
- నకిలీ విత్తనాలతో బేజారవుతున్న రైతులు
- యధేచ్ఛగా నకిలీ విత్తనాల దందా సాగుతుందనే ఆరోపణలు…
- అనేక మంది రైతులు పంట నష్టపోవడమే సాక్ష్యంగా భావిస్తున్న పలువురు
- పరకాల “లక్ష్మి సీడ్స్”లో నకిలీ విత్తనాలు అమ్మినారంటూ బాధిత రైతు “ఏవో” కు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యంగా మారిన వైనం…
- గ్రామాల్లోకి చేరుతున్న నకిలీ విత్తనాలు
- టాస్క్‌ఫోర్స్ కమిటీలు పత్తాలేకుండా పోయాయనే ఆరోపణలు…
- పరకాల పెస్టిసైడ్, ఫర్టిలైజర్ షాపుల నిర్వాహణపై అధికారులు దృష్టి సారించాలంటున్న రైతు సంఘాల ప్రతినిధులు…
- ఓ బాధిత రైతు “లక్ష్మి సీడ్స్”పై ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోవడం పట్ల విమర్శలు…
Hanumakonda district హనుమకొండ జిల్లా పరకాల ప్రాంతంలో నాసిరకం, నకిలీ విత్తనాల బెడద రైతులకు పెను సవాల్‌గా మారింది. అసలు ఏదో, నకిలీ ఏదో గుర్తించలేని విధంగా విత్తనాలు మార్కెట్లో లభిస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. అనేక మంది రైతులు పంట నష్టపోవడమే నకిలీ విత్తనాల దందా సాగుతుందనడానికి సాక్ష్యంగా పలువురు భావిస్తున్నారు. తాజాగా పరకాల Laxmi seeds “లక్ష్మి సీడ్స్”లో నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మినారంటూ బాధిత రైతు “ఏవో” కు ఫిర్యాదు చేసిన ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఇదే తరహా పత్తి, మిర్చి రైతులు కూడా పరకాల ప్రాంతంలో నకిలీ విత్తనాల బాధితులు ఉన్నారనేది గమనార్హం. ఈ నకిలీ విత్తనాలు గ్రామాల్లోకి చేరి రైతులను నట్టేట ముంచుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంత యధేచ్ఛగా సాగుతున్న నకిలీ విత్తనాల బాగోతం పట్ల అధికారులు అంతగా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
మరోవైపు టాస్క్‌ఫోర్స్ కమిటీలు సైతం పత్తాలేకుండా పోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ బాధిత రైతు నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మినారంటూ Laxmi seeds “లక్ష్మి సీడ్స్”పై ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోవడం పట్ల అధికారులే “నకిలీ”కి వత్తాసు పలుకుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పరకాలలోని పెస్టిసైడ్, ఫర్టిలైజర్ షాపుల నిర్వాహణపై అధికారులు దృష్టి సారించాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.