
మార్షల్ ఆర్ట్స్ ఎందుకు? అమహావి మనిషికి ఎలా ఉపయుక్తమవుతాయి? ఆరోగ్యం ఎందుకు పాడవుతుంది? ఈ విశ్వంతో మనిషికి ముడి యేమిటి? బోధిధర్ముడు యుద్ధకళల గురువుగా ప్రపంచానికి నేర్పింది యేమిటి? అసలు యుద్ధం అంటే ఏమిటి? వంటి అనేక అంశాల మీద చింతన నన్ను అన్వేషణ మార్గంలోకి నడిపింది.
నా అన్వేషణ నన్ను ఒక సముద్ర తీరానికి చేర్చింది. ఆ సముద్రం పేరు గల్లా ప్రకాశ్ రావు. విశ్వశక్తితో శరీరాన్ని అనుసంధానం చేసి, ప్రాకృతిక జీవన సౌందర్యాన్ని ఎలా అనుభవించాలో, ఎలా ఆనందించాలో మార్గం చూపిన దీపధారి వారు. నా సందేహాలకు సమాధానాలు లభించేలా చేసిన మార్గదర్శి వారు.. ప్రతీ మనిషికీ మూడు శరీరాలుంటాయని బౌద్ధం అంటుంది. అవి మూడు కర్మల వల్ల జనించాయి. ఒకటి, కాయకర్మ, వచీకర్మ, మనోకర్మ అనే ఈ మూడు కర్మలు ఒక మనిషి యొక్క
ఉనికినీ, భవిష్యత్తునీ నిర్ణయిస్తాయి. కాయకర్మ, వచీకర్మలు రెండూ మనోకర్మ వల్ల నియంత్రించబడుతాయి. అంటే ఒక మనిషి చేసే పనులు, వారి నోటి నుంచి వెలువడే మాటలు అన్నీ అతని మనస్సు వల్ల నియంత్రించబడుతాయి. అతడు మంగళకరమైన చింతన చేస్తే కుశల కర్మలు చేస్తాడు. ఒకవేళ అతడు అమంగళకరమైన చింతన చేస్తే అకుశల కర్మలు చేస్తాడని బుద్ధుడు బోధించాడు. అందుకే, కుశల కర్మలు చేయడానికి అవసరమైన మానసిక స్థితిని లేదా మానసిక కాయాన్ని (బాడీ ఆఫ్ మైండ్)ను చేరుకోవడానికి వ్యాయామం, ధ్యానం, మంచి ఆహారం అవసరమని గ్రహించాలి. ఇక్కడే గురూజీ గల్లా ప్రకాశ్ రావుగారి నిశిత దృష్టిని గమనిచాలి. మంచి ఆరోగ్యం లేకుండా ఒక మనిషి మంచి ఆలోచనలు చేయలేడని వారు అంటారు. మనస్సు అనేక విడిగా ఉనికిలో వుండదనీ, అది శరీరంలోని అతిముఖ్యమైన మెదడు, అందులోని కోట్లాది న్యూరాన్ల పనివిధానం వల్ల మనస్సు అనే ఒక భావన ఏర్పడుతందని అంటారు.
