
గద్దర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బండి సంజయ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలి
ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి
కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రజా యుద్ధ నౌక గద్దర్ ను అవమానించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలను బండి సంజయ్ వెనక్కి తీసుకుని భేషరతుగా క్షమాపణ చెప్పాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర లు డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం బద్ధం ఎల్లారెడ్డి భవన్ లో జరిగింది.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర లు సంయుక్తంగా మాట్లాడుతూ సాహిత్య కళారూపం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా ప్రజలను చైతన్య పరుస్తూ పోరాడిన యుద్ధ నౌక గద్దర్ పై అర్థరహితంగా బండి సంజయ్ మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. బీజేపీ నేతలను హత్య చేయించిన గద్దర్ కు అవార్డ్ ఇవ్వాలా అంటూ నిరాధార ఆరోపణలు చేస్తూ మీడియా సాక్షిగా మాట్లాడిన సంజయ్ కేంద్ర మంత్రిగా ఉంటూ అప్ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారన్నారు. బీజేపీ చరిత్ర దేశ ప్రజలకు స్పష్టంగా తెలుసని గాంధీని చంపిన గాడ్సేది బీజేపీ ఆర్ఎస్ఎస్ కాదా అని వారు ప్రశ్నించారు. వాస్తవానికి బీజేపీ ది హత్యారాజకీయాల చరిత్ర అని వారు ఎద్దేవా చేశారు.దేశంలో హిందూత్వం పేరుతో అణగారిన వర్గాల ప్రజలను గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో మారణహోమం చేసిన బీజేపీ ఈ దేశానికి ప్రమాదమని వారు ఉద్ఘాటించారు.దేశ స్వాతంత్ర్యం లో బీజేపీ పాత్రే లేదని, దేశంలో జరిగిన ఏ పోరాటంలో బీజేపీ పాత్ర లేకున్నా చరిత్రను వక్రీకరించడంలో బీజేపీ నీచ రాజకీయాలు చేస్తూ దేశంలో మత అజెండాతో అవలంభిస్తున్నారని అన్నారు. అందుకే బండి సంజయ్ బహిరంగంగా వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్, రాష్ట్ర సమితి సభ్యులు భోనగిరి మహేందర్ , కరీంనగర్ జిల్లా కన్వీనర్ లంకా దాసరి కళ్యాణ్, నేతలు సురేష్ తదితరులు పాల్గొన్నారు.