రాజనాల శ్రీహరి డిమాండ్
Gas prices should be reduced immediately కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను విపరీతంగా పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి మండిపడ్డారు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
2014లో కాంగ్రెస్ హయాంలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 420 ఉంటే, బీజేపీ అధికారంలోకి వచ్చాక అది రూ. 920కి చేరిందని గుర్తు చేశారు. తాజాగా మళ్లీ రూ. 60 పెంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. “కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచేటప్పుడు రూపాయల్లో పెంచుతూ, తగ్గించేటప్పుడు మాత్రం పైసల్లో తగ్గిస్తూ ప్రజలను వంచిస్తోంది” అని విమర్శించారు.
వ్యాపారాలు లేక, అప్పుల బాధతో చిరు వ్యాపారులు, పేద ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయని రాజనాల శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో గ్యాస్ ధరలు పెంచడం ప్రజలను మరింత ఆగ్రహానికి గురి చేస్తోందన్నారు. “కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి వీడాలి. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించకపోతే బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తాం.” అని తక్షణమే పెంచిన ధరలను ఉపసంహరించుకోని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
