Does patriotism mean flying the flag : “దేశం పట్ల ఉండాల్సింది భక్తి కాదు, బాధ్యత. సామాజిక బాధ్యత! ఎందుకంటే, దేశమంటే ప్రజలు కాబట్టి. సకల శ్రామికుల శ్రమలతోటే, ఈ దేశ మనుగడ కొనసాగుతోంది కాబట్టి! వాడుక భాషలో పద ప్రయోగ ప్రస్థానం ఏదైనా, ప్రజల భాషలో దేశభక్తి అంటే, ‘సమాజం పట్ల, సామాజిక బాధ్యత కలిగి ఉండడమే’ అని అర్థం!” ఇంతకూ ఏ కార్యాచరణ, ఏ కార్యకలాపాలు దేశభక్తిని సూచిస్తాయి?
దేశభక్తి కలిగి ఉండడం అంటే..
స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15 న, గణతంత్ర దినోత్సవం జనవరి 26న, జాతీయ జెండా ఎగురవేసి, ‘జై బోలో స్వతంత్ర భారత్ కి జై’ అని నినాదాలు ఇచ్చి, జెండాలు పట్టుకొని జై కొట్టడం.. ఇంటి మీద ఒక జెండా, ఇంటెనక ఒక జెండా, కారుకు జెండా, బైకుకు జెండా పెట్టుకుని ఊరేగడం కాదు. ఈ రోజును కేవలం ‘సెలవు దినంగా’ భావించి, ఎంజాయ్ చేయడం అంతకన్నా కాదు!
దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో, మతాలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా.. ప్రజలు వీరోచితంగా పోరాడి నేలకొరిగిన, వారి త్యాగాల జ్ఞాపకాలకు గుర్తుగా.. ఈ రోజున వారిని స్మరించుకోవాలి! ఈ ప్రత్యేక దినాన్ని ‘ప్రజల్లో ఒక సామాజిక బాధ్యతను పెంపొందించడానికి తోడ్పడే, ఒక దీక్షా దినంగా, మనమంతా జరుపుకోవాలి!’ అదే నిజమైన దేశభక్తి అవుతుంది!
దేశభక్తి కలిగి ఉండడం అంటే..
కనిపెంచిన తల్లిదండ్రుల పట్ల, ఆలు పిల్లల పట్ల, అన్నదమ్ముల పట్ల, రక్త సంబంధాల పట్ల, స్నేహ సంబంధాల పట్ల, సొంత ఊరు పట్ల, రాష్ట్రం పట్ల, దేశం పట్ల, మూగజీవాల పట్ల, ప్రకృతి పట్ల, మొత్తం ప్రపంచ శ్రామిక ప్రజల పట్ల.. ఆత్మీయ ప్రేమానుబంధం, సామాజిక బాధ్యత కలిగి ఉండాలి! అదే నిజమైన దేశభక్తి అవుతుంది!
దేశభక్తి కలిగి ఉండడం అంటే..
ప్రతిరోజు ప్రజల దైనందిన అవసరాలను తీర్చే వస్తువులను, పదార్థాలను, సౌకర్యాలను.. కనపడని ముక్కోటి దేవతలు గాని, అల్లా, ఏసులు గానీ, ప్రపంచంలోని మరే ఇతర దేవుళ్ళు గానీ తీర్చడం లేదు! ప్రపంచవ్యాప్తంగా కష్టజీవులైన కార్మికులు, ఉద్యోగులు, రైతులు, పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, పోలీసులు ముఖ్యంగా మహిళలు.. మొత్తంగా సంఘటిత – అసంఘటిత రంగాలకు చెందిన శ్రామిక ప్రజలంతా శ్రమలు చేయడం వల్లే, ఈ మానవ సమాజ మనుగడ కొనసాగుతోంది! అందుకే, ‘శ్రమ సంస్కృతిని గౌరవించే, సామాజిక చైతన్య జ్ఞానాన్ని మనమంతా కలిగి ఉండడమే, నిజమైన దేశభక్తి అవుతుంది!’
దేశభక్తి కలిగి ఉండడం అంటే..
