
రూ. 7 కోట్ల ధాన్యం మాయం చేసిన మిల్లర్ పై హనుమకొండ పౌరసరఫరాల శాఖ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు…
ఆర్ఆర్ యాక్ట్ అమలు చేసినా కార్తికేయ మిల్లర్ ఆస్తుల వేలంపై హనుమకొండ జిల్లా కలెక్టర్ ఎందుకు ముందడుగు వేయడం లేదో..?
కార్తికేయ మిల్లుపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్పందనపై సర్వత్రా ఉత్కంఠ…?
పౌరసరఫరాల శాఖకు శఠగోపం పెట్టి, ఆ శాఖ పంపిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్ లో అమ్ముకొని కోట్లు కొల్లగొట్టిన సదరు మిల్లర్ పై ప్రభుత్వం ఆర్ఆర్ యాక్ట్ అమలు చేసినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు సదరు మిల్లర్ ఆస్తులు వేలం వేయకపోవడం వెనుక ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు లేకపోలేదు..? హనుమకొండ జిల్లా నడికూడ మండలం నర్సక్కపల్లి శివార్లలో ఉన్న కార్తికేయ మిల్లు పై హనుమకొండ జిల్లా కలెక్టర్ రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేయగా క్రిందిస్తాయి ఉద్యోగులు మిల్లర్ ఆస్తులు వేలం వేయకుండా కాపాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పౌరసరఫరాల శాఖలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కమిషనర్ సదరు మిల్లర్ ఆస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే..!