అల్లాడుతున్న సామాన్యులు, చిరు వ్యాపారులు..
పాత పద్ధతిలోనే గ్యాస్ సరఫరా చేయాలని
CPI (ML) లిబరేషన్ డిమాండ్
Gas agencies’ ‘block’ racket భూపాలపల్లి జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల అక్రమ దందా సామాన్యుడి నడ్డి విరుస్తోంది. ఆన్లైన్ బుకింగ్ పేరుతో జరుగుతున్న జాప్యం, ధరల దోపిడీపై సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ నిప్పులు చెరిగారు. జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, గ్యాస్ పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు.
Gas agencies’ ‘block’ racket..!?
ఆన్లైన్ విధానం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ రావడానికి 20 రోజులు పడుతోందని, వెంటనే బుకింగ్ విధానాన్ని రద్దు చేసి, పాత పద్ధతిలోనే ఇంటింటికీ పంపిణీ చేయాలని కోరారు. రూ. 1850 ఉన్న కమర్షియల్ గ్యాస్‌ను రూ. 3000 కు, రూ. 1000 ఉన్న వంట గ్యాస్‌ను రూ. 2000 కు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ ఏజెన్సీలు సొమ్ము చేసుకుంటున్నాయని ఆరోపించారు. వినియోగదారులకు గ్యాస్ ఇవ్వకుండానే ముందే ఓటీపీలు సేకరించి, ఆ సిలిండర్లను బ్లాక్‌లో అమ్ముతూ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గ్యాస్ ధరల భారంతో హోటల్, బజ్జీల బండి వ్యాపారులు వీధిన పడుతున్నారని, కట్టెల పొయ్యి కొందామన్నా వేలల్లో ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి చిట్యాల, పరకాల, మొగుళ్లపల్లి గ్యాస్ గోదాములను తనిఖీ చేయాలని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని మల్లేష్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీటీయూ నాయకులు కన్నూర్ డానియల్, సదానందం, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
