
ప్రపంచంలో ఉన్న చాలా జంతువులను తెచ్చి పొడుపు కథల్లోనూ, కథల్లోనూ, కవితల్లోనూ నింపేశారు సృజన్ చిల్డ్రన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా.. కందేపి రాణీప్రసాద్. ఆమె జంతుశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చదివిందని జంతువుల మీద అమిత ప్రేమ చూపిస్తుంటారు. కనిపించిన ప్రతి వస్తువునూ జంతువుగా మార్చేసే రాణీ ప్రసాద్ కనికట్టు విద్య గురించి తెలుసుకుందాం. తాను సాహితీ వేత్త అయినందున సాహితీ ప్రక్రియ లన్నింటిలో జంతువుల్ని చొప్పిస్తుంటుంది. అంతేకాదు ఆసుపత్రి వ్యర్థాలతోనూ జంతువుల ఆకారాల్నే సృష్టిస్తుంది. అంతేనా వాల్లింట్లో ఉన్న కుండీల్లోని మొక్కల యొక్క ఆకులు, తీగలు, తొడిమలు, పూలు, విత్తనాలు ఒకటేమిటి మొక్కల ప్రతి భాగంతోనూ జంతువుల్ని చెక్కేస్తుంది. ఇంకా వినండి వంటింట్లోని కందిపప్పు, మినపపప్పు లాంటి వంట దినుసులతో వంట చేయడమే కాదు జంతు ప్రతిమలనూ చేసేస్తుంది. కొన్ని జంతువులను ఇంటిముందు ముగ్గులుగా నిలబెట్టింది. ఇంటి ముందున్న పూల కుండీలనూ జంతువులుగా మార్చేసింది. ఇంకా టామ్ & జెర్రీ, మిక్కీ మౌస్, డోనాల్డ్ డక్ లను గోడ కుర్చీ వేయించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శునక జాతుల్ని తెచ్చి వాటి ప్రత్యేకతలను తెలియజేస్తూ తెలుగు దేశానికి డాగ్ వరల్డ్ పేరుతో పరిచయం చేసింది. రాట్ వీలర్, గోల్డెన్ రిట్రీవర్, లాబ్రడార్, జర్మన్ షెపార్డ్, సెయింట్ బెర్నాల్డ్, వంటి పలు జాతుల కుక్కలతో స్నేహం చేసి గత 35 సంవత్సరాలుగా ఇంట్లో పెంచుకుంటున్నారు. డాల్ఫిన్లూ సీలయన్లూ వంటి నీటి జంతువుల విన్యాసాల్ని కవితాత్మకంగా కథనాలు రాసి పిల్లలకు పంచారు. డ్రాకో వంటి ఎగిరే బల్లికీ, కరెంటు షాక్ కొట్టే విద్యుత్ చేపలకూ పొడుపు కథలు రాసి ప్రాథమిక స్థాయి విద్యార్థులకే డిగ్రీ పాటాలు చెప్పేస్తున్నారు. సీతకొకచిలుక, స్వీటీ మిల్కీ ఓ చిలుక అనే పుస్తకాలలో కథలు కవితలుగా మారిపోయిన జంతువులు బాల బాలికలను అలరిస్తున్నాయనటంలో సందేహం లేదు. పెంగ్విన్ ల నడకలు, కోలా విన్యాసాలు ఆస్త్రీచ్ గుడ్లు చిత్రాలై బాల బాలికలకు వీడియో పాటాలై యూట్యూబ్ లో సంచరిస్తున్నాయి. పగడపు దీవుల ఫోటోలు తెచ్చి బాలమిత్ర కథల్ని కూర్చి తన బాల సాహిత్యపు ఖాతాలో వేసుకున్నారు. మృగయాపురి పుస్తకంలో జంతువులన్నీ స్వేచ్ఛగా విహరిస్తూ తమ అందచందాలు ఆరబోస్తూ తమను ప్రతిష్టించే విధానాలను చెప్పుతున్నాయి. అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన క్రూగర్ నేషనల్ పార్క్, నందన్ కానన్ జూపార్క్ టైగర్, లయన్ల సఫారీలు చూసి జాపార్కుల యాత్రా కథనాలై సృజన్ పిల్లల హాస్పిటల్లో పిల్లల చెంత చేరుతున్నాయి శ్రీలంక లోని తాబేళ్ళ మ్యూజియం, సింగపూర్ బటర్ ఫ్లై పార్కు సైతం వ్యాసాలై హాస్పిటల్ గోడల కెక్కాయి. అంతరించిపోయే దశకు చేరుకున్న జంతువులు సైతం రెడ్ డాటా బుక్ లోకి ఎక్కీ ఎక్కగానే సృజన్ హాస్పిటల్ కు వచ్చేస్తున్నాయి. అంతర్ధానమైపోయిన ‘డోడో’ ‘పక్షి సమాధినీ ఫొటోగా తీసుకొచ్చారు రాణీప్రసాద్. జంతువులకు తన చిత్రాల్లోనూ, రచనల్లోనూ స్థానం కల్పిస్తున్న రాణీప్రసాద్ ప్రశంసనీయురాలు.
– వనపర్తి పద్మావతి