దేవుళ్ళ పేరుతో, మతాల పేరుతో, సంస్కృతీ సంప్రదాయాల పేరుతో.. ప్రజల్లో మూఢ విశ్వాసాలను, అశాస్త్రీయ భావాలను, కుల మత వైషమ్యాలను పెంపొందించే వారిని ప్రశ్నించాలి! ‘ప్రశ్నే, ప్రగతికి సోపానం!’ ముఖ్యంగా ‘ఈ దేశ పౌరులు శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతా వాదాన్ని కలిగి ఉండాలి’ అని చెప్పే.. రాజ్యాంగంలోని ‘ఆర్టికల్ 51A(h)’ ను గౌరవించాలి! అదే నిజమైన దేశభక్తి అవుతుంది!
దేశభక్తి కలిగి ఉండడం అంటే..
ప్రభుత్వోద్యోగులు తమ విధులను అత్యంత బాధ్యతయుతంగా, జవాబుదారితనంతో నిర్వర్తించాలి! లంచాలకు పైరవీలకు తలొగ్గకుండా, వృత్తి పట్ల అంకిత భావంతో ఉండాలి! బ్యూరోక్రసీ మాయాజాలంలో మునిగిపోయి, తమకు తామే ఉన్నత ఉద్యోగస్తులమని భావించుకునే ప్రభుత్వోద్యోగులు.. అసంఘటిత రంగాల్లోని కార్మికుల పట్ల, ప్రజల పట్ల తక్కువ భావనతో ఉండకూడదు! శ్రమను గౌరవించే ఈ విధమైన శ్రామిక సంస్కృతిని కలిగి ఉండడమే, నిజమైన దేశభక్తి అవుతుంది!
దేశభక్తి కలిగి ఉండడం అంటే..
ఈ దేశ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిన ‘నక్సలైట్ సమస్య’ గురించి, ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే..?
ప్రజల మధ్య పేద – ధనిక వంటి సామాజిక అసమానతలు ఏర్పడడానికి ప్రధాన అంశం భూమి సమస్య! మరి ఈ భూముల అంశానికి సంబంధించి, ప్రభుత్వపరంగా ఈ విధులు నిర్వహించే రెవిన్యూ విభాగం, రెవెన్యూ అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా ఉండాలి. ముఖ్యంగా పాలకులు, పాలనా సిబ్బంది.. రాజ్యాంగ విలువలకు, పాలనా వ్యవస్థకు కట్టుబడి తమ విధులను నిర్వర్తించాలి. ప్రభుత్వం వైపు నుండి ఎంతో కీలకమైన విధులను నిర్వహించే రెవిన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్లలోని కొంతమంది ఉన్నత ప్రభుత్వాధికారులు.. అనాదిగా దోపిడీ వర్గాలకు కొమ్ము కాస్తూ, వాళ్ళు ఇచ్చే లంచాలకు – నజరానాలకు లొంగిపోయి, దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నారు. వాళ్ల జీవనోపాదులను దెబ్బతీస్తున్నారు. వాళ్ళ జీవించే హక్కును కాలరాస్తున్నారు. ఈ విధంగా నాటి నుండి నేటి వరకు కూడా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా “కొంతమంది దోపిడి స్వభావ పాలకులు, రెవెన్యూ – పోలీస్ డిపార్ట్మెంట్లలోని కొందరు ఉన్నతాధికారులు” అవలంబిస్తున్న ఈ బాధ్యతారాహిత్య, ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగానే.. మన ప్రభుత్వ వ్యవస్థలు తీవ్ర వైఫల్యానికి గురవుతున్నాయి. తద్వారా ఈ పరిణామాల నుండే ప్రజల తిరుగుబాట్లు పుట్టాయి, కొన్ని చోట్ల సాయుధ విప్లవోద్యమాలు పుట్టుకొచ్చాయి!
