
- తక్షణమే అక్రమ కేసు ఎత్తివేయాలి
- “జన నిర్ణయం” ఎడిటర్ దామెర రాజేందర్ డిమాండ్
- ప్రశ్నించే గొంతులను నొక్కడంలో భాగంగానే అక్రమ కేసులు..
- జర్నలిస్టు సమూహం ఐక్యంగా అక్రమ కేసు దుశ్చర్యను ఖండించాలని పిలుపు
Case against “Janam Sakshi” editor Rahman is undemocratic : జనం సాక్షి పత్రిక ఎడిటర్ ముజీబుర్ రెహమాన్ పై కేసు నమోదు చేయడం అప్రజాస్వామికమని “జన నిర్ణయం” ఎడిటర్ దామెర రాజేందర్ (దారా) అన్నారు. తక్షణమే అక్రమ కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే గొంతులను నొక్కడంలో భాగంగానే అక్రమకేసుల బనాయింపు అని అన్నారు. ఇలాంటి దుశ్చర్యను జర్నలిస్టు సమూహం ఐక్యంగా ఖండించాలని పిలుపునిచ్చారు.
కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతాంగం జరుపుతున్న పోరాటంలో రెహమాన్ ను బాధ్యుడిగా పేర్కొంటూ ఆయనపై అక్రమ కేసు బనాయించడం సరైంది కాదని ఆయన అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రశ్నించేవారి గొంతునొక్కడమేనని, బాధ్యతాయుతమైన పత్రిక ఎడిటర్ పై అక్రమ కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. ప్రజలతో పాటు ఆందోళనలో పాల్గొనకపోయినప్పటికీ, రైతుల ఆందోళనకు సంబంధించిన వార్తలు ప్రచురించినందుకు జర్నలిస్టు రెహమాన్ ను ప్రధాన నిందితుల్లో చేర్చడం దుర్మార్గమని అన్నారు.
Case against “Janam Sakshi” editor Rahman is undemocratic
వ్యతిరేక వార్తలపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయాలి తప్ప అక్రమంగా కేసులు నమోదు చేయటం సరికాదని సూచించారు. పెద్ద ధన్వాడలో ఇథనాలు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ప్రత్యక్షంగా రెహమాన్ ఘటనాస్థలిలో లేకపోయినా… ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజోలి పోలీసులు కేసు నమోదు చేయడం కక్ష సాధింపు కాక ఏమవుతుందని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి పత్రిక స్వేచ్ఛపై దాడి చేయడమే అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల నిరసన, వ్యతిరేకతను జనంసాక్షి కళ్లకు కట్టినట్లు ప్రచురించడంతోనే ఫ్యాక్టరీ యాజమాన్యం తట్టుకోలేకపోకనే ఇటువంటి కక్ష కట్టి అక్రమ కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు.
Case against “Janam Sakshi” editor Rahman is undemocratic
పర్యావరణానికి, జల కాలుష్యానికి కారణమవుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, యాజమాన్యం ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపించి జనం సాక్షి సంపాదకుడు రెహమాన్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.