
- డాక్టర్ జిలుకర శ్రీనివాస్ – విసికె రాష్ట్ర అధ్యక్షులు
Fascist politics from the perspective of “Bandi Bikshapati” : పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు కాశ్మీరులోని పహల్గామ్లో 28 మంది ఇండియన్ టూరిస్టులను కాల్చి చంపారు. టూరిస్టులను కాపాడే క్రమంలో ఒక స్థానిక ముస్లిం యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడి పట్ల సామాన్యులలో సైతం ఆగ్రహావేశాలు పెల్లుబుకడానికి కారణం ఏమంటే టూరిస్టుల మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఈ సంఘటన ఏప్రిల్ 22, 2025 నాడు మధ్యాహ్న సమయంలో జరిగింది. దాడి జరిగిన గంటన్నర దాకా ఈ సంఘటన గురించి ప్రపంచానికి చేరకుండా పాలకులు జాగ్రత్త పడ్డారు. ఈ దాడికి బాధ్యులైన తీవ్రవాదులను, వారికి మద్ధతిస్తున్న వారినీ కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక ఎన్నికల బహిరంగ సభలో ప్రకటించాడు. దేశమంతా తీవ్రవాదులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు వెల్లువలా జరిగాయి. భారత సైన్యం అరేబియా తీరంలోనూ, ఇండో పాక్ సరిహద్దుల వెంట మిలటరీ కవాతులు, డ్రిల్లులు చేసిన అనంతరం, మే 6, 2025 నాడు రాత్రివేళల్లో పాకిస్తాన్లోని తీవ్రవాద సంస్థల కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇండియన్ ఆర్మీ తొమ్మిది చోట్ల దాడులు చేసింది. భారత్ దాడి బాధ్యతాయుతమైనదనీ, సామాన్య పాక్ పౌరులకు నష్టం జరక్కుండా, తీవ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని, అందులో సుమారు 80 మంది తీవ్రవాదులు మరణించి వుంటారని వార్తలు వెలువడ్డాయి. మిలటరీ అధికారులు కూడా అదే విషయాన్ని మీడియా ద్వారా ప్రకటించారు. భారత దాడిలో మసీదులు, మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోయారని పాకిస్తాన్ ప్రకటించింది. భారత్ దాడికి ధీటైన జవాబును తప్పకుండా ఇస్తామని పాకిస్తాన్ మిలటరీతో పాటు, ఆ దేశ పాలకులు ప్రకటించారు. తదనుగుణంగా, సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో 31 మంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారని, ఆస్తుల విధ్వంసం జరిగిందని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో అంబేద్కర్ విద్యార్థి సమాక్య వ్యవస్థాపక అధ్యక్షుడు అమరుడు కామ్రేడ్ బండి బిక్షపతి పదిహేనవ వర్థంతిని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా బండి బిక్షపతి ఇండో పాక్ సమస్యను ఎలా అర్థం చేసుకున్నాడనేది చూద్దాం.