కాబట్టి, ‘ఈ దేశ ప్రజల భాగస్వామ్యంతో ముడిపడి ఉన్న నక్సలైట్ సమస్యను, ప్రజాస్వామిక విధానాల ద్వారానే ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంటుంది!’ కాబట్టి ‘పాలకవర్గాలు ఈ సమస్యను, శాంతిభద్రతల సమస్యగా కాకుండా.. ఇది ఒక సామాజిక, అర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యగా గుర్తించి, అర్థం చేసుకోవడం ద్వారానే, ఈ సమస్య న్యాయంగా పరిష్కరించ బడుతుంది!’ ఇక రెండు వైపులా మరణించిన వారంతా కూడా, మన దేశ పౌరులే కాబట్టి.. ఈ సమస్యను ఏ రకంగా చూసినా కూడా, ఇది ‘శాంతి భద్రతల సమస్య’ కాదు! అందుకే ఈ నక్సలైట్ సమస్యను, ఈ విధంగా సామాజిక చైతన్యంతో, మానవీయ స్పృహతో అర్థం చేసుకోవడమే, నిజమైన దేశభక్తి అవుతుంది!
దేశభక్తి కలిగి ఉండడం అంటే..
మనుస్మృతి ఆధారంగా, మన దేశంలో నెలకొన్న అమానవీయమైన అంటరానితనాన్ని, సామాజిక అసమానతలను, కుల వివక్షను నిరసించాలి! సొంత మతాల పట్ల, సొంత కులాల పట్ల ఉన్న అభిమానం.. ఇతర మతాల పట్ల, ఇతర కులాల పట్ల కూడా కలిగి ఉండాలి! ముఖ్యంగా మహిళలను, వృద్ధులను గౌరవించాలి. చిన్న పిల్లలను ప్రేమించాలి. వరకట్నాల పేరుతో, పురుషాధిపత్య భావనతో మహిళలను హింసించడం, సామాజిక నేరం అని భావించాలి! అదే నిజమైన దేశభక్తి అవుతుంది!
దేశభక్తి కలిగి ఉండడం అంటే..
రోడ్డుమీద వాహనం నడిపేటప్పుడు, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి! మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, రెడ్ సిగ్నల్స్ ఉన్నప్పుడు జంప్ చేయడం, ఓవర్ స్పీడ్ తో ప్రమాదాల బారిన పడి, ప్రజలకు నష్టం కలుగజేయడం వంటి చర్యలు.. సామాజిక నేరం అని గుర్తించాలి! ఈ భావనే, నిజమైన దేశభక్తి అవుతుంది!
దేశభక్తి కలిగి ఉండడం అంటే..
పెట్టుబడిదారీ డబ్బు సంస్కృతి మాయాజాలంలో మునిగిపోయి.. రక్త సంబంధాలను, మానవ సంబంధాలను విస్మరించకూడదు. ఆస్తి అంతస్తులు ఉన్నవారే, అధికులు అనే భావన విడనాడాలి. శ్రమను – శ్రామిక ప్రజలను గౌరవించే, సామాజిక బాధ్యత కలిగిన బుద్దిజీవులే, సమాజంలో నిజమైన ఉన్నత మానవులు అని గుర్తించాలి. అదే నిజమైన దేశభక్తి అవుతుంది!
దేశభక్తి కలిగి ఉండడం అంటే..
కనిపెంచిన తల్లిదండ్రులు.. వాళ్ళు కుంటివాళ్ళు అయినా, గుడ్డివాళ్ళు అయినా, ధనికులైనా, పేదలైనా ఎలాంటి వాళ్ళైనా.. వాళ్ళు కంటికి రెప్పలా కనిపెట్టుకుని పెంచి పెద్దచేస్తేనే.. ఇప్పుడు మనిషిగా జీవించగలుగుతున్నాం’ అనే జీవితసత్యాన్ని మనమంతా గ్రహించాలి! కన్నవాళ్ళ పట్ల, కఠినత్వం చూపకూడదు. బాధ్యతాయుతమైన ప్రేమను కలిగి ఉండాలి! అదే నిజమైన దేశభక్తి అవుతుంది!
దేశభక్తి కలిగి ఉండడం అంటే..
ఈ దేశ చరిత్రను, స్వాతంత్రోద్యమ చరిత్రను, సామాజిక ఉద్యమాల చరిత్రను, ప్రపంచ చరిత్రను, సమాజానికి ఎనలేని సేవలు అందించిన, సామాజిక ఉద్యమకారుల చరిత్రను అధ్యయనం చేయాలి, స్ఫూర్తిని పొందాలి! భారత రాజ్యాంగాన్ని చదవాలి, గౌరవించాలి, రాజ్యాంగ స్పృహను కలిగి ఉండాలి! ముఖ్యంగా స్వాతంత్ర్యోద్యమంలో, సమాజ మార్పు కోసం జరుగుతున్న ఉద్యమాల్లో.. అమరులైన బిడ్డల త్యాగాల పట్ల, హృదయపూర్వకమైన గౌరవ భావన ఉండాలి! అదే నిజమైన దేశభక్తి అవుతుంది!
