
ప్రాణాలతో చెలగాటమాడిన “బంధన్” హాస్పిటల్ ను సీజ్ చేయాలని పలువురి డిమాండ్
“బంధన్” హాస్పిటల్ పై “ఐఎంఏ”కు బాధితుడి ఫిర్యాదు…
సానుకూలంగా స్పందించిన ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కాళీ ప్రసాద్…
విచారణ చేపడుతామని హామీ
హనుమకొండలోని “బంధన్” హాస్పిటల్ ను సీజ్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా హాస్పిటల్ నిర్వహించడమే కాకుండా ఏకంగా “వైద్యో యమధర్మరాజ హరి”గా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మేరకు బుధవారం బాధితుడైన జర్నలిస్టు కృష్ణ హనుమకొండ “బంధన్” హాస్పిటల్ లో తనకు జరిగిన అన్యాయంపై విచారణ చేపట్టి బంధన్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని బుధవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాళిప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. తనకు ఆ హాస్పిటల్ లో తప్పుడుగా అందించిన ట్రీట్మెంట్ రిపోర్ట్స్ చూసి ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కాళిప్రసాద్ సానుకూలంగా స్పందించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై ఐఎంఏ ఈసీలో చర్చించి పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ వినతి పత్రం ఇచ్చిన బృందంలో పలువురు వరంగల్ తూర్పు జర్నలిస్టులు పాల్గొన్నారు. మరోవైపు పలు ప్రజాసంఘాలు సైతం ఇట్టి విషయంలో సమగ్రమైన విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున స్పందిస్తూ హనుమకొండలోని బంధన్ హాస్పిటల్ ను తక్షణమే సీజ్ చేయాలని, ప్రాణాలతో చెలగాటమాడిన డాక్టర్ల పైన చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏది ఏమైనప్పటికీ బంధన్ హాస్పిటల్ యమధర్మరాజు కేంద్రంగా మారుతోందని, తక్షణమే విచారణ చేపట్టి వైద్యసేవల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడిన డాక్టర్లపై చర్యలు చేపట్టానే డిమాండ్ విస్తృతమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించబడుతున్న హాస్పిటల్ ను తక్షణమే సీజ్ చేయాలని పలువురు భావిస్తున్నారు.