Fascist politics from the perspective of “Bandi Bikshapati”
వామపక్ష విద్యార్థి నాయకుడిగా బండి బిక్షపతి అనేక ఉద్యమాలకు, పోరాటాలకు నాయకత్వం వహించాడు. తను నాయకుడిగా ఎదుగుతున్న కాలం అంతా రెండు ముఖ్యమైన పరిణామాలు వేగంగా చోటుచేసుకున్నాయి. ఒకటి, నూత్న ఆర్థిక విధానాలను ఆనాటి కాంగ్రెస్ పార్టీ అమలు చేయడానికి హింసాత్మక పద్ధతులను అనుసరించింది. నూత్న ఆర్థిక విధానాల దుష్పలితాలను ఊహించిన వామపక్ష ప్రజాతంత్ర శక్తులు తీవ్రంగా ఆ విధానాలను వ్యతిరేకించడమే కాదు, ప్రజా రాశులను కూడగట్టి ప్రతిఘటిస్తున్న కాలం అది. ఆ ప్రతిఘటనను తట్టుకోలేక పివి నర్సింహరావు ప్రభుత్వం లాల్ కృష్ణా అధ్వానీ, వాజపేయిలకు పూర్తి సహకారం అందించి కరసేవ, శిలన్యాస్ ఉద్యమాన్ని ప్రోత్సహించింది. చివరికి అద్వానీ రథయాత్ర ముగింపు సందర్భంగా డిసెంబరు ఆరు, 1992 నాడు బాబ్రీ మసీదును కూల్చేశారు. ఈ సంఘటన తర్వాత దేశంలో మతపరమైన విభజన స్పష్టంగా కనిపించింది. ప్రజలు మతాల వారిగా తమ అభిప్రాయాలను, వైఖరులను ప్రకటించే ఒక వాతావరణం ఏర్పడ్డది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాజపేయి ప్రధాని అయ్యారు. ఆయన కాంగ్రెస్ ప్రారంభించిన గ్యాట్ ఒప్పందాలను మరింత తీవ్రంగా అమలు చేయడం మొదలుపెట్టాడు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ ప్రయివేటీకరణను సమర్ధిస్తూ స్వాగతించాయి. ఈ బర్బర పరిస్థితుల మధ్య వామపక్ష విద్యార్థీ ఉద్యమం మతోన్మాదానికి వ్యతిరేకంగా విద్యార్థులను చైతన్యం చేసే కార్యక్రమాలను చేపట్టింది. పాఠశాల స్థాయి నుంచి యూనివర్శిటీ స్థాయి వరకు విద్యార్థులను మతోన్మాదానికి వ్యతిరేకంగా చైతన్యం చేస్తూ, లౌకిక ప్రజాతంత్ర విలువల పరిరక్షణ కోసం నిలబడేలా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కామ్రేడ్ బండి బిక్షపతి విద్యార్థులను నిత్యం కలిసి మాట్లాడేవాడు. మతతత్వ శక్తుల కుటిల రాజకీయాలను తన మాటల ద్వారా పాటల ద్వారా విప్పి చెప్పేవాడు. కులం కుల్లురా, మతం మత్తురా అనే నినాదాలిస్తూ, మనుషులంతా ఒక్కటే, హిందూ ముస్లిం భాయీభాయీ అనే చైతన్యం కలిగించాడు. కామ్రేడ్ బండి బిక్షపతి కార్యాచరణకు జడిసిన మతతత్వ శక్తులు దాడులకు పాల్పడ్డాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో, ఎల్బీ కాలేజీలో కామ్రేడ్ బండి బిక్షపతి, అతని సహచరుల మీద దాడులకు తెగబడ్డారు. ఆ దాడులను సాహసోపేతంగా కామ్రేడ్ బండి బిక్షపతి నాయకత్వంలోని విద్యార్థి నాయకులు తిప్పి కొట్టారు. కామ్రేడ్ కొంగర జగన్, కామ్రేడ్ గంథం శివ, కామ్రేడ్ ఓడపల్లి నవీన్, కామ్రేడ్ మురళీ, కామ్రేడ్ సునీల్ తదితరులు మతతత్వ శక్తులతో బాహాబాహీ తలపడి నిలువరించారు. మా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమని నినదించారు. తమకు సీనియర్లయిన కామ్రేడ్ పి. భాస్కర్, వాంకుడోతు వీరన్న, జిలుకర శ్రీనివాస్, మర్రి శ్రీనులాంటి వాళ్ల సూచనలు, సహాయ సహకారాలతో కుల మతాలకు అతీతంగా విద్యార్థులను సమీకరించారు.