దేశభక్తి కలిగి ఉండడం అంటే..
మన పరిపాలనా వ్యవస్థ, ప్రజల అభిమానంతో వారి భాగస్వామ్యంతో ఏర్పడాల్సింది పోయి.. వ్యాపారస్తులు, సామాజిక స్పృహ లేని వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయాన్ని పూర్తిగా వ్యాపారమయం చేసారు! ఎన్నికల వ్యవస్థను, వారికి అధికార పదవులను కట్టబెట్టే సాధనంగా మలుచుకున్నారు. ఓట్ల కోసం కోట్ల రూపాయలు కుమ్మరించి, అధికార పదవులను హస్తగతం చేసుకుంటున్నారు! గద్దెనెక్కిన వెంటనే, వారు ప్రజా ప్రతినిధులుగా ప్రమాణం చేసిన ‘సామాజిక లక్ష్యాన్ని’ విస్మరించి, అందిన కాడికి దోచుకోవడమే, వారి ఏకైక లక్ష్యంగా చేసుకుంటున్నారు. ‘అందుకే ఎన్నికల్లో పాల్గొనే నాయకులు, ఓట్లు వేయించుకోవడం కోసం నోట్లు పంచినా.. ఓట్లు వేయడం కోసం ప్రజలు నోట్లు తీసుకున్నా.. అది సామాజిక నేరంగానే గుర్తించాలి!’ అదే నిజమైన దేశభక్తి అవుతుంది!
దేశభక్తి కలిగి ఉండడం అంటే..
అమరుల త్యాగాలతో, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు.. తెలంగాణ సోయి లేని, మన పాలకుల దళారి పాలనను చూస్తూ కూడా, మౌనంగా ఉండడం చరిత్ర క్షమించదు! ప్రజలంతా కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. అడుగడుగునా తెలంగాణ అస్తిత్వానికి, ప్రజల ఆత్మగౌరవానికి తూట్లు పొడుస్తున్న, ఈ పాలకుల తీరు వల్ల.. తెలంగాణాకు మళ్ళీ, కష్టకాలం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి!
ఒకవైపు అభివృద్ధి పేరుతో ఈ ప్రాంతం భూములు, మళ్లీ అన్యాక్రాంతం చేస్తున్నారు. మరోవైపు హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడానికి, తెర వెనుక కుతంత్రాలు పన్నుతున్నారని, సంకేతాలు వెలువడుతున్నాయి! అందుకే ఉద్యమ చైతన్యం కలిగిన తెలంగాణ సమాజం, నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ తరాల కోసమైనా, మన భూములను మనమే కాపాడుకోవాలి! ముఖ్యంగా నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం, అమరుల స్ఫూర్తితో.. ‘తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగాలతో పాటు, ప్రైవేట్ రంగాల్లో కూడా ‘స్థానికులకు తొంబై శాతం, ప్రాంతీయ రిజర్వేషన్లను’ అమలు చేయాలి!’
అయితే, నిజానికి మనం సాధించుకున్నది ‘భౌగోళిక తెలంగాణ రాష్ట్రం’ మాత్రమే అని మనమంతా అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు సాధించుకోవాల్సింది, ‘ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్రాన్ని!’ కాబట్టి, ‘తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవన వికాసం కోసం, ప్రజల ఆత్మ గౌరవం కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం’ ప్రజలంతా ఐక్యమై ‘ప్రజాస్వామిక తెలంగాణ’ రాష్ట్రాన్ని సాధించుకోవాల్సిన అవసరం మన ముందుంది! ఈ విధమైన ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ ప్రజలు కలిగి ఉండడమే, నిజమైన దేశభక్తి అవుతుంది!
- ముద్దగౌని సుభాష్ సామాజిక ఉద్యమ కార్యకర్త స్వతంత్ర జర్నలిస్టు ఫోన్: 9000904284 తేది: 26.01.2026
