
దళితుడికి “ఎర్ర”ని పట్టాభిషేకం
నూతన సారథిగా జాన్ వెస్లీ ఎన్నిక
Telangana state new secretary elected తెలంగాణ రాష్ట్ర సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాన్ వెస్లీ ఎన్నికయ్యారు. సంగారెడ్డిలో సీపీఎం నాలుగో రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ మహాసభల్లో నూతన ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అమరచింతకు చెందిన జాన్ వెస్లీ డీవైఎఫ్ఐ, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. సీపీఎం పార్టీ చరిత్రలోనే మొదటిసారిగా పార్టీ రాష్ట్ర కమిటీలో అత్యున్నత పదవిని దక్కించుకున్న మొదటి వ్యక్తిగా జాన్ వెస్లీ నిలుస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి తమ్మినేని వీరభద్రం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈసారి బడుగు బలహీనవర్గాలకు అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో దళిత సామాజిక వర్గానికి చెందిన జాన్ వెస్లీకి అవకాశం ఇచ్చారు. ఈనెల 25న బహిరంగ ప్రదర్శనతో మహాసభలు ప్రారంభం అయ్యాయి. ఈ సభల్లో రాష్ట్ర ప్రముఖులతో పాటు జాతీయ నేతలు కూడా పాల్గొన్నారు.
సీపీఎం నూతన రాష్ట్ర కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎన్నికవుతారని అంతా భావించారు. జూలకంటి రంగారెడ్డి ఆ పార్టీ రాష్ట్ర నాయకుడిగా, ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా, పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా, సీఐటీయూ కార్మిక సంఘం నేతగా పనిచేశారు. దీంతో ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకునే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. ఆయనతో పాటు సీఐటీయూ నేత ఎస్. వీరయ్యకు కూడా పదవి దక్కే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా అందరి అంచనాలు తారుమారు చేస్తూ జాన్వెస్లీకి బాధ్యతలు ఇచ్చారు. దళిత సామాజిక వర్గానికి చెందిన జాన్ వెస్లీ నాయకత్వంలో సీపీఎం కొంత మెరుగుపడాలని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.