస్సు ప్రపంచాన్ని మంత్ర ముగ్ధులను చేసింది. అది కేవలం వ్యక్తిగత గౌరవం కాదు.భారత మేధస్సుకు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది.
Has the light of C.V. Raman entered our lives..?
1930 లోనే రామన్ ఎఫెక్ట్ వంటి శాస్త్రీయ విజయం సాధించిన దేశంలో ఇంకా జాతకాలు, గ్రహదోషాలు, దృష్టిదోషాలు, మంత్రాలు, పూజల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు? గ్రహణం రోజున గర్భిణులు భయపడాలి? వ్యాధులకు వైద్యుడి బదులు తంత్రగాళ్లను నమ్మడం?శాస్త్రాన్ని చదివినవారు కూడా మూఢాచారాలను పాటించడం? ఇది మేధస్సు లోపమా? లేక మానసిక బానిసత్వమా? ప్రపంచంలో శాస్త్రీయ పరిశోధనలో ముందున్న దేశాలు ప్రతి ఏడాది అనేక నోబెల్ బహుమతులు సాధిస్తున్నాయి. కానీ భారతదేశం మాత్రం 140 కోట్ల జనాభా ఉన్నా కూడా శాస్త్రీయ నోబెల్ బహుమతుల సంఖ్య పరిమితమే. ఈ పరిస్థితి దేశంలో ప్రతిభ లేకపోవడం వల్ల కాదు. మన వ్యవస్థలో లోపాల వల్ల జరుగుతుంది. ప్రధాన కారణాలు: ప్రపంచ స్థాయిలో పరిశోధనలో ముందుండాలంటే పెట్టుబడి అవసరం. భారతదేశం R&D పై తన GDPలో సుమారు 0.6–0.7% మాత్రమే ఖర్చు చేస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది 2–4% మధ్య ఉంటుంది. శాస్త్రీయ పరిశోధనకు సరిపడ వనరులు లేకపోతే ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు ఎలా వస్తాయి? పరిశోధనపై తక్కువ పెట్టుబడి మేధావులు వలస వెళ్లిపోవడం (Brain Drain) విజ్ఞాన శాస్త్రం కంటే అంధవిశ్వాసాలకు, మూఢనమ్మకాలకు సామాజిక ప్రాధాన్యం ఇవ్వడం. విమర్శనాత్మక ఆలోచనను నిరుత్సాహపరచడం. శాస్త్రవేత్తలను గౌరవించకుండా… జ్యోతిష్యూలను సెలబ్రిటీలుగా మలచే సమాజంలో నోబెల్ బహుమతి ఎలా వస్తుంది ? సామాజిక శాస్త్ర దృష్టిలో మూఢనమ్మకం అనేది కేవలం అవివేకం కాదు. అది సామాజిక నిర్మాణం. భయం + అనిశ్చితి + తెలియని విషయాలపై అపోహ = మూఢనమ్మకం. అసలు సమస్య ఏమిటంటే మూఢనమ్మకాలు ప్రశ్నించడాన్ని నిరుత్సాహపరుస్తాయి. విజ్ఞాన శాస్త్రం మాత్రం ప్రశ్నించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ రెండూ కలిసివుండవు.
Has the light of C.V. Raman entered our lives..?
శాస్త్రీయ దృక్పథం – రాజ్యాంగ కర్తవ్యం:
భారత రాజ్యాంగం ఆర్టికల్ 51A(h) ప్రకారం ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేయాలి. కానీ అది పుస్తకాల్లోనే మిగిలిపోతే ప్రయోజనం ఏమిటి? అసలు సమస్య – విజ్ఞానం శాస్త్ర దినోత్సవాన్ని కేవలం పండుగగా మాత్రమే చూడటం ఫిబ్రవరి 28న సైన్స్ డే జరుపుకుంటాం. స్పీచ్‌లు, పోస్టర్లు, సెమినార్లు నిర్వహిస్తాం. మళ్లీ తెల్లవారితే మార్చి 1న మళ్లీ జాతకాలు, దోషాలు, పూజలు నిర్వహిస్తాం.ఇది ద్వంద్వ జీవితం. విజ్ఞాన శాస్త్ర దినోత్సవం పండుగ కాదు. శాస్త్రీయ జీవన విధానాన్ని అలవరుచుకోవాలి. అందుకోసం శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలి. శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండడం ప్రతి పౌరుడి బాధ్యత అని రాజ్యాంగంలో స్పష్టంగా ప్రకటించబడింది.
Has the light of C.V. Raman entered our lives..?
