
అద్దురాళ్ళున్న తాతల దొయ్యల సాగు
పొత్తులపంట సరికి సరిలేని కయ్యాల పోగు
తూము దాపున ముప్పైఏండ్ల కొట్లాట
తూటువడ్డకాడ అంటుకు సొంటుకు అంటని సోపతాట
నిప్పేత్తె పచ్చిగడ్డి బగ్గున మండె వనం
గెట్ల పంచాయితి కొలిక్కిరాని కొయిదల మునుం
మాగి మాగి పెద్దకోర్టు ఉన్నపాల్ను నాలుగిసల్జేస్తె నట్టమేంది
పొత్తిచ్చుకపోయి కొత్తసాలువడ్తె తప్పేంది
పిల్కశ్లోకాలు పేనిన పగ్గాలు
మెదడ్లకు ముగుదాడేస్కొని
నీలి నామాలు పెయినిండా పూస్కొని
పెండ్లి నడ్కలు యాత్రలని ప్రచారం చేస్కదిర్గుడా ! మీ తాకతి
మెద్గని మల్ల దున్నెద్దుని
పుట్ల బర్వు కచ్చురాన్కి కడితే కానెత్తేసింది
డప్పుదరువుల సప్పుడుమోతకు
గూటం గుద్దుడు దెబ్బల వేటుకు
పనికంగక పుర్రు పెట్టి దడుసుకొని
దొంగ ఇకమాత్జేసి
నాల్గు బాటల నడిబజార్ల
కోతకు పంటంది
గడ్డివాము మీద పుక్క్యానికి మేసి
గోలెంల నీళ్లు తాగి గోర్జంపెరిగింది
యాసంగి బతుకుల లేకిడి తనాన్కి
గోసంగి బర్వుల బాధలేమెర్కా
పోగు పంచే పెద్దిర్కానికి
నీసుకు నాసపెట్టి
ఎచ్చులకు మార్వనంబోయే మాలిర్కానికి పోలికేడిది
కుంచెడు బియ్యమున్నా
కంచంల మెతుకు లేదని వలపోతేషం
దాపునున్నోన్ని దోస్కతిన మర్గినమోసం
ముల్లుగట్టె పోటుకు మర్రేస్కసూతంది
పనికంగది పాయిదలేదు కోతకునూక్తే
ఈ ఏడు పోచమ్మ పండుగెల్తతది
నీరేడిర్కమని నీల్గుకుంట పారేనీళ్ళక్కాలడ్డంబెక్కుంట
పిప్పిపట్న పుక్కిటి చరితని పొక్కిలిచ్చుకుంట
ఊరూరు దిరుక్కుంట
మనువాది పంచన జేరిన కుంటనౌ
మా ఇస ముందు నీ బిషాదెంత
యేండ్లకేండ్లు పక్కబొక్కల్దేలంగ
రాజరికంతో కొట్లాడి జీవునాల్బాయే
వైసుతనం కర్గి బత్కెండుగట్టాయే
రాట్టాలు రౌతంతో అల్కుజల్లిన ఆకిల్లయె
ఇస్తారి మీదవడి తినమర్గితే
ఇలంత ఊర్సిపెట్నా సాలదన్నట్టు
కుటిలవాది కుట్రవాజీ కుయక్తుల కూతలుగర్జనలా!
కుండ పల్గిన కుక్కగుణం దెల్సింది
పంపకాలు తెగదెంపులనుకునే ఉచ్చిలి తనాన్కి సుప్రీంచెర్నకోలు
డాక్టర్ మహేందర్ కట్కూరి