Flags of contempt Dr. BR Ambedkar, Nelson Mandela ఎగిసిపడిన ధిక్కార పతాకాలు ఆ ఇద్దరు. భారతదేశంలో అనాదిగా పాతుకుపోయిన కులాన్ని ధిక్కరించి కుల వ్యవస్థపై జీవితకాలం తిరుగుబాటు చేసి భారతదేశ అణగారిన వర్గాలకు దిక్సూచిగా నిలిచిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒకరైతే… దశాబ్దాలుగా బానిస వ్యవస్థలో మగ్గుతున్న నల్లజాతీయుల విముక్తికోసం జీవితకాలం పోరాడి దక్షిణాఫ్రికా వేగుచుక్కగా నిలిచిన “నెల్సన్ మండేలా” మరొకరు. వీరిద్దరూ స్వేచ్ఛకోసం, అణచివేత అంతం కోసం, దోపిడి, వివక్షలపై తిరుగుబాటు చేశారు. అయితే యాదృచ్ఛికమో ఏమో కాని వీరి తిరుగుబాటు తత్వానికి దగ్గరి పోలిక ఉన్నట్లుగానే మరణాలు కూడా పక్కపక్కనే ఉండటం గమనార్హం. నెల్సన్ మండేలా వర్ధంతి డిసెంబర్ 5 అయితే, డిసెంబర్ 6న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి కావడం విశేషం. ఈ సందర్భంగా వీరిద్దరి జీవిత ఘట్టాలను సూక్ష్మంగా ఒకసారి మననం చేసుకుందాం.
Flags of contempt Dr. BR Ambedkar, Nelson Mandela
మనుషుల్లోనే గిరిగీసి ఒక సెక్షన్ మనుషులను బానిసలుగా, అంటరాని వారుగా చూడటాన్ని సహించలేకపోయారు. దేశాలు వేరైనా ఒక రకంగా వీరి తిరుగుబాటు, స్వేచ్ఛకోసం, సమానత్వం కోసం జరిగింది. అందుకే నేటితరం అందేద్కర్, నెల్సన్ మండేలా స్ఫూర్తిని పుణికి పుచ్చుకోవాల్సిన అవసరముంది. భారతదేశంలోని అణగారిన వర్గాల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితకాలాన్ని అర్పించారు. భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించారు. దక్షిణాఫ్రికాలో బతుకుతున్న నల్లజాతీయుల పక్షాన జీవితకాలం అలుపెరగని పోరుచేసి అసలు మనుషులుగా కూడా గుర్తించబడని నల్లజాతీయులను మనుషులుగా నిలబెట్టారు నెల్సన్ మండేలా. ఆ దేశానికి మొట్టమొదటి నల్లజాతీయునిగా అధ్యక్షుడయ్యారు. భారతదేశంలో రాజ్యాంగం ద్వారా ఓటు హక్కును అంబేద్కర్ కల్పిస్తే.. అసలు మనుషులుగా కూడా గుర్తింపులేని నల్లజాతీయులను బ్యాలెట్ పెట్టె వరకు (ఓటుహక్కు) నెల్సన్ మండేలా తీసుకెళ్లారు. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా విమోచనోద్యమానికి జీవం. మనిషిని పశువుగానో, పనిముట్టుగానో చూడటం పట్ల నిప్పులు చెరిగిన యోధుడు. జాతి వివక్ష, దోపిడి, బానిసత్వంపై తిరుగుబాటు బావుట ఎగురవేసి దశాబ్దాలుగా దక్షిణాఫ్రికాలో కొనసాగుతున్న జాతి వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించినందుకు 27 ఏండ్లు జైల్లో నిర్బంధించబడిన వారు నెల్సన్ మండేలా. అందుకే ప్రపంచంలో ప్రజలను విముక్తి చేయటం కోసం పోరాడిన అతికొద్దిమందిలో ఒకరిగా నెల్సన్ మండేలా కీర్తిపొందారు. మానవాలి ఉన్నంతకాలం, అణచివేత, దోపిడి, వివక్ష, అంటరానితనం ఉన్నంతకాలం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, నెల్సన్ మండేలా పేర్లు వినబడుతూనే ఉంటాయి. నెల్సన్ మండేలా జీవితకాలం శ్రమించిన ఉద్యమం ఫలితంగా 1914 ఏప్రిల్ 26వ తేదీన పొద్దునే పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిలబడిన ఒక ఆఫ్రికన్ యువకుడు తనను పలుకరించిన ఇంగ్లీష్ పత్రికా విలేకరితో “ఇప్పుడు నేను మనిషిని” (నౌ ఐయం ఎ హ్యూమన్ బీయింగ్ ) అన్న మాట వెనుక వందల వేల మంది ఆత్మార్పణ ఉంది. వారి రక్తం ఉంది. పోరాట యోధులు అనుభవించిన చిత్రహింసలున్నాయి. నెల్సన్ మండేలా త్యాగం ఉంది. నల్ల సూర్యుడు నెల్సన్ మండేలా మొదటి నల్లజాతి అధ్యక్షునిగా అధికారం చేపట్టినపుడు అతనిని “నేలమీద నడిచే దేవ దూత’ అంటూ కొనియాడారు. దక్షిణాఫ్రికా జాతిపితగా, ప్రజాస్వామ్య వ్యవస్థాపకునిగా ప్రజల ఆదరణ పొందారు. నెల్సన్ మండేలా జ్ఞాపకార్థం వివిధ నగరాలలో మండేలా విగ్రహాలు ప్రతిష్ఠితమయ్యాయి.
