- గత ‘క్రషర్’తో ఇప్పటికే ఒక గుట్ట కనుమరుగు..!
- ఇప్పుడు మరో గుట్టను మింగేందుకు మరికొందరి కన్ను..!!
- గ్రామ నూతన పంచాయతీ పాలకవర్గం ఏం చేయబోతుందో…?
“జన నిర్ణయం” ప్రత్యేక కథనం
Cotton fields in the danger zone : ప్రకృతి ఒడిలో పచ్చని తోరణంలా ఉండాల్సిన పత్తిపాక గుట్టలు నేడు క్వారీ మాఫియా గుప్పిట్లో చిక్కి విలవిలలాడుతున్నాయి. అభివృద్ధి ముసుగులో జరుగుతున్న ఈ విధ్వంసం పర్యావరణానికే కాదు, స్థానిక ప్రజల మనుగడకే ముప్పుగా మారే ప్రమాదముంది. ఇప్పటికే ఒక భారీ గుట్ట క్రషర్ మిషన్ల ధాటికి నామరూపాలు లేకుండా పోగా, ఇప్పుడు మరో గుట్టను కబళించేందుకు కొందరు మైనింగ్ మాఫియా ప్రతినిధులు పావులు కదుపుతున్నారనేది బహిరంగ రహస్యంగా మారింది. గుట్టలు అంటే కేవలం రాళ్ల కుప్పలు కావు. అవి స్థానిక పర్యావరణ సమతుల్యతను కాపాడే రక్షణ కవచాలుగా చూడాలి.
లాభమే పరమావధిగా సాగుతున్న ఈ క్రషర్ల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవడమే కాకుండా, క్రషర్ల నుండి వెలువడే సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల వ్యాధులకు, చర్మ వ్యాధులకు కారణమవుతాయని గుర్తించాలి. భారీ పేలుళ్లు (Blasting) వల్ల గ్రామాల్లోని ఇళ్లు పగుళ్లు ఇస్తున్నాయి. నిత్యం శబ్ధకాలుష్యం పత్తిపాకను వెన్నంటే ఉంటున్న పరిస్థితి. ఇక పంట పొలాలపై దుమ్ము పేరుకుపోయి కిరణజన్య సంయోగ క్రియకు ఆటంకం కలుగటం, తద్వారా దిగుబడి గణనీయంగా తగ్గిపోవటం లాంటి నష్టాలు పత్తిపాక గ్రామానికి అలవాటుగా మారింది.
Cotton fields in the danger zone..!?
గ్రామ నూతన పంచాయతీ పాలకవర్గం ఏం చేయబోతుందో…?
ఇప్పటికే ఒక గుట్టను మింగిన క్రషర్ నిర్వహణలో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా క్రషర్ యాజమాన్యం గ్రామ పంచాయతీకి చెల్లించాల్సిన ‘లైసెన్స్ ఫీజు’ మరియు ఇతర పన్నులను సక్రమంగా చెల్లిస్తున్నాయా..? లేదా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. భూగర్భ గనుల శాఖకు కట్టాల్సిన రాయల్టీలో గోల్మాల్ జరుగుతోందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనల ప్రకారం వాటర్ స్ప్రింక్లర్లు, గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయడంలో యాజమాన్యాలు పట్టింపు లేనట్లుగానే ఉన్నట్లు ప్రచారం. ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో పత్తిపాక గ్రామ నూతన పంచాయతీ పాలకవర్గమైనా మేల్కొని ఇప్పటికే గుట్టను మింగిన క్రషర్ పట్ల, మరో గుట్టను మింగేందుకు సిద్దమవుతున్న అంశం పట్ల ఎలా వ్యవహరిస్తుంది…? గ్రామం వైపా… క్రషర్ల వైపా..? తగు విధంగా వ్యవహరిస్తుందా లేదా అనేది వేచిచూడాల్సిందే.
Cotton fields in the danger zone..!?
అధికారుల మౌనం.. ఎవరి కోసం…?
కళ్ళ ముందే ప్రకృతి విధ్వంసం జరుగుతున్నా, గుట్టలు మాయం అవుతున్నా..సంబంధిత శాఖల అధికారులు మౌనం వహించడం వెనుక ఉన్న మతలబు ఏమిటి అనే ప్రశ్నలు సహజంగానే ఉద్భవిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, పత్తిపాక గుట్టల దగ్గర క్షేత్రస్థాయి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి కావాలి. కానీ అది పర్యావరణాన్ని బలిపెట్టి కాదు. గుట్టలను కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తును కాపాడుకోవడమే అనేది మరువొద్దు. నిబంధనలకు విరుద్ధంగా మరో గుట్టను ధ్వంసం చేసే ప్రయత్నాలను తక్షణమే అడ్డుకోవాలి. అధికార యంత్రాంగం పత్తిపాక గుట్టలను ‘ప్రొటెక్టెడ్ జోన్’గా ప్రకటించి, స్థానిక పర్యావరణాన్ని కాపాడేలా చర్యలు చేపట్టలి. గ్రామ ప్రజలు, పర్యవరణ, ప్రకృతి ప్రేమికులు, సహజ వనరుల పరిరక్షణ ప్రతినిధులు ఐక్యంగా గుట్టల విధ్వంసాన్ని నిరసించాల్సిన అవసరం ఉంది.
