
ఈ నేపథ్యంలో “మావో”లు తమ పంథా మార్చుకోకపోతే సమాజానికి ఏమాత్రం ఉపయోగం లేదు. సుమారు ఆరు దశాబ్దాల నగ్జల్బరీ, మావోయిస్టు ఉద్యమం రాజకీయ సిద్దాంతం ఉన్న పార్టీనే కావచ్చు. అయినప్పటికీ కాలానుగుణంగా తమ సిద్దాంతం మార్చుకోకపోతే ఓడిపోవడమో, లేక కనుమరుగు అవడమో లాంటి రక్తసిక్త యుద్ద చరిత్ర మాత్రమే మిగిలిపోతుంది.
అయితే పాలకులు తమ టార్గెట్ ఏమిటో ఇప్పుటికే చాలా స్పష్టంగానే ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి వరకు మావోయిస్టు పార్టీని లేకుండా చేస్తామని చెప్తూనే ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ సంకల్పం, భద్రతా బలగాల ఉమ్మడి ప్రయత్నాలతో దేశంలో మావోయిస్టు పార్టీ కొన ఊపిరితో ఉందని సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన “ఎక్స్” ఖాతాలో వ్యాఖ్యానించిన విషయం కూడా బహిరంగమే. ఇంతటి క్లారిటీతో పాలకులు ఉన్నప్పుడు ఆ రాజ్య శక్తిని ఎదుర్కునే పరిస్థితి ఉందా లేదా అనే వాస్తవ పరిస్థితిని “మావో”లు పరిగణనలోకి తీసుకోవాలి.
ఇంకా చెప్పాలంటే కనీసం ప్రతిఘటించే పరిస్థితుల్లో కూడా మావోయిస్టు పార్టీ లేదని పరిస్థితులు, విశ్లేషణలు తేటతెల్లం చేస్తున్నాయి. అన్ని రకాలుగా బలమైన శక్తిగా ముందుకు సాగుతున్న రాజ్యంతో మావోయిస్టు పార్టీ తలపడే పరిస్థితి మారిన ఈ కాలం పరిస్థితుల్లో ఏమాత్రం లేదు. టెక్నాలజీ క్షేత్ర స్థాయిలో ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సైతం జనానికి ఊరటనిస్తూనే ఉన్నాయి. యూవత సైతం తమ భవిష్యత్తును, మనుగడను చూసుకుంటున్న పరిస్థితి ఉంది. మావోయిస్టులే కాదు పార్లమెంటరీ పంథాలో ప్రజాస్వామికయుతంగా ఎన్నికల్లో పాల్గొంటున్న ఎర్రజెండా పార్టీల వైపు కూడా యువత అంతగా ఆసక్తికరంగా లేరనేది ఏమాత్రం పరిశీలించిన కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టులు సాయుధ పోరుతో చేసేది ఏముంటుంది..? ఇక మావోయిస్టులు హింస వైపు నిలబడ్డారని ఆ హింసను అరికట్టే పేరుతో పాలకులు పోలీసు బలగాలతో ప్రతిహింస చేయకూడదు. హింసను అరికట్టే అవసరం బాధ్యత పాలకులపై ఉన్నప్పటికీ అది రాజ్యాంగ బద్దంగానే, రాజ్యాంగ న్యాయ సూత్రాలకు లోబడి ఉండాలి. మావోయిస్టులు సైతం తుపాకులతో సాధించేది ఏమీ లేదని గుర్తించాలి. తూపాకులు కాదు పుస్తకాలు పట్టాలి. రాజ్యాంగం వైపు నడువాలి. భారత రాజ్యాంగాన్నే మార్చాలనుకునే పాలకులున్న దేశంలో తుపాకులతో చేసే యుద్ధం గెలుస్తుందని భావించకూడదు. తమ పంథా మార్చుకుని సాయుధ ఉద్యమానికి బదులు ప్రజాస్వామ్య బద్ధంగా పార్లమెంటరీ పద్దతిని అనుసరించేలా తమ సిద్దాంతాన్ని మార్చుకోని ముందుకు సాగితే సమాజానికి కొంత మేలు జరుగుతుందనేది గుర్తించక తప్పదు.
సాయుధ మార్గాన్ని వీడి ఎన్నికల్లో పాల్గొంటున్న పార్టీలు ప్రజల్లో నిలబడుతున్న సత్యం కనబడుతూనే ఉంది. నేపాల్ మావోయిస్టులు ప్రచండ నేతృత్వంలో సాయుధ మార్గం వీడి ఎన్నికల్లోకి వచ్చారు. అధికారాన్ని సైతం చేపట్టారు. ప్రస్తుతం అధికారంలో లేకపోయినా ప్రజల్లో ఉన్నారనేది గమనించాలి. మనదేశంలోనూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ లాంటి పార్టీ తమ పంథాను మార్చుకొని బీహార్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలో పోటి చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎంపీలుగా గెలుస్తూ ఆ పార్టీ ప్రజల పార్టీగా కొనసాగున్నది. ఇతర అనేక రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో పాల్గొంటూ విస్తరిస్తోంది. మన తెలంగాణలోనూ కొన్ని ఎంఎల్ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసి మనుగడ సాగిస్తున్న విషయం మరువొద్దు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ లాంటి పార్టీ ఎన్నికల్లోకి వచ్చి గుమ్మడి నర్సయ్య లాంటివారు ఎమ్మెల్యేగా సుధీర్ఘ కాలం ప్రజల మనిషిగా ఉన్నారు. ఇవి మచ్చుకు మాత్రమే. సాయుధ మార్గం వీడి ప్రజల్లోకి వచ్చి ఎన్నికల పంథాను అనుసరించిన పార్టీలు మనుగడ సాగిస్తున్నాయి. ఫలితాలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ చరిత్ర రుజువు చేస్తున్న అనుభవాలు.
అయితే మావోయిస్టు పార్టీ మాత్రం “చారుమంజుందార్”ను సరిగా అర్థం చేసుకున్నట్లు లేదనిపిస్తుంది. “ప్రజల ప్రయోజనాలే పార్టీ ప్రయోజనాలు”గా చూడాలని చెప్పిన చారుమంజుందార్ ఆలోచనను భారత మావోయిస్టు పార్టీ మరోసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు అడవుల్లో లేరని ఇప్పటికైనా గ్రహించాలి. ప్రజల ప్రయోజనాలకు ఏమాత్రం ఉపయోగపడని సాయుధ పోరు ఆ పోరులో ప్రజలు భాగస్వామ్యం అయ్యో పరిస్థితి లేని మార్గం ప్రయోజనం లేని మార్గమే అవుతుంది. అందుకే సాయుధ మార్గం వీడి ఎన్నికల్లోకి వచ్చేలా తమ మార్గం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మావోయిస్టు పార్టీ గతంలో జనంలోకి వచ్చే అవకాశాలు చేజార్చుకున్నప్పటికీ మరో అవకాశం కోసం అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.
రాజేందర్ దామెర (దారా ) సీనియర్ జర్నలిస్ట్ – వరంగల్ jananirnayam2022@gmail.com