1991లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. జాతి వివక్ష నిర్మూలన కోసం మండేలా నడిపిన పోరాటానికి గుర్తుగా ఆయన పుట్టిన రోజు “జులై 18 మండేలా డే”గా ఐరాస జనరల్ అసెంబ్లీ 2009 నవంబర్ లో ప్రకటించింది. భారత అత్యున్నత పౌరపురస్కారం “భారతరత్న” ఇంకా అమెరికా ప్రెసిడెన్సియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్, పాకిస్థాన్, కెనడా, సోవియట్ రష్యా, తదితర దేశాలు కూడా నెల్సన్ మండేలాకు అత్యున్నత స్థానాన్ని కల్పించాయి. బతికుండగానే ఇలాంటి గౌరవ పురస్కారాలు అందుకున్న నెల్సన్ మండేలా ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
అంబేద్కర్ ఆలోచనలు భారతదేశంలో ఏ మేరకు అనుసరించబడుతున్నాయి, “చిన్నఅద్భుతం, దేవుని ఇంద్రధనుస్సు” దేశంగా పిలువబడిన దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా ఆశయం ఏ మేరకు నెరవేరిందనేది ఒక అంశమైతే, ఈ ఇద్దరి స్వప్నాన్ని సాధించాల్సిన అవసరాన్ని మాత్రం గుర్తించాలి. విముక్తి ఉద్యమాలు తప్పనిసరి అని, ఆత్మగౌరవ పోరాటాలు తప్పనిసరి అని ఈ ఇద్దరి జీవితాలు చాటి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అంబేడ్కర్ చెప్పిన ఓటు విలువను ఏ మేరకు పౌరులు గుర్తిస్తున్నారో కూడా ఒక్కసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం గుర్తించాలి. ఇక్కడ దళిత పక్షపాతి ఉద్యమ నేత కవి, రచయిత కలేకూరి ప్రసాద్ చెప్పిన వ్యాఖ్యలు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, నెల్సన్ మండేలా వర్థంతుల సందర్భంగా వారిని స్మరించుకోవటంలో సందర్భో చితంగా ఉంటాయి.
“నాకు జాలి మాటలొద్దు. కన్నీటి మూటలొద్దు”. నేను బాధితుణ్ణి కాదు… అమరుణ్ణి, ఎగిరే ధిక్కార పతాకాన్ని. నా కోసం కన్నీరు కార్చకండి. మీకు చేతనైతే .. నన్ను మీ గుండెల్లోకి ఆవాహన చేసుకోండి… ఒక పెనుమంటల పెనుగులాటనై ప్రవహిస్తా…అట్టడుగు వర్గాల కోసం, బానిసత్వం నుంచి విముక్తి కల్పించటం కోసం జీవితకాలం పోరు సల్పిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, నెల్సన్ మండేలా వర్ధంతుల సందర్భంగా నాలుగు మాటలు, అందమైన ఉపన్యాసాలు, పూలదండలు వేసి సరిపెట్టుకోకుండా “కలేకూరి ప్రసాద్ వ్యాఖ్యలు” లాగా చేతనైతే వీరిద్దరినీ తమతమ గుండెల్లోకి ఆవాహన చేసుకోవాలి, వారి ఆలోచన విధానాన్ని, త్యాగనీరతిని, ఉద్యను పటుత్వాన్ని ఒంటపట్టించుకోవాలి. వారి స్ఫూర్తితో ఆలోచన, ఆచరణతో ముందుకు సాగాలి. అదే “డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నెల్సన్ మండేలా” లకు నిజమైన నివాళి. అదే నిజమైన స్మరణ..
- దామెర రాజేందర్ (దారా) Editor www.jananirnayam.com