Fascist politics from the perspective of “Bandi Bikshapati”
విద్యార్థి ఉద్యమ నగర మహాసభలు జరిగినా, జిల్లా మహాసభలు జరిగినా లౌకికవాదాన్ని, ప్రజాస్వామికవాదాన్ని పరిరక్షించుకోవడమే ఈ దేశ ప్రజల బాధ్యత అని కామ్రేడ్ బండి బిక్షపతి ప్రసంగించేవాడు. పాక్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని అరికట్టడంలో పాలక వర్గాలు మెతక వైఖరిని అనుసరిస్తున్నాయని, తీవ్రవాదాన్ని బూచిగా చూపిస్తూ ఇండియన్ ముస్లింలను దోషులుగా, దేశద్రోహులుగా చిత్రించే విధానాలను తీవ్రంగా విమర్శించే వాడు. ‘‘కాశ్మీరు కుంకుమా కరిగిపోతున్నాది, కడతేరనున్నాను కాపాడమంటుంది’’ అనే పాదాలున్న భారతభారతీ అనే పాటను అద్భుతంగా ఆలాపించేవాడు. వాజపేయి పాలనా కాలమంతా ప్రగతిశీల శక్తులకు, వామపక్ష ప్రజాతంత్ర శక్తులకు పరీక్ష కాలమే. దాడులు, కేసులతో సతమతమవుతున్న కాలమది. అదే కాలంలో క్రైస్తవ మతబోధకుడైన పాస్టర్ గ్రహం స్టేయిన్ను, అతని ఇద్దరు కొడుకులను సజీవ దహనం చేసిన సంఘటన దేశాన్నే కాదు, ప్రపంచాన్నంతా కుదిపేసింది. ఆ సంఘటనను ఖండిస్తూ వేలాది మంది విద్యార్థులతో, లౌకిక ప్రజాస్వామికవాదులతో వేయి స్తంభాల గుడి నుంచి హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించడంలో కామ్రేడ్ బండి బిక్షపతి కీలక పాత్ర పోషించాడు. గ్రహం స్టేయిన్ హంతకుడు ఈమధ్య విడుదలయ్యాడు. ఆ హంతకుడికి పూలమాలలేసి మతతత్వ ఫాసిస్టు శక్తులు స్వాగతం పలికిన దృశ్యం చూసినప్పుడు కామ్రేడ్ బండి బిక్షపతి జీవించి వున్న కాలం నాటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో ఎంత మార్ప వచ్చిందో అర్థమైంది.
Fascist politics from the perspective of “Bandi Bikshapati”
బిజెపి, ఆర్ఎస్ఎస్ రాజకీయాలను వర్గ దృక్పథం నుంచి అర్థం చేసుకున్న కామ్రేడ్ బండి బిక్షపతి ఆ రాజకీయాలను ఎదుర్కోవడానికి కార్యక్షేత్రంలో పనిచేస్తూనే వున్నాడు. అయితే, ఆర్థిక పోరాటాలు రోజురోజుకూ బలహీనపడుతున్న వాస్తవాన్ని తను గుర్తించాడు. నూత్న ఆర్థికవిధానాలు శ్రామికులను, పేదలను అసంఘటితం చేస్తూ, చిన్నాభిన్నం చేస్తున్న వాస్తవికతను ఎలా అర్థం చేసుకోవాలని జరిగే చర్చలను ఆసక్తిగా గమనించేవాడు. మత రాజకీయాల సారాంశం ఏమిటనే అన్వేషణ తనకు మరో మార్గాన్ని చూపించింది. ఆర్ఎస్ఎస్, బిజెపిల ఆశయం సనాతన ధర్మం పేరుతో వర్ణ వ్యవస్థను పునరుద్ధరించడం. చాతుర్వర్ణ వ్యవస్థను ఈ రెండు సంస్థలు అంగీకరిస్తాయి. వర్ణ వ్యవస్థను భారతీయ ఆత్మగా అవి అంగీకరిస్తాయి. కుల వ్యవస్థను ఈ సంస్థలు తిరస్కరించినట్టు కనిపిస్తుంది. కానీ కుల వ్యవస్థను పటిష్ట పరిచే విధానాలనే ఈ సంస్థలు రూపొందించి అమలు చేస్తాయి. కులం అనే వ్యవస్థ వర్ణ వ్యవస్థ నుంచే ఏర్పడ్డదని, తిరిగి వర్ణ వ్యవస్థకు పయనించడం వీలుకాదని విప్లవ తాత్వికుడు బాబాసాహేబ్ అంబేద్కర్ చెప్పిన బోధనను తను ఆకలింపు చేసుకున్నాడు. కులం పునాదుల మీద ఒక నీతినిగానీ ఒక జాతినిగానీ నిర్మించలేమని ఆ విప్లకారుడు చెప్పిన మాటను తను విద్యార్థులకు పదేపదే గుర్తు చేసేవాడు. జాతీయవాదం అనే ముసుగులో వర్ణ వ్యవస్థను, కుల వ్యవస్థను బలపర్చే విధానం వుందని తను నిర్మొహమాటంగా చెప్పేవాడు. కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన సైన్యానికి నివాళులు అర్పిస్తూ, వాజపేయి ప్రభుత్వ వైఫల్యం కారణంగానే సరిహద్దు భద్రత ప్రమాదంలో పడ్డదని తను అనేక సభల్లో చెప్పేవాడు. తొమ్మిదేండ్ల వాజపేయి పాలనలో ఈ దేశంలోని పీడిత వర్గాలు దుర్బరమైన కష్టాలను అనుభవించారు. ఆ కష్టాల నుంచి బయటపడటానికి బిజెపి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించారు.
