
- ఆ డాంబర్ ప్లాంట్ పై చర్యలేవీ..?
- అధికారుల నిర్లక్ష్యం పట్ల అనుమానాలెన్నో…
- అనుమతులు లేవని చెప్పిన అధికారులు చర్యలు చేపట్టడంలో అలసత్వం ఎందుకనే ప్రశ్నలు…
- తక్షణమే ప్రగతి సింగారం డాంబర్ ప్లాంట్ ను మూసివేయాలని ప్రజాసంఘాల డిమాండ్…
actions on asphalt plant : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామ శివారులోని డాంబర్ ప్లాంట్ కు ఎలాంటి అనుమతులు లేవని చెప్తున్న అధికారులు చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. చర్యలు చేపట్టడం మర్చిపోయారా..? మచ్చికవుతున్నారా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ డాంబర్ ప్లాంట్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో తహశీల్దార్, జీపీ సెక్రటరీ సైతం ఆ ప్లాంట్ కు అనుమతులు లేవని తేల్చిన విషయం తెలిసిందే. ఒకదశలో నోటీసు సైతం జారీ చేయడానికి రెవెన్యూ అధికారులు సిద్ధపడినట్లు చెప్పారు. ప్రజాసంఘాలు సైతం తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో డీవైఎఫ్ఐ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఎలాంటి పర్మీషన్లు లేవని తేలినప్పటికీ అధికారులు చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు పలు సంఘాలు, పర్యావరణ, సహజ వనరుల పరిరక్షణ వేదిక ప్రతినిధులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన డాంబర్ ప్లాంట్ ను తక్షణమే ప్రగతి సింగారం గ్రామ శివారులో నుంచి తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.