An age old introspection భారతదేశ అంతర్గత భద్రతను దశాబ్దాల పాటు శాసించిన ఒక సాయుధ పోరాటం నేడు ముగింపు అంచున నిలబడి ఉంది. ఇంకా చెప్పాలంటే దాదాపుగా ముగిసిందనే చెప్పాలి. అడవుల నుండి వినిపించిన గెరిల్లా గర్జనలు ఇప్పుడు మీడియా చర్చల రూపంలో, నాయకుల మధ్య ఆరోపణల పర్వంగా మారి బహిరంగ వేదికల మీదకు రావడం ఒక యుగాంతాన్ని సూచిస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలోని అగ్ర నేత దేవ్ జీ ఇటీవలి ఇంటర్వ్యూ, ఆ పార్టీలోని అంతర్గత వైరుధ్యాలను మాత్రమే కాదు, ఒక సిద్ధాంతం తన ఉనికి కోసం పడుతున్న వేదనను కూడా బయటపెట్టింది. అయితే, ఈ ‘అంతర్మథనం’లో గెలుపోటముల కంటే, ఈ నాయకుల అడుగులు సమాజంపై చూపే ప్రభావమే ఇప్పుడు చర్చనీయాంశం.
An age old introspection
ఒకరకంగా భారతదేశ సాయుధ విప్లవోద్యమ చరిత్రలో నేడు ఒక వింతైన, కలవరపెట్టే దృశ్యం ఆవిష్కృతమవుతోందని, దశాబ్దాల పాటు ‘క్రమశిక్షణ’కు మారుపేరుగా, రహస్య కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఒక శక్తివంతమైన పార్టీగా చెప్పుకునే పార్టీ నేడు టీవీ కెమెరాల ముందు తన అంతర్గత కలహాలను వీధిన పెట్టుకుంటోందని, ఆ పార్టీలోని చీలికను బహిర్గతం చేయడమే కాకుండా, సాయుధ పోరాటం ఏ తీరానికి చేరుకుందో స్పష్టం చేస్తోంది. అయితే, ఒక పరిశీలకుడిగా మనం సోను లేదా దేవ్ జీ ల పక్షం వహించకుండా, ఈ మొత్తం వ్యవహారాన్ని సమీక్షించడమే ఇక్కడ చేసే ప్రయత్నం. అయితే మావోయిస్టు ఉద్యమ చరిత్రలో చీలికలు కొత్తేమీ కాదు, కానీ ప్రస్తుత ఘర్షణలో సిద్ధాంతం కంటే ‘వ్యక్తిగత అస్తిత్వమే’ ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవైపు మల్లోజుల వేణుగోపాల్ (సోను), ఆశన్న వర్గం వందల సంఖ్యలో క్యాడర్‌తో బయటకు రావడం ఒక వాస్తవిక నిర్ణయంగా కనిపిస్తుంటే, దేవ్ జీ దీనిని ‘ద్రోహం’గా అభివర్ణించడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. ఇక్కడ ప్రశ్న ఎవరిది ద్రోహం అని కాదు.. దశాబ్దాల పాటు ప్రజల కోసం అని చెప్పిన పోరాటం, చివరకు నాయకుల మధ్య ‘ఎవరు స్వచ్ఛమైన విప్లవకారుడు..?’ అనే పోరుగా ఎందుకు మారింది..? అనేదే ప్రశ్న.
An age old introspection
ఈ మొత్తం చర్చలో అత్యంత ఆందోళనకరమైన బాధ్యతారాహిత్యమైన అంశం ‘అర్బన్ నక్సల్స్’ ప్రస్తావన. దేవ్ జీ వంటి అగ్రనేతలు ‘లీగల్’ రాజకీయాల గురించి మాట్లాడటం ఇప్పటికే ‘అర్బన్ నక్సల్స్’ ముద్రతో జైళ్లలో మగ్గుతున్న, లేదా ఆ కేసుల వల్ల కోర్టుల చుట్టూ తిరుగుతున్న పౌర హక్కుల నేతలను, మేధావులను, ప్రజాసంఘాల ప్రతినిధులను, జర్నలిస్టులను మరింత ప్రమాదంలోకి నెట్టేలా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ముందుకు సాగుతున్న వారిపై నిఘా పెరిగేలా చేస్తున్నట్లుగా వ్యవహారం సాగుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. నిజానికి, ఈ అగ్రనేతల అడుగులు వారిని నమ్మి అడవికి వెళ్ళిన అమాయక క్యాడర్‌ను గానీ, లేదా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల కోసం పోరాడే వారిని గానీ కాపాడేలా ఉండాలి. వారి సిద్ధాంత ప్రభావంతో, లేదా ఆ సిద్ధాంతాన్ని ఆపాదించి నిందించి ముద్రవేసి అరెస్టులు చేయబడిన సామాన్యులు, విద్యావంతులు, జర్నలిస్టులు, ప్రజాసంఘాల ప్రతినిధులు మాత్రం చట్టపరమైన ఊబిలో ఉండిపోవడాన్ని కూడా మరువొద్దు. ఈ స్థితిలో తమ ఉనికిని చాటుకునే క్రమంలో వ్యవస్థను మరింత కఠినతరం చేసి, అన్యాయంగా ముద్రలు పడ్డ వారిని ఇబ్బందుల్లోకి నెట్టేసే విధంగా ఉండకూడదు.