Fascist politics from the perspective of “Bandi Bikshapati”
1995లో మొదలైన తెలంగాణ ఉద్యమం ఒక మైలురాయి. అది మారోజు వీరన్నను చంద్రబాబు ప్రభుత్వం హత్య చేసింది. చంద్రబాబు ఎన్డీయే భాగస్వామిగా వుంటూ, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశాడు. చంద్రబాబు ముస్లింల ఓట్ల కోసం లౌకికవాదిగా కనిపిస్తూ, బిజెపికి అధికారాన్ని కట్టబెడుతూ, మతోన్మాదులకు పరోక్షంగా సహకరించేవాడు. ఈ విషయంలో టిడిపి పట్ల వామపక్షాలు మెతక వైఖరిని అనుసరించేవి. ఈ మెతక వైఖరిని కామ్రేడ్ బండి బిక్షపతి తీవ్రంగా వ్యతిరేకించేవాడు. టిడిపి మాటున బిజెపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బలపడాలని చూస్తుందని విమర్శించేవాడు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మతతత్వ శక్తులను బలహీనం చేస్తుందని తను భావించాడు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి, రాష్ట్ర సాధనా ఉద్యమాన్ని చేపట్టినప్పుడు ప్రజాతంత్ర శక్తులు అనుమానించాయి. అయితే, చంద్రబాబు దిగిపోయి, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత కెసిఆర్ నాయకత్వంలోని రాజకీయ ఉద్యమం, ప్రొ.కోదండరామ్, మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రొ.ఘంటా చక్రపాణి వంటి విద్యావంతుల నాయకత్వంలోని తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమానికి కామ్రేడ్ బండి బిక్షపతి సానుకూలంగా స్పందించి, అంబేద్కర్ విద్యార్థి సమాక్య ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను చేపట్టాడు. అయితే, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్ధతుగా బిజెపి కాకినాడ తీర్మానం ఆమోదించడంతో మతోన్మాద శక్తులు రాష్ట్రసాధనోద్యమంలో చురుకుగా పాల్గొనడం మొదలైంది.
