
- ఆర్ఆర్ యాక్ట్ నమోదు చేసినప్పటికీ ఆస్తుల వేలం ఎందుకు ఆపుతున్నట్లు..?
- మిల్లర్ ఆస్తుల వేలం తప్పదన్న అదనపు కలెక్టర్…
- నెల రోజులు గడిచినా ఆస్తుల వేలం వేయకపోవడంలో అంతర్యం ఏమిటి..
- కార్తికేయ రైస్ మిల్ కు పరోక్షంగా సహకరిస్తున్న ఓ అధికారి
- పౌరసరఫరాల శాఖ మంత్రి మాటను లెక్కచేయని హన్మకొండ జిల్లా పౌరసరఫరాల శాఖ
హనుమకొండ జిల్లా నడికూడ మండలంలో ఉన్న కార్తికేయ మిల్లు ఆస్తులను వేలం వేయడం వెనుక ఓ అధికారి హస్తమున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సదరు అధికారి ఆ మిల్లర్ కు అండగా నిలబడడం వల్లే కార్తికేయ రైస్ మిల్ ఆస్తులను వేలం వేయడంలేదని ప్రచారం జరుగుతోంది. ఆ మిల్లర్ కు సహకరిస్తున్న అధికారి హోదా పెద్దది కావడంతో మిగిలిన అధికారులు కూడా సదరు మిల్లర్ విషయంలో వెనకడుగువేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
- ఆర్ఆర్ నమోదు చేశారు… ఆస్తుల వేలం మరిచారు..
హనుమకొండ జిల్లాలోని కార్తికేయ రైస్ మిల్లు 2020-21 రబీ సీజన్ కు సంబంధించి రూ. 7 కోట్ల ధాన్యం మాయం చేయగా రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాలతో సదరు మిల్లర్ పై రెవెన్యూ రికవరీ యాక్ట్ (ఆర్ఆర్ యాక్ట్) ను నమోదు చేశారు. ఆర్ఆర్ నిబంధనల ప్రకారం సదరు మిల్లర్ ఆస్తులను వేలం వేసి ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను వసూలు చేస్తారు. కానీ కార్తికేయ రైస్ మిల్ విషయంలో అలాంటిదేమి కనిపించట్లేదు ఎందుకంటే సదరు మిల్లర్ వెనుక ఓ పెద్ద సారు ఉండడంతో ఆస్తుల వేలం జరుగట్లేదని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు రూ. 7 కోట్ల ధాన్యం మాయం చేసి ఆర్ఆర్ యాక్ట్ నమోదు కాబడ్డ కార్తికేయ రైస్ మిల్ పై ఎలా స్పందిస్తారో చూడాల్సిందే..!