- ఈఎంఈ జిల్లా మేనేజర్ రాజు నాయక్ తో జన నిర్ణయం ప్రత్యేక ఇంటర్వ్యూ….
Amma Odi’ services to protect motherhood : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాతృ మరణాల రేటును తగ్గించడమే లక్ష్యంగా 102, 108 సేవలు విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. కేవలం రవాణా వ్యవస్థగానే కాకుండా, గర్భిణీలకు భరోసా ఇచ్చే వ్యవస్థగా ఇది ఎలా రూపాంతరం చెందిందో జిల్లా మేనేజర్ రాజు నాయక్ విశ్లేషించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీలకు సకాలంలో వైద్య సాయం అందించడం, ప్రసవం తర్వాత తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చడంలో భూపాలపల్లి జిల్లాలో 108, 102 (అమ్మఒడి) సేవలు కీలకంగా మారాయి. జిల్లా యంత్రాంగం సహకారంతో ఈ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాం. భూపాలపల్లి జిల్లా భౌగోళిక పరిస్థితులు, అటవీ ప్రాంతాల విస్తీర్ణం దృష్ట్యా వైద్య సేవలు అందించడం ఒక సవాలుతో కూడిన పని. ఈ నేపథ్యంలో 108, 102 (అమ్మఒడి) సేవల పనితీరు, క్షేత్రస్థాయి సవాళ్లు మరియు భవిష్యత్ ప్రణాళికలపై జిల్లా మేనేజర్ రాజు నాయక్ తో “జన నిర్ణయం” ప్రత్యేక ఇంటర్వ్యూ….
Amma Odi’ services to protect motherhood
జన నిర్ణయం : భూపాలపల్లి జిల్లాలో ప్రస్తుతం 108, 102 సేవల పరిస్థితి ఎలా ఉంది..?
రాజు నాయక్ : భూపాలపల్లి జిల్లాలో భౌగోళికంగా అటవీ ప్రాంతాలు, కుగ్రామాలు ఎక్కువ. ఇలాంటి చోట్ల 108 వాహనాలు ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా గర్భిణీలను ఆసుపత్రికి తరలించేందుకు 108, ప్రసవం పూర్తయిన తర్వాత వారిని తిరిగి సురక్షితంగా ఇంటికి చేర్చడానికి 102 ‘అమ్మఒడి’ వాహనాలు నిరంతరం అందుబాటులో ఉన్నాయి.
జన నిర్ణయం : అమ్మఒడి (102) సేవల వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటి..?
రాజు నాయక్ : గతంలో ప్రసవం తర్వాత తల్లీబిడ్డలు ఇంటికి వెళ్లడానికి ప్రైవేట్ వాహనాలపై ఆధారపడి వేల రూపాయలు ఖర్చు చేసేవారు. ఇప్పుడు ఆ భారం లేదు. 102 వాహనం ద్వారా ఉచితంగా, గౌరవప్రదంగా వారి ఇంటి గుమ్మం వరకు చేరుస్తున్నాం. ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచడానికి కూడా దోహదపడుతోంది.
జన నిర్ణయం : అత్యవసర సమయంలో స్పందన సమయం ఎలా ఉంటుంది..?
రాజు నాయక్ : మేము సాధ్యమైనంత తక్కువ సమయంలో సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఫోన్ చేసిన వెంటనే వాహనం ఎక్కడ ఉందో ట్రాక్ చేస్తూ, వేగంగా స్పందించేలా మా సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. ముఖ్యంగా మారుమూల గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం.
జన నిర్ణయం : గర్భిణీలకు మీరు ఇచ్చే సూచన ఏంటి..?
రాజు నాయక్ : ప్రతి గర్భిణీ స్త్రీ తమ పేరును ఆశా వర్కర్ల వద్ద నమోదు చేసుకోవాలి. ప్రసవ వేదన మొదలైన వెంటనే లేదా రెగ్యులర్ చెకప్ కోసం కూడా మా సేవలను వినియోగించుకోవచ్చు. 102, 108 సేవలు పూర్తిగా ఉచితం, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.