Fascist politics from the perspective of “Bandi Bikshapati”
అప్పటిదాకా, ప్రగతిశీల, ప్రజాస్వామిక శక్తుల నాయకత్వంలో నడుస్తున్న తెలంగాణ ఉద్యమంలో బిజెపి ప్రవేశించింది. బిజెపి మద్ధతు లేకుండా తెలంగాణను సాధించలేమని భావించే వాళ్లు ఆర్ఎస్ఎస్, బిజెపి పట్ల ఉదారంగా వ్యవహరించడం చూసి తను చాలా గాయపడ్డాడు. ఒకవైపు రాష్ట్ర సాధనోద్యమంలో బిజెపి ప్రత్యేక పంథాలో పనిచేస్తూనే, అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి పరోక్షంగా సహకరిస్తూ నల్లగొండ, కరీంనగర్, సంగారెడ్డి, హైదరాబాదు లాంటి పట్టణాలలో మతకల్లోలాకు పథక రచన చేసింది. ముస్లిం మైనార్టీలు నివసించే ప్రాంతాలలో అల్లర్లు సృష్టించడం, ఆస్తుల విధ్వంసానికి పాల్పడటం వంటివి చూసి తను చలించి పోయేవాడు. బిజెపి తెలంగాణ ఉద్యమంలో చేరిన తర్వాత రైతాంగ సాయుధ పోరాట చరిత్రను కనుమరుగు చేస్తూ, విమోచన దినం అనే భావనను చర్చకు పెట్టినప్పుడు, తను అంబేద్కర్ విద్యార్థి సమాక్య ఆధ్వర్యంలో విమోచనం కాదు, దురాక్రమణ దినం అని ప్రకటించి, కరపత్రాలు ప్రచురించాడు. తెలంగాణ ఉద్యమంలో మతోన్మాదానికి చోటు వుండరాదని తను వాదించాడు. అంబేద్కర్ దృక్పథం నుంచి మతోన్మాదాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకుని, ప్రగతికాముక నాయకుడిగా, కార్యకర్తగా చురుకుగా పాల్గొనే కామ్రేడ్ బండి బిక్షపతి అస్వస్థతకు గురయ్యాడు. ఆ క్రమంలో మలిదశ ఉద్యమం మొదలైన యేడాదికే మే 10, 2010 నాడు అమరుడయ్యాడు. తను అమరుడైన నాలుగేండ్లకు తెలంగాణ రాష్ట్రం సాకారమైంది.
Fascist politics from the perspective of “Bandi Bikshapati”
తెలంగాణ ఆవిర్భావం, నయా ఫాసిస్టు నరేంద్ర మోదీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడటం రెండూ ఒకేసారి జరగడం యాధృచ్ఛికం. పాక్ ప్రేరేపిత తీవ్రవాద నిర్మూలన, అవినీతి నిర్మూలన, నిరుద్యోగ నిర్మూలన అనే అంశాలతో ఎన్నికలలో నరేంద్ర మోదీ గెలిచాడు. కానీ తను హామీ ఇచ్చిన దేన్నీ పరిష్కరించలేదు. పైగా తను దాడులు జరిగే అవకాశం వుందనే సమాచారం తెలిసినా కూడా ఎలాంటి భద్రతా చర్యలకు ఆదేశించలేదు. పదకొండు యేండ్ల పాలనలో నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేశాడు. కానీ ప్రజల ఎజెండాను అమలు చేయలేక పోయాడు. దేశాన్ని హిందూ రాష్ట్రగా ప్రకటించాలన్న సంకల్పంతో వున్న మోదీకీ మూడోసారి ఎన్నికలలో ప్రజలు మెజార్టీ తగ్గించి వాతలు పెట్టారు. కానీ, ఆర్ఎస్ఎస్ తన ఆశయాన్ని నిజం చేసుకోవడానికి నరేంద్ర మోదీ మీద ఒత్తిడి పెడుతూనే వున్నది. అందుకే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దుర్మార్గమైన దాడిని అరికట్టలేని మోదీ, పాకిస్తాన్ మీద యుద్ధానికి సిద్ధపడ్డాడు. తను యుద్ధాన్ని మత యుద్ధంగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నాడు. దేశ వ్యాప్తంగా బిజెపి, ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు అదే ప్రచారం చేస్తున్నారు. పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలనే విషయంలో, ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. అయితే, ఇదే అదనుగా దేశాన్ని మత దేశంగా మార్చాలని, అందుకు అవసరమైన భావోద్వేగాలను పెంపొందించి, తన లక్ష్యం నెరవేర్చుకోవాలని బిజెపి వేస్తున్న ఎత్తుగడలను ఈ దేశ ప్రజలు తిరస్కరిస్తారు. కామ్రేడ్ బండి బిక్షపతి వర్ధంతి సందర్భంగా ఈ దేశాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రతీఒక్కరూ సంసిద్ధం కాక తప్పదు.