ప్రజావాణిలో కలెక్టర్కు పత్తిపాక ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల వినతి
Crusher permits should be revoked : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని, పంటలను, పర్యవరణాన్ని దెబ్బతీస్తున్న శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ అనుమతులను వెంటనే రద్దు చేయాలని, అలాగే కొత్తగా క్రషర్ ఏర్పాటుకు జరుగుతున్న సన్నాహాలను నిలిపివేయాలని కోరుతూ పత్తిపాక ఉప సర్పంచ్ తుడుం రాజు, వార్డు మెంబర్ల నేతృత్వంలో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
Crusher permits should be revoked
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 13 ఏళ్లుగా కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ వల్ల గ్రామంలో తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా ఒక గుట్టనే కనుమరుగుచేశారని పేర్కొన్నారు. అక్కడ ఉన్న డాంబర్ ప్లాంట్ నుండి వచ్చే ఘాటైన వాసన, ధూళి కారణంగా గ్రామస్థులు వ్యాధుల బారిన పడుతున్నారు. క్రషర్ బ్లాస్టింగ్ శబ్దాల వల్ల గ్రామంలోని ఇళ్లకు పిల్లర్ల నుండి స్లాబ్ వరకు పగుళ్లు ఏర్పడి, ఎప్పుడు కూలిపోతాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారని తెలిపారు. వాయు కాలుష్యం వల్ల పంటలు దెబ్బతినడమే కాకుండా, శబ్దాల ధాటికి గుట్టల్లో ఉండే కోతులు, అడవి పందులు ఊరిపై పడి పంటలను నాశనం చేస్తున్నాయని తెలిపారు.
Crusher permits should be revoked
ఇప్పటికే ఈ సమస్యపై ఎమ్మార్వో, ఆర్డీవోలకు ఫిర్యాదు చేశామని, నేడు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చామని పేర్కొన్నారు. పత్తిపాక గ్రామ పంచాయతీ పాలకవర్గం తరపున గ్రామ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కొత్త క్రషర్ ఏర్పాటును విరమించుకోవాలని, పాత దానిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు నాలికె వీర ప్రతాప్, పోతుగంటి ప్రమీల సారయ్య, గజ్జి రాజు, అంకేశ్వరపు సాయి లక్ష్మి, కొడిమాల మహేందర్, గజ్జి రమేష్, గడ్డమీది హారతి కర్ణాకర్, చిట్టి రెడ్డి పద్మ జంగారెడ్డి, ఐరబోయిన స్వప్న రాజు, కందగట్ల ప్రవీణ్ కుమార్, తుడుం స్రవంతి రాజు మరియు నాయకులు పెండేల కిరణ్, పోతుగంటి సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.