జన నిర్ణయం : భూపాలపల్లి వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో 108 సేవల నిర్వహణలో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు ఏమిటి..?
రాజు నాయక్ : మన జిల్లాలో నెట్వర్క్ లేని ప్రాంతాలు, సరైన రహదారులు లేని కుగ్రామాలు (ముఖ్యంగా మహదేవపూర్, పలిమెల మండలాల్లో) చాలా ఉన్నాయి. వర్షాకాలంలో వాగులు పొంగినప్పుడు గర్భిణీలను తరలించడం కత్తిమీద సాము లాంటిదే. ఇలాంటి సమయంలో మా పైలట్లు (డ్రైవర్లు), ఈఎంటీలు (Emergency Medical Technicians) ప్రాణాలకు తెగించి బాధితులను చేరుకుంటారు.
జన నిర్ణయం : 102 ‘అమ్మఒడి’ సేవలు కేవలం ప్రసవం తర్వాతేనా..? దీని పరిధిని వివరించండి..?
రాజు నాయక్ : ఇది చాలామందికి ఉన్న అపోహ. అమ్మఒడి సేవలు కేవలం ప్రసవం తర్వాత ఇంటికి చేర్చడానికే కాదు. గర్భిణీలు చెకప్‌ల కోసం ఆసుపత్రికి వెళ్లాలన్నా, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు వైద్యులను సంప్రదించాలన్నా 102 సేవలు పొందవచ్చు. గర్భిణీగా ఉన్నప్పుడు రెగ్యులర్ పరీక్షలకు రవాణా, ప్రసవం తర్వాత తల్లీబిడ్డల సురక్షిత ప్రయాణంతో పాటు, శిశువుకు టీకాల కోసం ఆసుపత్రికి వెళ్లేందుకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం.
జన నిర్ణయం : గత ఐదేళ్లతో పోలిస్తే జిల్లాలో మాతృ మరణాల తగ్గుదలపై మీ విశ్లేషణ ఏంటి..?
రాజు నాయక్ : గణనీయమైన మార్పు వచ్చింది. గతంలో రవాణా సౌకర్యం లేక ఇంట్లోనే ప్రసవాలు జరిగేవి, దీనివల్ల కాంప్లికేషన్స్ వచ్చి మరణాలు సంభవించేవి. ఇప్పుడు మా రికార్డుల ప్రకారం 95శాతం పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయి. 102 వాహనం ద్వారా గర్భిణీని ట్రాక్ చేయడం వల్ల వారిలో భయం పోయింది. “మా కోసం ఒక వాహనం వస్తుంది” అనే నమ్మకం వారిలో ప్రాణశక్తిని నింపుతోంది.
జన నిర్ణయం : సాంకేతికతను (Technology) మీరు ఎలా వాడుతున్నారు..?
రాజు నాయక్ : ప్రతి 108 మరియు 102 వాహనానికి GPS ట్రాకింగ్ ఉంటుంది. కాల్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. గర్భిణీల గడువు తేదీ (EDD) ఆధారంగా ఆయా ప్రాంతాల్లోని వాహనాలను అప్రమత్తం చేస్తాం. జిల్లా యంత్రాంగం, ఆరోగ్య శాఖ సమన్వయంతో ఒక నెట్వర్క్ లాగా పనిచేస్తున్నాం.
జన నిర్ణయం : సిబ్బందికి ఇచ్చే శిక్షణ గురించి చెప్పండి..?
రాజు నాయక్ : కేవలం డ్రైవింగ్ మాత్రమే కాదు, మా సిబ్బందికి ‘సాఫ్ట్ స్కిల్స్’ ముఖ్యం. గర్భిణీలతో ఎలా ప్రవర్తించాలి, అత్యవసరమైతే వాహనంలోనే ప్రసవం ఎలా చేయాలి (Emergency Delivery) అనే అంశాలపై వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తాం. జిల్లాలో అనేకసార్లు 108 వాహనంలోనే క్షేమంగా ప్రసవాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి.
జన నిర్ణయం : ఓకే మీ సేవలు, పర్యవేక్షణ సజావుగా సాగాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్
రాజు నాయక్ : థాంక్యూ….