An age old introspection
నేడు ప్రధాన స్రవంతిలోకి వచ్చిన సోను, దేవ్ జీ వంటి నేతలు ఒకరిపై ఒకరు బురద చల్లుకునే పరిస్థితి పెరిగడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. వారు అడవిలో ఉన్నప్పుడు పాటించిన ‘సమిష్టి నాయకత్వం’ అనే సూత్రాన్ని ఇప్పుడూ పాటించకపోవడాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలో వారే పరిశీలించుకోవాలి. లొంగుబాటు లేదా పంథా మార్పు అనేది కేవలం వ్యక్తిగత భద్రతకు పరిమితం కాకూడదు.నేతల మధ్య ఒక ఐక్య అవగాహన ఉంటేనే, ఇంకా అడవిలో ఉన్న ఆ పార్టీకి చెందిన ‘మావో’లకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం లభిస్తుంది. విడివిడి గ్రూపులుగా విడిపోయి ఉండటం కంటే ఒక సమూహంగా ప్రభుత్వంతో చర్చలు జరిపి, తమను నమ్మిన వారికి సామాజిక, రాజకీయ పునరావాసం కల్పించడంలో వీరు బాధ్యత వహించాలి. ఐక్యత లేని ఈ నాయకత్వం వల్ల క్షేత్రస్థాయిలో ఉన్న వారికి అభద్రత పెరుగుతుందే తప్ప శాంతి లభించదు అనే అంశాన్ని గమనించాలి. ఇక్కడ శాంతి అనేది కేవలం ఆయుధాలు కింద పెట్టడం వల్ల రాదు. దశాబ్దాల పాటు జరిగిన హింసకు బాధ్యత వహించడం, బాధితులకు న్యాయం చేయడం, రాజ్యాంగ విలువలకు నిజాయితీగా తలవంచడం ద్వారానే వస్తుంది.
An age old introspection
చివరిగా ’ఒక యుగాంతపు అంతర్మథనం’ అంటే కేవలం ఒక ఉద్యమం ముగియడం మాత్రమే కాదు. ఆ ఉద్యమం విడిచిపెట్టిన గాయాలకు చికిత్స చేయడం కూడా. తమ వాయిస్, తమ అభిప్రాయాలు ప్రజలకు తెలియపరుచడం కోసం మీడియా చర్చలు అవసరమే కానీ సోను లేదా దేవ్ జీ మధ్య జరుగుతున్న, లేదా అగ్రనేతల మధ్య జరుగుతున్న మీడియా చర్చల వాదనల ఆరోపణల ప్రక్రియతో ముందే చెప్పినట్లుగా ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదు. నాయకులు తమ వ్యక్తిగత ఇగోలను పక్కనపెట్టి, ఒక ఐక్య అవగాహనతో ప్రజల పక్షాన, రాజ్యాంగ బద్ధంగా నిలబడాలి. ప్రభుత్వం కూడా వీరిని రాజకీయ పావులుగా వాడుకోకుండా, దశాబ్దాల హింసలో నలిగిపోయిన ఆదివాసీలకు, బాధితులకు నిజమైన న్యాయం చేయాలి. అప్పుడే ఈ సుదీర్ఘ పోరాట ముగింపునకు ఒక అర్థవంతమై ముగింపు అవుతుంది.
రాజేందర్ దామెర (దారా) సీనియర్ జర్నలిస్ట్