ప్రకృతి మనిషికి తల్లి. రెండు ప్రకృతులు వుంటాయని ఆయన అంటారు. ఒకటి మనిషి చుట్టూ వున్న ప్రకృతి. రెండోది మనిషిలోపలి ప్రకృతి. ఒకటి బాహ్య ప్రకృతి. రెండోది అంతర్గత ప్రకృతి. ఈ రెండీటి మధ్య సమతుల్యత లోపించటం వల్ల మనిషికి అనారోగ్యం సిద్ధిస్తుందని గురూజీ గల్లా ప్రకాశ్ రావు ప్రవచిస్తారు. అయితే, బాహ్య ప్రకృతిని మనిషి అత్యాశతో గాయపరుస్తున్నాడు. అది ఒక వ్యక్తి చేసే గాయమైతే, సరిచేయవచ్చు. కానీ ఒక ప్రణాళికా ప్రకారం పాలకులు, ఆర్థిక వ్యాపార వ్యవస్థలు ప్రకృతిని ధ్వంసం చేస్తే, మనిషి తప్పకుండా బాధితుడిగా మిగిలిపోతాడు. ఈ పర్యావరణ విధ్వంస కేవలం అడవుల నరికివేత వల్లనో, గనుల తవ్వకం వల్లనో, నదుల లేదా జలాశయాల దురాకమ్రణ వల్లనో జరుగుతుంది అంటే అది పాక్షిక సత్యమే. కానీ, ఫార్మా కంపెనీల లాభాల కోసం ఆసుపత్రులు చేస్తున్న విధ్వంసం కూడా పర్యావరణ విధ్వంసం కిందికి రావాలి. అత్యవసర చికిత్స కోసం
ఉపయుక్తమయ్యే ఆధునిక వైద్యం నిత్యావసరంగా మారిపోవడమే మనిషి అనారోగ్యానికి కారణం.
మనిషి లోపలి పంచభూత నిర్మిత అంతర్గత ప్రకృతిని పరిరక్షించుకోవడానికి అనేక మార్గాలను మన పూర్వీకులు కనిపెట్టారని గురూజీ గల్లా ప్రకాశ్ రావు అంటారు. అవి శాస్త్రీయమైనవని అంటారు. ఆరోగ్య కళలు, నాట్యకళలు, ఇతర లలిత కళలన్నీ యుద్ధకళల నుంచి ఉద్భవించినవే అని వారు అంటారు. శివుడి ఆగ్రహం నుంచి యుద్ధం, తాండవం నుంచి నాట్యం, ఆనందం నుంచి ఇతర కళలు ఉద్భవించాయని ఆధ్యాత్మికవాదులు నమ్ముతారు. అలాగే, ఒక సమాజం తనను తాను రక్షించుకోవడానికి అనివార్యంగా యుద్ధకళలను అభివృద్ధి చేసుకుందని, ఆ క్రమంలోనే ప్రకృతిలోని చరాచర జీవి ఉనికి కోసం, ఆరోగ్యం కోసం అనుసరించే పద్ధతులను పరిశీలించి మనిషి స్వీకరించాడని వారు అంటారు. యుద్ధం అనే దాన్ని భౌతిక స్థితిని దాటి, ఒక మనిషి తనతో తాను చేసే అంతర్గత యుద్ధస్థితికి మన పూర్వీకులు అభివృద్ధి చేశారని వారు అంటారు. దానికి కొనసాగింపే ఆధ్యాత్మిక యుద్ధం అంటారు వారు. ఆ విద్యలను పరిరక్షిస్తూ, భావితరాలకు అందించడానికే తన జీవితాన్ని అంకితం చేశారు వారు. గత యాభై ఐదు యేండ్లుగా వారు తన తపస్సు ఫలితాలను తన శిష్యులకు, తనను ఆశ్రయించినవారికీ పంచుతూనే వున్నారు. ఎంత తెలుసుకున్నా, ఎన్నో కొత్త విషయాలను వారు నేర్పుతూనే వున్నారు. ‘నేను సముద్రం లాంటివాణ్ణి. ఎవరెంత తోడుకుంటే, వాళ్లకు అంత లభిస్తుంది’ అని వారు నవ్వుతుంటారు. నేను ఈ మహాగురువును పదిహేను యేండ్ల కింద కలుసుకున్నాను. ఆ రోజు ఎలా వున్నారో, ఇవ్వాళ కూడా అలాగే వున్నారు. సంపూర్ణ అరోగ్యంతో నవ యువకుడిలా నాలాంటి ఎంతోమందిని నడిపిస్తూనే వున్నారు. ఆయనకు హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు
డాక్టర్ జిలుకర శ్రీనివాస్