Gram Swarajya Dhruvathara A literary tribute to ‘Kusam Rajamouli’ : భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందని మహాత్మా గాంధీ చెప్పారు. ఆ మాటలకు సజీవ రూపం ఇచ్చి, ఒక మారుమూల పల్లెను అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చేలా కూసం రాజమౌళి గొప్ప కృషి చేశారు. వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ గా ఆయన మరణం తెలంగాణ గ్రామీణ వికాస చరిత్రలో ఒక శకాన్ని ముగించింది. అధికారం అంటే హోదా కాదు, అదొక సామాజిక బాధ్యత అని నిరూపించిన రాజమౌళి జీవన ప్రస్థానం నేటి తరం ప్రజా ప్రతినిధులకు ఒక పాఠ్యపుస్తకంగా చెప్పక తప్పదు.
రాజమౌళి సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన కాలంలో గంగదేవిపల్లి ఇతర పల్లెల లాగే ఎన్నో సమస్యలతో ఉండేది. కానీ, ఆయనలో ఉన్న ఒక స్పష్టమైన విజన్ ఆ గ్రామాన్ని మార్చివేసింది. అభివృద్ధి అంటే కేవలం కాంక్రీటు కట్టడాలు కాదని, అది ప్రజల ఆలోచనా విధానంలో రావాల్సిన మార్పు అని ఆయన బలంగా నమ్మారన్నట్లుగా ఆయన చేసిన ప్రణాళిక బదైదమైన కృషిని పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇందుకోసం ఆయన ఎంచుకున్న ఆయుధం “సమష్టి భాగస్వామ్యం”. గ్రామంలో ఏ పని చేయాలన్నా గ్రామస్తులందరినీ భాగస్వాములను చేయడం, వారిలో బాధ్యతను పెంచడం రాజమౌళి అనుసరించిన గొప్ప వ్యూహం. గంగదేవిపల్లి దేశానికే ఆదర్శంగా నిలవడానికి రాజమౌళి అమలు చేసిన కొన్ని విప్లవాత్మక నిర్ణయాలే కారణం గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించడం ద్వారా పేద కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు కావాలనే పట్టుదలతో గ్రామస్తుల సహకారంతో నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించి దేశం దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా గ్రామాభివృద్ధి కోసం 18 రకాల కమిటీలను ఏర్పాటు చేసి, అందులో మహిళలకు, యువతకు పెద్దపీట వేశారు. ఇంకుడు గుంతల నిర్మాణం, తాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం వంటి రంగాల్లో ఈ కమిటీలు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. ప్రతి ఇంటికీ బ్యాంక్ ఖాతా ఉండటమే కాకుండా, గ్రామస్థులు పొదుపు చేసుకునేలా పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి ప్రోత్సహించి ఆర్థిక స్వావలంబన దిశగా గ్రామాన్ని నడిపించి ఫలితాలు సాధించారు. ఇలాంటి అనేక ప్రయోగాలతో ఆ గ్రామ ఖాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలుపడంలో ఆయన పాత్ర కీలకం. కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్నోసార్లు ఉత్తమ పంచాయతీ పురస్కారాలను అందుకోవడమే కాకుండా, ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు సైతం ఈ పల్లెను సందర్శించేలా రాజమౌళి కృషి చేశారు. ప్రధానులు, ముఖ్యమంత్రులు సైతం గంగదేవిపల్లి అభివృద్ధి నమూనాను అధ్యయనం చేయాలని సూచించారంటే అది రాజమౌళి అకుంఠిత దీక్షకు నిదర్శనంగా విశ్లేషకులు భావిస్తుంటారు. “నిర్మల్ గ్రామ్” పురస్కారం నుండి మరెన్నో జాతీయ అవార్డుల వరకు గంగదేవిపల్లి ప్రయాణం రాజమౌళి కీర్తి కిరీటంలో మణిపూసలు. కూసం రాజమౌళి అకాలమరణం ఆ గ్రామానికి తీరనిలోటుగానే భావించాలి. భౌతికంగా ఆయన లేకపోయినా, ఆయన ముందుకు నడిపిన “గంగదేవిపల్లి మోడల్” ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. గ్రామ స్వరాజ్యం ఎలా ఉండాలో ప్రపంచానికి చూపిన ఒక సామాన్యుడు సాధించిన అసామాన్య విజయమిది. అభివృద్ధి అనేది ప్రభుత్వ నిధులతోనే కాదు, ప్రజల మనసులను గెలుచుకుని వారి శ్రమను అభివృద్ధికి జోడిస్తే అద్భుతాలు జరుగుతాయని నిరూపించారు రాజమౌళి. రాజమౌళికి నిజమైన నివాళి అంటే.. ఆయన నేర్పిన క్రమశిక్షణను, సామాజిక బాధ్యతను గంగదేవిపల్లి కొనసాగించడమే. ప్రతి పల్లె అందిపుచ్చుకోవడమే.
రాజేందర్ దామెర (దారా) సీనియర్ జర్నలిస్ట్
