- నర్సంపేట డిపో మేనేజర్‌కు విజ్ఞప్తి
Bus facility should be provided to the three villages of Chekkalapalli : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ సపావత్ కవిత దేవు నాయక్ శుక్రవారం నర్సంపేట డిపో మేనేజర్‌కి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సుమారు రెండు వేలమందికి పైగా జనాభా ఉన్న గ్రామం నుంచి ప్రతి రోజు వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు పట్టణాలకు వెళ్తుండడంతో రవాణా సౌకర్యం అత్యవసరమైందని వివరించారు. బస్సు సౌకర్యం లేమితో ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి రావడంతో ఆర్థికంగా, సమయ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యార్థులు పరీక్షల సమయంలో సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.అలాగే మూడు చెక్కలపల్లి మీదుగా మాన్సింగ్ తండా, చంద్రు తండా, కోడిసెలకుంట తండా, గుర్తూర్ తండా ప్రాంత ప్రజలు కూడా నర్సంపేటకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. అందరి సౌకర్యార్థం ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 1.30 గంటలకు, సాయంత్రం 5 గంటలకు మూడు ట్రిప్పులు నడపాలని అధికారులను ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నెహ్రుజి, లంబాడి హక్కుల పోరాట సమితి నల్లబెల్లి మండల అధ్యక్షుడు దారావత్ బోజ్యా నాయక్, సపావత్ యాకన్న తదితరులు పాల్గొన్నారు.
