
ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్
రైతుల పత్తి కొనుగోళ్లలో అవకతవకలను అరికట్టి దోపిడిని నివారించి వాస్తవ సాగుదారుల పత్తిని సిసిఐ బేషరతుగా కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు సమాఖ్య ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.
ఏఐకేఎఫ్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం వరంగల్ మార్కెటింగ్ ఉన్నతాధికారులైన జేడీఎం, డీడియం, డిఎంఓ, ఏనుమాముల మార్కెట్ కార్యదర్శులను కలిసి సిసిఐ పత్తి కొనుగోళ్లలో జరుగుతున్న అవకతవకలపై రైతులకు జరుగుతున్న ఇబ్బందులు నష్టాలను వివరించి మెమోరాండం ఇచ్చారు.
ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ పత్తి రైతులు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ప్రకృతి వైపరీత్యాలను దాటుకొని అరకొరగా పత్తిని పండిస్తే మద్దతు ధర కల్పించి ఆదుకోవాల్సిన సిసిఐ మార్కెటింగ్ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సరైన కాదన్నారు. వాస్తవ సాగుదారులైన పత్తి రైతుల పంటను కుంటి సాకులతో కొనుగోలు చేయకుండా నిరాకరిస్తూ మధ్య దళారులు గ్రామాల్లో రైతులకు మాయ మాటలు చెప్పి అతి తక్కువ ధరకు తీసుకువచ్చిన పత్తిని మాత్రం తప్పుడు పద్ధతులలో కొనుగోలు చేస్తున్నారని ఇదంతా దళారులు వ్యాపారులు సిసిఐ అధికారుల కుమ్మక్కై చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని ఆరోపించారు. పత్తి రైతును అష్టదిగ్బంధనం చేసి దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో బస్తాలలో తెచ్చిన పత్తిని అలాగే కుంటి సాకులతో సీసీఐ నిరాకరించే పత్తిని ప్రైవేటు వ్యాపారులు అతి తక్కువ ధర కొనుగోలు చేసి అదేపత్తిని సిసిఐకి అమ్ముతున్నారని ఇదంతా తెలిసిన అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పత్తి కొనుగోలు చేసే పత్తి మిల్లులలో పత్తి సెలక్షన్లో తూకంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని తక్షణమే అధికార యంత్రాంగం సిసిఐ కొనుగోలు కేంద్రాలపై పర్యవేక్షణ పెంచి రైతులకు జరుగుతున్న మోసాలను అరికట్టి దోపిడీకి పాల్పడుతున్న వ్యాపారులు మధ్య దళారులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని రైతులకు జరిగే నష్టాన్ని నివారించాలని కోరారు. అధికార యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోకపోతే రైతుల పక్షాన పత్తి కొనుగోలులో జరుగుతున్న దోపిడిని పట్టబయలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ రెడ్డి హంస రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుసుంబ బాబూరావు మహమ్మద్ ఇస్మాయిల్ ఏఐసిటియు జిల్లా కార్యదర్శి సుంచు జగదీశ్వర్ జిల్లా సహాయ కార్యదర్శి గోనే రామచందర్, జిల్లా నాయకులు ఐతమ్ నాగేష్, పరిమళ గోవర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు.