
సిఎంఆర్ ఎగగొట్టిన రైస్ మిల్లర్లకు ప్రభుత్వ అధికారులే అండదండాలు ఇస్తున్నారని వారిపై చర్యలు తీసుకోకపోవడమే దీనికి నిదర్శనమని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.తిరుపతి అన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి అందించకుండా లాభాలకు ప్రైవేటు మార్కెట్లో అమ్ముకొని లక్షలు , కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఎగనామం పెట్టిన రైస్ మిల్లర్లకు జిల్లా అధికారులు వత్తాసు పలకడం, మళ్లీ వారికే ఎక్కువ మొత్తంలో ధాన్యం సేకరణకు అవకాశం ఇవ్వడం, గతంలో పెండింగ్ లో ఉన్న బకాయిల గురించి ప్రస్తావన చేయకపోవడం అధికారులకే చెల్లిందని అన్నారు. నడికూడ మండలంలోని కార్తికేయ రైస్ మిల్లర్ పై ఆర్ఆర్ యాక్ట్ అమలు చేసినప్పటికీ ఆస్తులు వేలం వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శాయంపేట, కమలాపూర్ మండలాల్లోనూ అధికారుల ఆశీస్సులతో రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రికవరీ చేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాల్సింది పోయి, గండి కొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, అనేకసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రైతులను ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.