ప్రపంచం క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జినోమిక్ మెడిసిన్ వైపు పరుగులు తీస్తున్న సమయంలో…మన దేశంలో కొన్ని అశాస్త్రీయ విషయాలకు “శాస్త్రీయత” ముసుగు తొడిగే ప్రయత్నాలు జరిగాయి. గత దశాబ్ద కాలంలో పురాణ కథనాలను ప్రత్యక్ష శాస్త్రీయ చరిత్రగా ప్రకటించడం, శాస్త్రీయంగా నిరూపించబడిన చార్లెస్ డార్విన్ ప్రకటించిన ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ విద్యార్థుల సిలబస్ ల నుండి తొలగించడం. జ్యోతిష్యాన్ని “శాస్త్రం”గా సమర్థించి దానిని యూనివర్సిటీలో ఒక కోర్సుగా విద్యార్థులకు చెప్పడం అంతటితో ఆగిపోకుండా భూత వైద్యం లో ప్రత్యేక కోర్సును కొన్ని యూనివర్సిటీలు అందించడం. గోమూత్రం లేదా ఇతర సంప్రదాయ పదార్థాలకు సరైన పరిశోధన లేకుండానే ఔషధ గుణాలు ప్రకటించడం. ఈ విషయాన్ని దేశంలో బాబాలు, స్వామీజీలు మరియు రాజకీయ నాయకులు ప్రచారం చేయడం. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వంటి అత్యవసర సమయంలో దీపాలు వెలిగించడం, పాత్రలు మోగించడం ద్వారా వైరస్‌ను తరిమేస్తాయని అపోహ కల్పించడం.“ఇటువంటి చర్యలు ఐక్యతకు ప్రతీకలుగా ఉండవచ్చు. కానీ వాటిని వైరస్ కు నివారణగా ప్రచారం చేయడం శాస్త్రీయంగా సరైంది కాదు.” గ్రహాల స్థానాల ఆధారంగా జీవన నిర్ణయాలు తీసుకోవడం ఇలా ఎన్నో విషయాలు మన సమాజంలో అబద్ధాలు నిజాలుగా రుద్దబడుతున్నాయి. ఇవి వ్యక్తిగత విశ్వాసాల పరిమితిలో ఉంటే సమస్య తక్కువే కానీ ఇవి శాస్త్రీయ సత్యాల స్థానంలో నిలబడే ప్రయత్నం చేస్తే అది సమాజానికి ప్రమాదకరం. అశాస్త్రీయ విషయాలను విజ్ఞాన శాస్త్రంగా ప్రకటించే ప్రమాదం అంచున ఇవ్వాళ మనం ఉన్నాం. శాస్త్రం అంటే పునరావృత పరీక్ష, ఆధారాలు,సమీక్ష (Peer Review),సందేహం ఈ ప్రమాణాలు లేకుండా ఏదైనా అంశాన్ని “శాస్త్రం”గా ప్రకటించడం శాస్త్రానికి అవమానం. ఇది రెండు విధాల నష్టం కలిగిస్తుంది. ప్రజలు నిజమైన విజ్ఞాన శాస్త్రంపై విశ్వాసం కోల్పోతారు. విద్యార్థులలో,యువతలో గందరగోళం పెరుగుతుంది. అసలు సమస్య ఏంటంటే విమర్శనాత్మక చర్చ లేకపోవడం, శాస్త్రం ప్రశ్నలను ఆహ్వానిస్తుంది. మూఢనమ్మకం ప్రశ్నలకు భయపడుతుంది. గత పదేళ్లకు పైగా మన దేశంలో సోషల్ మీడియా ద్వారా అపోహలు వేగంగా వ్యాపించాయి. నిజమైన డేటా కంటే భావోద్వేగాలు ఎక్కువ ప్రభావం చూపించాయి. ఇది డిజిటల్ యుగంలో మూఢనమ్మకాల కొత్త రూపం.
Global Innovation vs Local Superstition
ఇటీవల వివిధ గ్లోబల్ వేదికలపై మరియు మన దేశంలో నిర్వహించిన అంతర్జాతీయ సమ్మిట్లలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, జినోమిక్ మెడిసిన్, డేటా సైన్స్ వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ప్రపంచం భవిష్యత్తు గురించి మాట్లాడుతోంది. మనం ఇంకా గ్రహదోషాల గురించి మాట్లాడుతున్నామా? ప్రపంచం సాక్ష్యాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటోంది. మనం ఇంకా అపోహల ఆధారంగా జీవన నిర్ణయాలు తీసుకుంటున్నామా? ఇది అభివృద్ధి మరియు అవివేకం కలిసిన విరుద్ధ వాస్తవం. గత దశాబ్ద కాలానికి పైగా అశాస్త్రీయానికి శాస్త్రీయ ముసుగు వేసే ప్రయత్నం చేశారు.
Has the light of C.V. Raman entered our lives..?
విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు. వారే ఈరోజు తరగతి గదుల్లో కూర్చున్నారు.వారికి మార్కులు మాత్రమే కాదు, మేధస్సు అవసరం.భక్తి కాదు, బుద్ధి అవసరం. భయం కాదు, విచారణ అవసరం. ఒక విద్యార్థి “ఎందుకు?” అని అడిగితే ఒక తరగతి మారుతుంది. ఒక తరగతి మారితే ఒక తరం మారుతుంది.రామన్ గారు కాంతిని ప్రశ్నించారు — అందుకే నోబెల్ గెలిచారు.
మనము ప్రశ్నించడాన్ని ఆపేస్తే — మనము చీకటిలోనే మిగిలిపోతాం. నోబెల్ బహుమతులు ప్రయోగశాలల్లో గెలుస్తారు. శాస్త్రీయ దృక్పథం సమాజంలో గెలవాలి. రామన్ వెలుగు ప్రయోగశాలలో ఆగిపోకూడదు. అది మన ఇళ్లలో, పాఠశాలల్లో, మనసుల్లో వెలగాలి.లేకపోతే నోబెల్ గెలిచిన దేశంలో మూఢనమ్మకాలు గెలుస్తూనే ఉంటాయి.
- చార్వాక
- ఫౌండర్ & ప్రెసిడెంట్,
- సైంటిఫిక్ స్టడీ ఫోరం (SSF)
- సెల్ : 93472 84111
